Asianet News TeluguAsianet News Telugu

పట్టు బిగిస్తున్న ఎల్ అండ్ టీ: మైండ్ ట్రీ బోర్డులోకి ఎంట్రీ ఇలా

మిడిల్ రేంజ్ ఐటీ సంస్థ ‘మైండ్ ట్రీ’ని టేకోవర్ చేసేందుకు ఇన్ ఫ్రా మేజర్ ‘ఎల్ అండ్ టీ’ ఒక్కో అడుగు ముందుకేస్తూ వస్తోంది. ఈ దిశలో ఇప్పటికే సుమారు 30 శాతం వాటాలను కైవశం చేసుకున్న ఎల్ అండ్ టీ.. ఓపెన్ ఆఫర్ ద్వారా మెజారిటీ వాటాను పొందేందుకు పూనుకున్నది. దీంతో మైండ్ ట్రీ బోర్డులోకి ఎల్ అండ్ ట్రీ ఎండీ కం సీఈఓతోపాటు ముగ్గురు డైరెక్టర్లు చేరేందుకు మార్గం సుగమమైంది. మైండ్ ట్రీ టేకోవర్‍ను నిలువరించే లక్ష్యంతో గత మార్చిలో ఒడిశా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన సుబ్రతో బాగ్చి వచ్చే నెలలో డైరెక్టర్‌గా వైదొలుగనుండటం గమనార్హం. 

L&T to get 3 seats on Mindtree Board; Subroto Bagchi to step down
Author
New Delhi, First Published Jun 21, 2019, 11:49 AM IST

న్యూఢిల్లీ : మధ్య శ్రేణి ఐటీ సంస్థ మైండ్ ట్రీ టేకోవర్ దిశగా ఇన్ ఫ్రా మేజర్ ఎల్ అండ్ టీ చేస్తున్న ప్రయత్నాల్లో మరో అడుగు ముందుకు పడింది. మైండ్ ట్రీ డైరెక్టర్ల బోర్డులో ఎల్ అండ్ టీ ముగ్గురు సభ్యులను నియమించుకునే వెసులుబాటు లభించింది. మైండ్ ట్రీలో 66 శాతం వాటాను కైవసం చేసుకోవాలని ఎల్ అండ్ టీ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. 

మరోవైపు మైండ్ ట్రీ సహ వ్యవస్థాపకుడు సుబ్రతో బాగ్చీ వచ్చేనెలలో రిటైర్ కానున్నారు. తిరిగి బోర్డులో నియామకం కోసం ఆయన అభ్యర్థించలేదని బీఎస్ఈ ఫైలింగ్‌లో మైండ్ ట్రీ తెలిపింది.

తాజాగా మారిన పరిస్థితుల్లో ఎల్ అండ్ టీ సీఈవో కం మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎన్ సుబ్రమణ్యన్ వచ్చే నెల 16వ తేదీ నుంచి నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో మైండ్ ట్రీ బోర్డు సభ్యుడిగా చేరనున్నారు. అదే రోజు మైండ్ ట్రీ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం) జరుగనున్నది. 

ఇదే సమావేశంలో మైండ్ ట్రీ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా జయంత్ దామోదర్ పాటిల్, రామమూర్తి శంకర్ రామన్ల నియామకానికి ఏజీఎం ఆమోదం తెలపాల్సి ఉంది. ఎల్ అండ్ టీ డిఫెన్స్ బిజినెస్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, అండ్ హోల్ టైం డైరెక్టర్గా జయంత్ దామోదర్ పాటిల్ ఉన్నారు. 

రామమూర్తి శంకర్ రామన్ ఎల్ అండ్ టీ ఆర్థిక వ్యవహారాల ఇన్‌చార్జిగా ఉన్నారు. ఇంకా ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా ప్రసన్న రంగాచార్య, దీపా గోపాలన్ వాద్వా నియామకాన్ని కూడా ఆమోదించాల్సి ఉన్నది. గత మార్చితో సుబ్రతో బాగ్చి డైరెక్టర్ పదవీ కాలం (రొటేషన్) ముగిసింది. 

మైండ్ ట్రీని ఎల్ అండ్ టీ టేకోవర్ చేసేందుకు ప్రయత్నిస్తుండటంతో ఆయన డైరెక్టర్‌గా కొనసాగేందుకు తిరిగి అభ్యర్థించలేదు. ప్రస్తుతం మైండ్ ట్రీ సీఈవో కం ఎండీ రొస్తోవ్ రావణన్ (సహ వ్యవస్థాపకులు), కృష్ణ కుమార్ నటరాజన్ (చైర్మన్), ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎన్ఎస్ పార్థ సారథిలతోపాటు నలుగురు స్వతంత్ర డైరెక్టర్లు ఉన్నారు. 

సుబ్రతో బాగ్చీ గత మార్చిలోనే ఒడిశా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ పదవికి రాజీనామా చేసి మైండ్ ట్రీలో పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టేందుకు ముందుకు రావడం గమనార్హం. అదే మార్చిలో మైండ్ ట్రీలో కాఫీ డే వ్యవస్థాపకుడు సిద్ధార్థ, ఆయన అనుబంధ సంస్థల వాటా 20.32 శాతం వాటాను ఎల్ అండ్ టీ రూ.3000 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. 

తద్వారా భారత్ ఐటీ రంగంలో ఫస్ట్ ఎవర్ హోస్టిల్ టేకోవర్ కోసం ప్రయత్నిస్తున్న సంస్థగా ఎల్ అండ్ టీ నిలిచింది.  బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న ఎల్ అండ్ టీ సంస్థ నాటి నుంచి మైండ్ ట్రీలో వాటా కొనుగోలుకు ప్రయత్నించింది. తదనుగుణంగా తన వాటాను సుమారు 30 శాతానికి పెంచుకున్నది. తాజాగా ఓపెన్ ఆఫర్ ద్వారా 31 శాతం అదనపు వాటా రూ10,700 కోట్ల కొనుగోలు ప్రక్రియ చేపట్టింది. 

ఈ నెల 17వ తేదీన మొదలైన ఓపెన్ ఆఫర్ 28వ తేదీన ముగుస్తుంది. ఓపెన్ ఆఫర్లో మైండ్ ట్రీ వాటా ధర రూ.980లకు ఎల్ అండ్ టీ కొనుగోలు చేస్తుంది. ఒకవేళ ఓపెన్ ఆఫర్ లక్ష్యం పూర్తిగా చేరుకుంటే ఎల్ అండ్ టీ వాటా 66.32 శాతానికి చేరుతుంది. 
మరోవైపు మైండ్ ట్రీ కూడా తన వాటాదారులకు, ప్రమోటర్లకు రెగ్యులర్, స్పెషల్ డివిడెండ్లు చెల్లించేందుకు ముందుకు వచ్చింది. ఇందుకోసం రూ.530 కోట్లు వెచ్చించనున్నది. గత ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 32.2 శాతం పెంచుకున్న మైండ్ ట్రీ లాభం రూ.754.1 కోట్లకు చేరగా, ఆదాయం 28.5 శాతం పెరిగి రూ.7021.5 కోట్లకు చేరింది. 

Follow Us:
Download App:
  • android
  • ios