Asianet News TeluguAsianet News Telugu

జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. ప్రధాన నిందితుడు సాదుద్దీన్‌కు బెయిల్ మంజూరు

హైదరాబాద్‌లోని అమ్నీషియా పబ్ వద్ద నుంచి బాలికను కారులో తీసుకెళ్లి సాముహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సాదుద్దీన్ మాలిక్‌కు తాజాగా బెయిల్ మంజూరు అయింది. 

Jubilee Hills gang rape accused saduddin malik gets bail
Author
First Published Aug 4, 2022, 10:16 AM IST

హైదరాబాద్‌లోని అమ్నీషియా పబ్ వద్ద నుంచి బాలికను కారులో తీసుకెళ్లి సాముహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఇందులో ఐదుగురు మైనర్లు కాగా, సాదుద్దీన్  మాలిక్ ఒక్కడే మేజర్. ఇప్పటికే ఐదుగురు మైనర్లకు బెయిల్ మంజూరు కాగా.. వారు జువైనల్ బోర్డు నుంచి బయటకు వచ్చారు. అయితే తాజాగా ఈ కేసులో కీలక సూత్రధారి సాదుద్దీన్ మాలిక్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అతడికి నాంపల్లి కోర్టు షరతులతో కూడిని బెయిల్ మంజూరు చేసింది. దీంతో సాదుద్దీన్ మాలిక్‌ను చంచల్‌గూడ జైలు నుంచి విడుదల చేశారు. 

సాదుద్దీన్ బెయిల్ పిటిషన్ విచారణ సందర్బంగా.. ఈ కేసులో చాలా వరకు దర్యాప్తు పూర్తయిందని, ఇప్పటికే స్థానిక కోర్టులో పోలీసులు చార్జిషీట్ దాఖలు చేసినందున నిందితుడికి బెయిల్‌కు అర్హత ఉందని అతని తరపు న్యాయవాది వాదించారు.

అంతకు ముందు జూలై 26వ తేదీ సాయంత్రం.. నాంపల్లి క్రిమినల్ కోర్టు కాంప్లెక్స్‌లోని జువైనల్ జస్టిస్ బోర్డు నలుగురు మైనర్ నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. ఇక, మరో మైనర్ నిందితుడి తరఫు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు జూలై 27న అతడికి బెయిల్ మంజూరు చేసింది. ఇదిలా ఉంటే ఈ కేసులో పోలీసులు గత వారమే కోర్టులో చార్జ్ షీటు దాఖలు చేశారు. 56 రోజుల్లోనే పోలీసులు ఛార్జ్‌షీటు దాఖలు చేయడం విశేషం.

నాంపల్లి కోర్టుతో పాటు జువైనల్ జస్టిస్ బోర్డులో వేర్వేరుగా చార్జ్‌షీట్ దాఖలు చేసిన పోలీసులు.. 65 మందిని సాక్షులుగా చేర్చారు. 600 పేజీలతో కూడిన నేరాభియోగపత్రంలో మైనర్ బాలిక అత్యాచారం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పొందుపరిచారు. ఎఫ్ఎస్ఎల్, డీఎన్ఏ, సీసీటీవీ ఫుటేజ్, ఫోన్ రికార్డులు, మెసేజ్‌లు, పొటెన్షివ్ టెస్ట్, సాంకేతిక ఆధారాలను ఛార్జ్‌షీట్‌లో పొందుపరిచారు. 

మే 28న  జూబ్లీహిల్స్ లోని ఓ పబ్ కు వచ్చిన మైనర్ బాలికను మభ్యపెట్టి సాదుద్దీన్ తో పాటు ఐదుగురు మైనర్లు వాహనంలో బేకరికి తీసుకువెళ్లినట్లు పోలీసులు పేర్కొన్నారు. తర్వాత సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఇన్నోవా వాహనంలో సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు వివరించారు.  ఆ తర్వాత మైనర్ బాలికను పబ్ వద్ద వదిలి పెట్టగా బాలిక అక్కడి నుంచి తన తండ్రిని పిలిపించుకుని ఇంటికి వెళ్ళింది. బాలిక ముభావంగా ఉండడంతో పాటు.. మెడపై గాయాలు గమనించిన తల్లి ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. మే 31వ తేదీన మైనర్ బాలిక తండ్రి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు జూన్ 1వ తేదీన  మైనర్బాలికను భరోసా కేంద్రానికి  పంపించారు. ఇక్కడి నుంచి నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. బాలికను పరీక్షించిన వైద్యులు అత్యాచారం జరిగినట్లు పోలీసులకు నివేదిక ఇచ్చారు. మైనర్ బాలిక చెప్పిన వివరాల ప్రకారం పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన సమయంలో వీడియోలు తీసి వాటిని సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశారు. బాధితురాలు చెప్పిన వివరాలతో పాటు, సాంకేతికతను ఉపయోగించుకుని పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపారు.

ఐదుగురు మైనర్లకు తాము చేస్తున్నది తీవ్రమైన నేరం అని తెలుసు. అయినా, ఏమాత్రం వెనకడుగు వేయకుండా సామూహిక అత్యాచారం చేసినట్లు పోలీసులు నేర అభియోగ పత్రంలో పేర్కొన్నారు. ఇలాంటి సందర్భాల్లో మైనర్ లను సైతం మేనేజర్లుగా పరిగణిస్తూ వెలువడిన న్యాయస్థానాల తీర్పులను జూబ్లీహిల్స్ పోలీసులు జువైనల్ జస్టిస్ బోర్డుకి సమర్పించిన నేరాభియోగపత్రంలో పొందుపరిచారు. ఈ కేసులో ఐదుగురు మైనర్ లను మేజర్లుగా పరిగణిస్తూ విచారణ చేయాలని కోరారు.

Follow Us:
Download App:
  • android
  • ios