భవిష్యత్ కృత్రిమ మేధదే! పైథాన్ శిక్షణలో మనోళ్లే ముందంజ!!

రోజురోజుకు పెరిగిపోతున్న అధునాతన టెక్నాలజీతో శరవేగంగా మార్పులొస్తున్నాయి. భవిష్యత్ కృత్రిమ మేధదే అని తేలిపోవడంతో దాని అనుసంధాన కోర్సు ‘పైథాన్’లో పట్టు కోసం శిక్షణ పొందుతున్నారు టెక్కీలు. అందునా భారతీయులదే అగ్రాసనం. 
 

Indians Are The Top Subscribers For Machine Learning Programmes On Coursera

భవిష్యత్ అంతా కృత్రిమ మేధకే ఉందని బలంగా విశ్వసిస్తున్న భారతీయ విద్యార్థులు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ఆ దిశగా నైపుణ్యం సాధించడంలో ముందున్నారు. అందులో భాగంగా కొత్త కంప్యూటర్‌ భాష పైథాన్‌ను నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందులో శిక్షణ పొందే వారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా క్రమేపీ పెరుగుతున్నది. వారిలో అయిదో వంతు కేవలం భారతీయులే ఉంటున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల్లో భారతీయులది ప్రత్యేక ముద్ర. అమెరికాలో ఏటా హెచ్‌1-బీ వీసాలు కైవసం చేసుకుంటున్న వారిలో 80 శాతం భారతీయ కంప్యూటర్ నిపుణులే ఉన్నారు. వారంతా సాఫ్ట్‌వేర్‌ రంగంలో శరవేగంగా వస్తున్న మార్పులను అందిపుచ్చుకుంటూ వృత్తిలో రాణిస్తున్నారు. 

కృత్రిమ మేధ( ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌) వైపు ప్రపంచం వేగంగా అడుగులు వేస్తున్న వేళ అందుకు అవసరమైన పైథాన్‌ భాషను నేర్చుకోవడంలోనూ వారు ముందుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆన్‌లైన్‌ కోర్సులను అందించే కోర్సెరా సంస్థ ద్వారానే ప్రతి వారం ప్రపంచ వ్యాప్తంగా 900 మంది ఈ సాంకేతికతలో శిక్షణ పొందుతుంటే, అందులో 180 మంది భారతీయులే ఉంటున్నారు. అంటే 20 శాతం వాటా మన దేశీయులదేనన్న మాట.

దీనికే ఎక్కువ మంది ప్రాధాన్యం
కృత్రిమ మేధ దిశగా తమ కెరీర్‌ను మలుచుకోవాలని ఆశపడుతున్న వారు ఈ కొత్త సాంకేతికతలో నైపుణ్యం సాధించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. ‘దీన్ని ఇంటర్‌మీడియట్‌ విద్యార్థులూ నేర్చుకోవచ్చు.

పైథాన్‌ తర్వాత పలు మాడ్యూల్స్‌ ఉంటాయి. వాటిని నేర్చుకోవాలంటే ఇంటర్‌ విద్యార్హత సరిపోదు. అందుకే బీటెక్‌ వారే 80 శాతం చేరుతున్నారు’ అని హైదరాబాద్‌కు చెందిన పీర్‌ టెక్నాలజీస్‌ పరిపాలనాధికారి రామ కోటేశ్వర్‌రావు చెప్పారు. 

హైదరాబాద్‌ నుంచి ఏటా దాదాపు 5 వేల మంది ఈ కోర్సులో శిక్షణ పొందుతున్నారని పీర్‌ టెక్నాలజీస్‌ పరిపాలనాధికారి రామ కోటేశ్వర్‌రావు తెలిపారు. ఇది కేవలం కృత్రిమ మేధకే పరిమితం కాదని, వెబ్‌సైట్లు రూపొందించడానికి కూడా ఉపయోగపడుతుందని, బహుళ ప్రయోజనాలు ఉండటంతో దీనికి ఇటీవల ప్రాధాన్యం పెరిగిందని పేర్కొన్నారు.

