హైదరాబాద్ పుడింగ్ మింక్ పబ్ తన కుమార్తె తేజస్వి చౌదరిదంటూ వస్తున్న కథనాలపై స్పందించారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి. ఏప్రిల్ 2వ తేదీన మా అమ్మాయి తేజస్విని ఆ పబ్ లో లేనేలేదని ఆమె స్పష్టం చేశారు.
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్ (radisson blu plaza) ఆవరణలోని పుడింగ్ మింక్ పబ్ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. ఆదివారం తెల్లవారుజామున ఆ పబ్ పై దాడి చేసిన పోలీసులు డ్రగ్స్ ను స్వాధీనం చేసుకోవడం పాటు, బడా బాబుల పిల్లలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా, ఆ పబ్ కాంగ్రెస్ (congress) సీనియర్ నేత, మాజీ ఎంపీ రేణుకా చౌదరి (renuka chowdhury) కుమార్తె తేజస్విని చౌదరిదంటూ (tejaswini chowdary) ప్రచారం జరిగింది. దీనిపై రేణుకా చౌదరి స్పందించారు.
"పోలీసులు హైదరాబాద్ రాడిసన్ బ్లూ హోటల్ లో ఉన్న పుడ్డింగ్ అండ్ మింక్ బార్ పై దాడులు జరిపారు. అయితే, మీడియాలోని కొన్ని వర్గాలు ఆ పబ్ మా అమ్మాయి తేజస్విని చౌదరిదని పేర్కొన్నాయి. అంతేకాదు, పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారని, విచారించారని కూడా ప్రచారం చేశాయి. దీంట్లో ఒక్కటి కూడా నిజం కాదు. పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ కు మా అమ్మాయి తేజస్విని యజమాని కాదు. అసలు ఆ పబ్ మేనేజ్ మెంట్ కార్యకలాపాలతో మా అమ్మాయికి ఎలాంటి సంబంధం లేదు.
పైగా, పోలీసులు దాడులు చేసిన ఏప్రిల్ 2వ తేదీన మా అమ్మాయి తేజస్విని ఆ పబ్ లో లేనేలేదు. అలాంటప్పుడు ఆమెను పోలీసులు అరెస్ట్ చేయడం, ప్రశ్నించడం జరగని పని. ఈ సందర్భంగా నేను మీడియా సంస్థలను కోరేదేమిటంటే... కనీస పాత్రికేయ విలువలు పాటించండి. వార్తలు ప్రసారం చేసేముందు వాస్తవాలు నిర్ధారించుకోండి. మీ సంచలనాత్మక కథనాల కోసం ప్రైవేటు వ్యక్తుల పేర్లను బయటికి లాగే ప్రయత్నం చేయొద్దు" అంటూ రేణుకా చౌదరి హితవు పలికారు.
మరోవైపు పుడింగ్ మింక్ పబ్ వ్యవహారంపై మరో కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్ కూడా స్పందించారు. పబ్‌లో నా కొడుకు దొరికినా కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ PUB లో పట్టుబడిన వారిలో అంజన్ కుమార్ యాదవ్ తనయుడు కూడా ఉన్నట్టుగా మీడియాలో కథనాలు వచ్చాయి. వీటిపై అంజన్ కుమార్ యాదవ్ స్పందించారు. తన కొడుకుపై కుట్ర జరిగిందని ఆయన ఆరోపించారు.
Pudding Mink పబ్ లో దొరికిన వారి పేర్లు బయట పెట్టాలని అంజన్ కుమార్ డిమాండ్ చేశారు. తనతో పాటు తన కుటుంబం గురించి ప్రజలకు తెలుసునని ఆయన చెప్పారు. హైద్రాబాద్‌లో పబ్‌లను మూసేయాలని ఆయన డిమాండ్ చేశారు. అసలు Drugs ఎక్కడి నుండి వస్తున్నాయని Anjan Kumar Yadav ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్దల సహకారం లేకుండా పబ్బుల్లోకి డ్రగ్స్ వస్తున్నాయా అని అంజన్ కుమార్ నిలదీశారు. నగరంలో ఉన్న పబ్‌లలో ఎక్కువగా ప్రభుత్వ పెద్దలవేనని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పబ్‌లు మూసివేయాలని ఆందోళన చేపడుతామని ఆయన హెచ్చరించారు.
