హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ బోర్డు వ్యవహరశైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఇంటర్ బోర్డు లీలలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే 20 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మరో వైపు ఇంటర్ బోర్డు తీరును నిరసిస్తూ విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు ఆందోళనలు చేస్తున్నారు. ఇంటర్ బోర్డు తీరుపై హైకోర్టు కూడ సీరియస్ అయింది. అయితే  ఐదేళ్ల క్రితం కూడ ఇదే రీతిలో తెలంగాణ విద్యాశాఖ తీసుకొన్న కొన్ని నిర్ణయాలు విమర్శలకు తావిచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో  కూడ విద్యాశాఖ మంత్రిగా జగదీష్ రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం కూడ విద్యాశాఖకు ఆయనే మంత్రిగా కొనసాగుతున్నారు.

రాష్ట్రంలో  తొలిసారి కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వంలో  కూడ విద్యాశాఖపై అనేక విమర్శలు వచ్చాయి. ఆ సమయంలో కూడ విద్యాశాఖ మంత్రిగా జగదీష్ రెడ్డి ఉన్నారు. ఆ తర్వాత కొంత కాలానికి జగదీష్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న సమయంలోనే విద్యా శాఖ నుండి  ఆయనను మార్చారు. జగదీష్ రెడ్డికి విద్యాశాఖకు బదులుగా విద్యుత్ శాఖను కేటాయించారు. విద్యుత్ శాఖతో పాటు ఎస్సీ సంక్షేమ శాఖను కూడ ఆయన నిర్వహించారు.

తెలంగాణలో రెండోసారి కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ దఫా కేసీఆర్ మంత్రివర్గంలో జగదీష్ రెడ్డికి చోటు దక్కింది. ఈ దఫా జగదీష్ రెడ్డికి విద్యాశాఖను కేటాయించారు. ఈ నెల 18వ తేదీన విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో చోటు చేసుకొన్న అవకతవకలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని కూడ ఏర్పాటు చేసింది.ఈ కమిటీ రెండు రోజుల్లో నివేదికను అందించనుంది.

ఇంటర్ బోర్డు విషయంలో ఎవరైనా  తప్పులు చేస్తే బాద్యులపై చర్యలు తీసుకొంటామని  విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి ప్రకటించారు.ఇంటర్ బోర్డు విషయంలో చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని కూడ జగదీష్ రెడ్డి విమర్శించారు.

2014లో కూడ జగదీష్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో కూడ ఇదే రీతిలో విద్యాశాఖను వివాదాలు చుట్టుముట్టాయి. ఆ సమయంలో ఫీజు రీ ఎంబర్స్ మెంట్ పథకాన్ని ఎత్తివేయాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. ఫీజు రీ ఎంబర్స్ మెంట్ బకాయిలను చెల్లించేందుకు తొలుత తెలంగాణ సర్కార్ నిరాకరించింది. ఆ తర్వాత ఫీజు రీ ఎంబర్స్‌మెంట్ విడుదల చేసింది.

అంతేకాదు ఫాస్ట్ పథకాన్ని తీసుకొస్తామని ప్రకటించింది. 1956 నిబంధనను తెస్తామని స్పష్టం చేసింది. అయితే ఈ విషయమై ఆ సమయంలో  పెద్ద ఎత్తున వివాదాలు చెలరేగాయి.   1956కు ముందు తెలంగాణలో స్థిరపడిన విద్యార్థులకే ఫాస్ట్ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించాలనేది  ఆనాడు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ కు చెందిన విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఫాస్ట్ పథకాన్ని తెలంగాణ సర్కార్  అమలు చేయలేదు. 

ప్రస్తుతం ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై రాష్ట్రంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి.  విద్యార్థులకు ఎలా న్యాయం చేస్తారో చెప్పాలని హైకోర్టు కూడ రాష్ట్రాన్ని కోరింది.ఈ నెల 29వ తేదీన  స్పష్టమైన కార్యాచరణను హైకోర్టుకు చెప్పాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. ఇంటర్ పరీక్షల్లో చోటు చేసుకొన్న పరిణామాలపై మంత్రి జగదీష్ రెడ్డి ఆలస్యంగా స్పందించారని  రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

 జగదీస్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా కొనసాగిన సమయంలోనే విద్యాశాఖ చుట్టూ వివాదాలు, విమర్శలు చెలరేగాయి. గతంలోనూ, ఇప్పుడూ కూడ అదే రకమైన పరిస్థితులు కన్పిస్తున్నాయనే అభిప్రాయాలు ఆయన సన్నిహితులు వ్యక్తం చేస్తున్నారు. విద్యా శాఖ జగదీష్ రెడ్డికి అచ్చిరాలేదనే అభిప్రాయాలను కూడ వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ శాఖ మంత్రిగా జగదీష్ రెడ్డి కొనసాగినంత కాలం ఈ తరహాలో ఆ శాఖను వివాదాలు చుట్టుముట్టని విషయాన్ని ఆయన సన్నిహితులు గుర్తు చేస్తున్నారు.ఇంటర్ బోర్డు వైఫల్యంపై మంత్రి జగదీష్ రెడ్డి రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

ఆగని ఆత్మహత్యలు: మరో విద్యార్ధిని బలవన్మరణం, 20కి చేరిన మరణాలు

సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడికి ఎస్ఎఫ్ఐ నేతల యత్నం, అరెస్ట్

తెలంగాణలో మరో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య... రైలుకిందపడి దారుణం

ఇంటర్‌బోర్డు చెలగాటం: విద్యార్ధుల ఆత్మహత్యలతో ‘‘తెలంగాణ తల్లి’’ గుండెకోత

మాస్ హిస్టీరియాతోనే విద్యార్థుల ఆత్మహత్యలు: అశోక్ వితండవాదం

దిద్దకుండానే మార్కులు వేస్తారా: ఇంటర్ బోర్డుపై పేరేంట్స్ ఫైర్

జిల్లా ఫస్ట్, ఫస్టియర్‌లో 98 మార్కులు: సెకండియర్‌లో జీరో

తెలంగాణ ఇంటర్ ఫెయిల్: సీఎం రమేశ్ మేనల్లుడు ఆత్మహత్య (వీడియో)

ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత: విద్యార్ధి సంఘాల ఆందోళన