Asianet News Telugu

ట్రంప్ ఆంక్షలతో విలవిల: నాట్ ఈజీ ఫర్ ‘హువావే’.. ఎందుకంటే?

చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘హువావే’ కష్టాలు మొదలవుతున్నాయి. అమెరికా ఆంక్షల నేపథ్యంలో తన ఫోల్డబుల్ మ్యాట్ ఎక్స్ స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసే విషయాన్ని సెప్టెంబర్ వరకు వాయిదా వేసింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జూన్ లో కస్టమర్లకు అందుబాటులోకి రావాలి. ట్రంప్ హుకుం వల్ల హువావే సంస్థ స్మార్ట్ ఫోన్లలో వాడే కీలక విడి భాగాలు అందించే అమెరికా టెక్ సంస్థలు దూరం జరుగుతున్నాయి. ఫలితంగా హువావే వీటికి ప్రత్యామ్నాయాలు వెతుక్కోవడంతోపాటు క్వాలిటీని కాపాడుకోగలిగితేనే మార్కెట్లో తన స్థానాన్ని కాపాడుకోగలదు. బట్ అది అంత తేలిక్కాదు.

Huawei postpones foldable Mate X shipments to September
Author
New Delhi, First Published Jun 17, 2019, 11:18 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

న్యూఢిల్లీ: మొబైల్‌ టెక్నాలజీ దిగ్గజం హువావే కష్టాలు ఒక్కరోజులో తగ్గేలా లేవు. అమెరికాతో వాణిజ్య యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు లక్ష్యంగా మారిన హువావే విపణిలోకి తన ‘మ్యాట్ ఎక్స్’ మోడల్ ఫోల్డబుల్ ఫోన్‌ ఆవిష్కరణను రెండు నెలలు వాయిదా వేసింది. గత ఫిబ్రవరిలోనే ఆవిష్కరించిన ఈ ఫోన్ జూన్ నుంచి వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని ప్రకటించింది. 

కానీ తాజాగా మారిన పరిస్థితుల్లో మార్కెట్లోకి ఫోల్డబుల్ ‘మ్యాట్ ఎక్స్’ ఫోన్ అందుబాటులోకి తెచ్చే విషయమై ఆచితూచి స్పందిస్తోంది.  వరుసగా మూడుసార్లు పరీక్షించిన తర్వాత చైనాలో సంబంధిత విభాగా ‘3సీ’ సర్టిఫికెట్ జారీ చేసింది. కానీ అమెరికా విధించిన ఆంక్షల ప్రభావం వల్ల హువావే ఆచితూచి స్పందిస్తోంది. 

ఆంక్షలు విధించడమే కాదు డొనాల్డ్ ట్రంప్.. హువావే కంపెనీకి మూలాధారం వంటి పరికరాల సరఫరాపైనే దెబ్బకొట్టారు. తమపై అమెరికా ఆంక్షల ప్రభావం పెద్దగా ఉండదని హువావే చెబుతున్నా వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. 

హువావే వాడే చాలా విడిభాగాలను అమెరికా టెక్‌ దిగ్గజాలు తయారు చేస్తున్నాయి. ఆ కంపెనీకి అడుగడుగునా సవాళ్లు ఎదురవుతున్నాయి. 

ఇప్పటికే గూగుల్‌ ఆ కంపెనీకి సాఫ్ట్‌వేర్‌ ఇవ్వడంపై గడువు విధించింది. క్వాల్‌కామ్‌, ఇంటెల్‌ వంటి టెక్‌ దిగ్గజాలు కూడా హువావేకు దూరం జరుగుతున్నాయి. హువావే ఫోన్ల తయారీకి మొత్తం 92 పరికరాలు అత్యంత కీలకం. వీటిల్లో 33 భాగాలు అమెరికాలో తయారు కాగా, 25 భాగాలు చైనాలో తయారవుతున్నాయి. 

హువావేలోని మిగిలినవి మరికొన్ని దేశాల్లో చేస్తున్నారు. గత ఏడాది విడిభాగాల కోసం 70 బిలియన్‌ డాలర్లను ఖర్చు చేయగా వీటిల్లో 11 బిలియన్‌ డాలర్లు అమెరికా కంపెనీలకు వెళ్లాయి. ప్రస్తుతం హువావే వద్ద ఉన్న విడిభాగాల నిల్వలతో సుమారు మూడు నెలలపాటు ఫోన్ల తయారీకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. 

ఆ నిల్వలు అడుగంటగానే కీలక సవాళ్లు ఎదురవుతాయి. హువావే స్మార్ట్‌ఫోన్ల తయారీకి మరో మార్గం ఎంచుకోవడమా.. లేదా స్మార్ట్‌ ఫోన్ల వ్యాపారం నుంచి తప్పుకోవడమో చేయాలి. ఒక వేళ ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకొంటే ప్రస్తుత  నాణ్యతను వినియోగదారులకు అందివ్వాలి. లేకపోతే ఏకంగా బ్రాండ్‌ పేరు దెబ్బతింటుంది. అందుకే ఇప్పటికే హువావే సరికొత్త బ్రాండ్లను విడుదలను వాయిదా వేస్తోంది. 

స్మార్ట్‌ఫోన్‌కు యాప్స్‌ ప్రాణం వంటివి. నిత్యం ప్రజలు వివిధ రకాల యాప్స్‌పై ఆధారపడతారు. డొనాల్డ్ ట్రంప్ ఆంక్షలు అమలైతే గూగుల్‌ మ్యాప్స్‌, జీమెయిల్‌, యూట్యూబ్‌ వంటివి రావు. ఇప్పటికే గూగుల్‌ ఇచ్చిన 90 రోజుల గడువు పూర్తి అయ్యాక అప్‌డేట్లు కూడా రావు. దీంతో వీటిల్లో సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. 

హువావేకు ఇప్పటి వరకు సొంతంగా ఆపరేటింగ్‌ సిస్టమ్‌ లేదు. దీంతో గూగుల్‌ ఆండ్రాయిడ్‌ను వినియోగిస్తోంది. తాజాగా హ్యాంగ్‌ మెంగ్‌ అనే ఓఎస్‌కు పేటెంట్‌ కోసం దరఖాస్తు చేసుకొంది. ఇది ఆండ్రాయిడ్‌కంటే వేగంగా ఉంటుందని చైనా పత్రికలు చెబుతున్నాయి. అయితే వాస్తవమేంటో ఇప్పటి వరకు తెలియదు. 

అమెరికాకు చెందిన కార్నింగ్‌సంస్థ నుంచి గొరిల్లా గ్లాస్‌ను కొనుగోలు చేస్తోంది. దీనిని విండోస్‌ ల్యాప్‌టాప్‌లకు కూడా వాడుతోంది. ఇప్పుడు కార్నింగ్‌ బంధాలు తెంచుకొనే పరిస్థితి రావడంతో మరొక పంపిణీదారును వెతుక్కోవాలి. 

డ్రాగన్‌ట్రైల్‌ గ్లాస్‌ను ఉత్పత్తి చేస్తున్న ఏజీసీ ఆషీ గ్లాస్‌ సంస్థను హువావే ఆశ్రయించాల్సి ఉంటుంది. ఏమంత పెద్దగా పేరులేని ఈ సంస్థ హువావే డీల్‌తో జాక్‌పాట్‌ కొట్టొచ్చు. 

ఇక హువావే సరికొత్త మోడల్‌ పి30 ప్రో స్టోరేజీ చిప్‌ను మైక్రాన్‌ సంస్థ తయారు చేస్తోంది. ఇప్పటికే ఈ సంస్థ హువాయికి చిప్స్ సరఫరాపై నిషేధం విధించింది. హువావే ఎదుట శామ్‌సంగ్‌, తొషిబా సంస్థలు ప్రత్యామ్నాయాలుగా ఉన్నాయి. హువావేకు చెందిన హైసిలికాన్‌ సంస్థ ఇప్పటికే సొంతగా స్టోరేజీ చిప్స్‌ చేయడం పై దృష్టిపెట్టింది. 

మొబైల్ ఫోన్ నెట్‌వర్కింగ్‌కు అవసరమైన పరికరాలను ఇప్పటి వరకు అమెరికాకు చెందిన స్కైవర్క్స్‌, కోవర్వో సంస్థలు సరఫరా చేస్తున్నాయి. తాజా పరిస్థితుల్లో వీటికి ప్రత్యామ్నాయంగా హువావే సొంతంగా నెట్‌వర్క్‌పరికరాలను అభివృద్ధి చేసుకోవాల్సిందే. 

సర్క్యూట్‌ బోర్డును అమెరికాలోని రోజర్‌ కార్పొరేషన్‌ తయారు చేస్తుంది. ఫోన్‌కు ఇది ఆత్మవంటిది. ఇప్పడు దీని సరఫరా కూడా ప్రమాదంలో పడింది. ఫోన్‌లో ఆడియో విభాగం యాంప్లిఫైర్‌ను సీరియస్‌ లాజిక్‌ సంస్థ తయారు చేస్తుంది. 

హువావే.. చిప్‌లను క్వాల్‌కామ్‌ సంస్థ నుంచి కొనుగోలు చేస్తుంది. ఇప్పడు వీటికి ప్రత్యామ్నాయం వెతుక్కోవాలి. ఇప్పుడు హువావే వీటికి ప్రత్యామ్నాయాలు వెతికినా గతంలో ఉన్న నాణ్యతను అందుకోవాలి. లేకపోతే విజయం సాధించడం కష్టం.

Follow Us:
Download App:
  • android
  • ios