‘అధిక శాతం మంది ఆన్‌లైన్‌లోనే నేర్చుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అమెరికా, బ్రిటన్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా హైదరాబాద్‌లోని శిక్షణ సంస్థల నిపుణుల ద్వారా ఆన్‌లైన్‌లో నేర్చుకుంటున్నారు’ అని పీర్‌ టెక్నాలజీస్‌కే చెందిన సాఫ్ట్‌వేర్‌ శిక్షణ నిపుణుడు కారుమంచి నారాయణరావు పేర్కొన్నారు.

మూడేళ్ల క్రితమే పాఠ్య ప్రణాళికలో చేర్చాం
కృత్రిమ మేధలో వచ్చే సమస్యలను పరిష్కరించడానికి పైథాన్‌ లాంగ్వేజ్‌ను ఉపయోగించి కోడింగ్‌ రాస్తారని జేఎన్టీయూ హెచ్ కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి శ్రీదేవి తెలిపారు. అందుకే మూడేళ్ల క్రితం బీటెక్‌ మూడో సంవత్సరం  పాఠ్య ప్రణాళికలో దీన్ని సిలబస్‌గా చేర్చామని, చాలా మంది దీనిపై ప్రాజెక్టులు కూడా చేస్తున్నారని పేర్కొన్నారు.

ఎంటెక్‌ విద్యార్థులు కూడా అడగడంతో గత ఏడాది టీసీఎస్‌ సహకారంతో రెండు రోజులపాటు జేఎన్‌టీయూహెచ్‌లో విద్యార్థులకు, బోధన సిబ్బందికి సదస్సు నిర్వహించాం అని 
జేఎన్‌టీయూహెచ్‌ కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాధిపతి శ్రీదేవి వివరించారు.

క్రుత్రిమ మేధస్సుతోపాటు మెషిన్ లెర్నింగ్ కోర్సు.. ఆ వెంటే కోర్సెరా అనే కోర్సుకు డిమాండ్ శరవేగంగా పెరుగుతోంది. కోర్సెరా కోర్సులో చేరిన వారిలో 37 లక్షల మంది ఉన్నారు. నూతన తరం ఐటీ ఉద్యోగాల కోసం శిక్షణ పొందుతున్న వారి సంఖ్య రోజురోజుకు క్రమంగా పెరుగుతోంది. శిక్షణ పొందుతున్న కోర్సుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫైథాన్ ఉన్నాయి. ఈ కోర్సులను నేర్చుకుంటున్న వారిలో అత్యధికులు మహరాష్ట్ర వాసులే. తర్వాతీ స్థానంలో కన్నడిగులు ఉన్నారు.  

తమిళులతోపాటు, ఢిల్లీ, దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్), ఉత్తర్ ప్రదేశ్ వాసులే కోర్సెరా అభ్యసిస్తున్న వారిలో 59 శాతం మంది. భారతదేశంలోని ద్వితీయ, త్రుతీయ శ్రేణి నగరాలు, పట్టణ వాసుల్లో క్రమంగా మెషిన్ లెర్నింగ్ పట్ల ఆసక్తి పెరుగుతోంది.

ప్రపంచ వ్యాప్తంగా 20కి పైగా కార్పొరేట్ సంస్థల సహకారంతో 160 విశ్వవిద్యాలయాల్లో మెషిన్ లెర్నింగ్, ఏఐ, తదితర కోర్సుల్లో శిక్షణ అందిస్తున్నారు. భారతీయులు నేర్చుకుంటున్న కోర్సుల్లో ప్రధానమైంది ‘పైథాన్’ అత్యంత ప్రజాదరణ పొందింది. మిచిగాన్ యూనివర్సిటీలో అత్యధిక భారతీయ విద్యార్థులు దీనిపై శిక్షణ పొందుతున్నారు. ప్రతి వారం భారతదేశంలో 180 నూతన పైథాన్ ప్రోగ్రామర్లు గ్రాడ్యుయేట్లుగా మారుతున్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios