న్యూఢిల్లీ: తమ సంస్థ స్మార్ట్‌ఫోన్లను నిరభ్యతరంగా వినియోగించవచ్చని చైనా స్మార్ట్‌ఫోన్ల తయారీ దిగ్గజం ‘హువావే’ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్లకు ఉపయోగపడేలా అభివృద్ధి చేసిన ఆండ్రాయిడ్‌ సిస్టమ్‌తో ఎంతో కాలం నుంచి పని చేస్తున్నామని, అది అలా కొనసాగుతూనే ఉంటుందని సంస్థ తెలిపింది. 

హువావే, హానర్‌ స్మార్ట్‌ఫోన్లకు, ట్యాబ్‌లకు ఎప్పటికప్పుడు సెక్యూరిటీ అప్‌డేట్‌లు ఇస్తూనే ఉంటామని చెప్పింది. ఇప్పటికే కస్టమర్ల చేతుల్లో ఉన్న ఫోన్లకు, కొత్త ఫోన్లకు సేవలు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. వారంతా ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పింది. 

ఇవన్నీ చేస్తూనే వినియోగదారుల అభిరుచులకు తగినట్లుగా, వారు మెచ్చే విధంగా ఒక సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసేందుకు సంస్థ నిరంతరం కృషి చేస్తోందని హువావే తెలిపింది. హువావేపై నిషేధం విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. హువావేతో జాతీయ భద్రతకు ముప్పు ఉందని అందుకే నిషేధం విధిస్తున్నట్లు ట్రంప్‌ వాదించారు. 

ట్రంప్ నిషేధం నేపథ్యంలో సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ సహా ఇతర సేవలను ఇవ్వబోమని సెర్చింజన్ గూగుల్‌ ప్రకటించింది. దీంతో హువావే స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలపై ప్రభావం చూపనుందని విశ్లేషకులు అంటున్నారు. 

అయితే ఆండ్రాయిడ్‌ ఫ్లాట్‌ఫాం లేకుండా హువావే మొబైల్‌ ఫోన్లు తయారు చేస్తే, వినియోగదారులు పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చని హాంగ్‌కాంగ్‌కు చెందిన సౌత్‌ మార్నింగ్‌ పోస్ట్‌ తెలిపింది. ట్రంప్‌ చర్యలతో విపణిలో హువావేకి గట్టి పోటీ ఇస్తున్న సంస్థలకు లాభం చేకూర్చినట్లయింది. 

కాని తమ ఫోన్లు కొనడానికి ఏమాత్రం ఆలోచించాల్సిన పని లేదని హువావే తాజాగా చేసిన ప్రకటన వినియోగదారుల్లో ఏ మేరకు భరోసాను నింపుతుందో చూడాల్సిందే. టెక్నాలజీ దిగ్గజంగా అవతరించిన హువావే.. గూగుల్‌కు పోటీగా సొంత ఆండ్రాయిడ్ సిస్టమ్‌ను డెవలప్ చేసే సత్తా లేకపోలేదు. 

ఆల్ రెడీ గూగుల్‌కు ప్రత్యామ్నాయంగా చైనాలో విడిగా సెర్చింజన్ సెపరేట్‌గా ఉంది. గూగుల్ ఆండ్రాయిడ్ సిస్టమ్ మాదిరిగా చైనా ప్రభుత్వం గానీ, హువావే సంస్థ గానీ సొంత ఆండ్రాయిడ్ వ్యవస్థను రూపొందించడం ఆ దేశానికి, సంస్థకు ఉన్న సామర్థ్యం నేపథ్యంలో ఈజీనే. కానీ ఆ పని చేస్తారా? అన్నది సందేహం.

ఇప్పటివరకు ఆండ్రాయిడ్ వ్యవస్థ లేని హువావే ఇక ముందు గూగుల్ ప్లే నుంచి పబ్లిక్ యాప్స్ మినహా ప్రత్యేకమైన యాప్స్ పొందే అవకాశం ఉండకపోవచ్చు. కానీ ఈ పరిస్థితికి చెక్ పెట్టాలని హువావే సన్నాహాల్లో ఉంది. హువావే తనకంటూ సెపరేట్ యాప్ గ్యాలరీ కోసం ప్రయత్నాలు చేస్తోంది. 

థర్డ్ పార్టీ మార్కెట్ ప్లేస్ సంస్థ ‘అప్టైడ్’తో ఈ మేరకు సంప్రదింపులు హువావే జరిపింది. గూగుల్ ప్లే స్టోర్‌కు ప్రత్యామ్నాయం అందించాలని కోరింది. ఆప్టైడ్ సంస్థ 9 లక్షల యాప్స్, 200 మిలియన్ల యూజర్లను కలిగి ఉంది. గూగుల్ ప్లే స్టోర్ తో అధికారికంగా మద్దతు లేకున్నా ఏపీకే మిర్రర్ ద్వారా ఆండ్రాయిడ్ యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 

ఇదిలా ఉంటే  చైనా టెక్నాలజీ దిగ్గజం హువావేను ఎలాగైనా దారికి తెచ్చుకొనేందుకు ప్రయత్నిస్తున్న అమెరికాకు చైనా యువత భారీ షాకిచ్చింది. ఈ మేరకు అక్కడి  సోషల్‌ మీడియా యూజర్లు, యువత కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ దేశ టెక్‌ దిగ్గజం హువావేకు మద్దతుగా నిలుస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆపిల్‌ ఉత్పత్తులను నిషేధించాలంటూ పిలుపునిచ్చారు.

ప్రంపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ హువావే ఉత్పత్తులు, టెక్నాలజీపై ఆంక్షలు విధించిన  ట్రంప్ ప్రభుత్వంపై  చైనాయువత మండిపడుతోంది.  ట్విటర్‌, వైబోలాంటి సోషల్‌ మీడియా వేదికల్లో ఆపిల్‌ ఉత్పత్తులను బ్యాన్‌ చేయాలంటూ యూజర్లు వ్యాఖ్యానిస్తున్నారు. 

ఈ పోస్టులకు మిలియన్ల కొద్దీ లైకులు, షేర్లు లభిస్తున్నాయి. దీంతో చైనా అంతటా యాంటీ ఆపిల్‌ ఉద్యమం ఊపందుకుంది. హువావేపై ట్రంప్‌ సర్కార్‌ కావాలనే వేధింపులకు పాల్పడుతోందని యూజర్లు మండి పడుతున్నారు. అలాగే ఆపిల్‌ ఐఫోన్‌ కొనాలన్న తన ఆలోచనను మార్చుకుని హువావే ఫోన్‌ను కొనుగోలు చేయనున్నామని మరో యూజర్‌  ప్రకటించారు. 

మరోవైపు ఈ నిర్ణయం స్వల్పకాలంలో చైనాలో ఆపిల్ అమ్మకాలను దెబ్బతీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే తాజా పరిణామంపై వ్యాఖ్యానించడాని ఆపిల్‌ తిరస్కరించింది. దీంతో అమెరికా-చైనా ట్రేడ్‌ వార్‌ మరింత ముదురుతుందన్న ఆందోళన నెలకొంది. కాగా హువావేపై ఆంక్షలను తాత్కాలికంగా నిలిపిస్తున్నట్టు అమెరికా  ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.