ఒట్టావా: చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం హువావే’ సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంగ్ వాంగ్ జూను అమెరికాకు అప్పగింత ప్రక్రియను ఉపసంహరించాలని ఆమె తరఫు న్యాయవాదులు కెనడా న్యాయశాఖ మంత్రి డేవిడ్ లామిట్టెను కోరారు. ఈ మేరకు రెండు రోజుల క్రితం ఆయనకు వినత పత్రం సమర్పించారు. మెంగ్ వాంగ్ జూ అప్పగింతపై వచ్చే ఏడాది జనవరి 20వ తేదీ నుంచి మొదలవుతాయి. కెనడాలో ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న మెంగ్ వాంగ్ జూ ఒక గెస్ట్ హౌస్‌లో బస చేశారు. 

ఇరాన్ పై విధించిన ఆంక్షలను ఉల్లంఘించి, అమెరికా బ్యాంకులకు నష్టం వాటిల్ల జేశారన్న అభియోగంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ ఆదేశం మేరకు కెనడా ప్రభుత్వం.. మెంగ్ వాంగ్ ఝూను అరెస్ట్ చేసింది. కెనడా ప్రయోజనాల కోసమైనా ఆమెను విడుదల చేయాలని డేవిడ్ లామెట్టెను మెంగ్ వాంగ్ ఝూ న్యాయవాదులు కోరారు. ఎటువంటి ఆధారాల్లేకుండానే ఆమెను అమెరికాకు అప్పగించేందుకు చర్యలు చేపట్టారని ఆరోపించారు. 
 
మెంగ్ వాంగ్ ఝూపై నమోదు చేసిన కేసు పూర్తిగా రాజకీయం అని, న్యాయపరంగా అసాధారణం అని ఆమె తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. దీనిపై కెనడా మంత్రి డేవిడ్ లామిట్టె మాట్లాడుతూ కెనడా క్రాస్ రోడ్డులో నిలిచిందన్నారు. కెనడాలో ఆమె నేరం చేయకున్నా.. అమెరికా వినతిని తాము గౌరవించాల్సి ఉంటుందన్నారు. 

వాంకోవర్‌లో గతేడాది డిసెంబర్ నెలలో కెనడా ప్రభుత్వం మెంగ్ వాంగ్ ఝూను అరెస్ట్ చేసినప్పటి నుంచి చైనాతో ఆ దేశ సంబంధాలు దెబ్బ తిన్నాయి. అమెరికా అప్పగింత పిటిషన్‌ను తిరస్కరించాలని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడేకు కెనడా మాజీ ప్రధాని చిరటైన్ సూచించారు. కెనడా విదేశాంగ మంత్రి చిరిస్టియా ఫ్రీలాండ్ దీంతో విబేధించారు. అమెరికా ప్రభుత్వంతో ఉన్న అప్పగింత ఒప్పందాన్ని అమలు చేయక తప్పదన్నారు. మెంగ్ వాంగ్ ఝూ కేసు కోర్టుల్లో ఉన్నందున దీనిపై స్పందించడం సరి కాదన్నారు.