Asianet News TeluguAsianet News Telugu

పిచాయ్‌పై నో కాన్ఫిడెన్స్: గూగుల్ ఫ్యూచర్‌పై నీలినీడలు?

ఇంటర్నెట్ సెర్చింజన్ సీఈఓ.. సుందర్ పిచాయ్‌ సామర్థ్యంపై సంస్థ సిబ్బందిలో క్రమంగా విశ్వాసం తగ్గిపోతోంది. వివిధ అంశాల్లో నిర్వహించిన సర్వే సారాంశం దీన్నే నిగ్గు తేల్చింది. సంస్థ పురోగతికి పిచాయ్ అనుకూల నిర్ణయాలు తీసుకున్నారని అంగీకరించిన గూగుల్ స్టాఫ్.. వివిధ అంశాల్లో ఆయన టీంతో విభేదిస్తున్నట్లు కనిపిస్తోంది.
 

google staff's faith in sunder oichai's vision on wanw : in-house poll
Author
Hyderabad, First Published Feb 5, 2019, 12:57 PM IST

టాలెంట్‌కు పెద్దపీట వేయడంలో ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ ఎప్పుడూ ముందే ఉంటుంది. ప్రపంచం నలుమూలల గల ప్రతిభావంతులను వెలికితీసి, వారికి అవకాశాలను కల్పించడంలోనూ గూగుల్‌దే అగ్రస్థానం. అందుకే అత్యంత లాభదాయక ఇంటర్నెట్ సంస్థగా ఈ సెర్చింజన్ వెలుగొందుతున్నది. 

అలాంటి నైపుణ్యం, సామర్థ్యం, తెలివితో తొణికిసలాడే గూగుల్ నాయకత్వంపై ఇప్పుడు సంస్థ ఉద్యోగుల్లో అపనమ్మకం ఏర్పడుతున్నదా? అంటే జవాబు అవుననే వినిపిస్తున్నది. గూగుల్ సీఈవో, భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్ విజన్‌పై ఉద్యోగుల్లో విశ్వాసం సన్నగిల్లుతున్నదని ఇటీవలి ఓ అధ్యయనంలో తేలింది. 

గూగులెగిస్ట్ పేరిట జరిగిన వార్షిక అంతర్గత అభిప్రాయ సేకరణలో సంస్థ అభివృద్ధికి సుందర్ పిచాయ్ అనుసరిస్తున్న విధానాలు ప్రభావవంతంగా ఉంటున్నాయా? అన్నదానిపై 78 శాతం మంది ఉంటున్నాయని సమాధానమిచ్చారు. 

ఇంకేం మెజారిటీ ఉద్యోగులు మన పిచాయ్‌కే మద్దతు పలికారుగా.. అనుకోకండి. గతేడాదితో పోల్చితే ఇది తక్కువ. నిరుడు 88 శాతం మంది పిచాయ్ విజన్‌ను విశ్వసించారు. ఈసారి 10 శాతం తగ్గింది. 22 శాతం మంది పిచాయ్‌కి వ్యతిరేకంగా ఓటేశారు. 

ఇక భవిష్యత్‌లో గూగుల్‌ను సమర్థవంతంగా పిచాయ్, ఆయన నేతృత్వంలోని బృందం నడిపిస్తుందా? అన్న ప్రశ్నకు బదులుగా 74 శాతం మంది అనుకూలంగా స్పందించారు. గతంతో పోల్చితే ఇదీ 18 శాతం తగ్గిపోయింది. అలాగే పిచాయ్ నిర్ణయాలు, వ్యూహాలు, వైవిధ్యం తదితర అంశాలపై అడిగిన ప్రశ్నలకూ గతేడాదితో చూస్తే మద్దతు పడిపోవడం గమనార్హం. 

సుందర్ పిచాయ్ నిర్ణయాలు, వ్యూహాలతో గూగుల్ ప్రదర్శన గొప్పగా ఉంటుందా? అంటే 75 శాతం మంది అవునని చెప్పారు. క్రిందటిసారితో పోల్చితే 13 శాతం తక్కువ. పిచాయ్ ఆలోచనలు, దృక్పథం సంస్థ సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేస్తాయా? అంటే అవుననే 79 శాతం అంగీకరించారు. నిరుడుతో చూస్తే 12 శాతం తగ్గిపోయింది. 

గూగుల్‌కు సరైన ప్రాధాన్యాలు ఉన్నాయా? అన్నదానికి 66 శాతం ఊ కొట్టగా, గతంలో కంటే ఇది 13 తక్కువ. గూగుల్ భవిష్యత్‌పై ఆత్రుతతో ఎదురుచూస్తున్నారా? అన్నదానికి 78 శాతం అవునని చెప్పారు. ఇది కూడా పోయినసారితో చూస్తే 11 శాతం మంది తగ్గిపోయారు. 

ఇతర సంస్థల ఉద్యోగులతో పోల్చితే గూగుల్‌లో తమ జీతాలు పోటీ పడుతున్నాయా? అంటే 54 శాతం మందే అవునన్నారు. గతంతో చూస్తే 11 శాతం తక్కువ. ప్రస్తుతం గూగుల్‌ను వీడాలన్న ఆలోచనేదీ తమకు లేదన్న ప్రశ్నకు బదులుగా 74 శాతం మంది అవునని సమాధానమిచ్చారు. పోయినసారి కంటే ఇది రెండు శాతం తక్కువ. 
గూగుల్ పనితీరు, ఉద్యోగుల అభిప్రాయాలు, ఆందోళనలు నిజమేనా? అని తెలుసుకోవడానికి ఈ ఫలితాలను గూగుల్ తమ ఉద్యోగులందరితోనూ పంచుకున్నది. ఈసారి సర్వేలో 89 శాతం ఉద్యోగులు పాల్గొన్నారు. తాజా గూగులెస్ట్ సర్వే ఫలితాలపై స్పందించేందుకు గూగుల్ అధికార ప్రతినిధి నిరాకరించారు.

గతేడాది గూగుల్‌లో తీవ్ర సంఘర్షణాత్మక పరిస్థితులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఉద్యోగులు, యాజమాన్యం మధ్య బాహాటంగానే ఉద్రిక్తతలు చెలరేగాయి. కాంట్రాక్టు సిబ్బంది ప్రయోజనాల అంశం, కృత్రిమ మేధస్సు వినియోగంలో నీతి వంటి ఎన్నో అంశాలపై పెద్ద ఎత్తునే వర్కర్లు, మేనేజ్‌మెంట్ మధ్య గొడవలు జరిగాయి.

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులను పెద్ద ఎత్తున చెల్లింపులు జరిపి సంస్థ వదిలించుకుందన్న వార్తలూ గూగుల్ ఉద్యోగుల్లో అలజడిని రేపాయి. దీనివల్ల ఇతర సంస్థలకు ప్రతిభావంతులు వెళ్లిపోవడం మొదలవగా, ప్రకటనలు తదితర ఇతర వ్యాపారాలే లాభదాయకంగా ఉన్న దుస్థితి తయారైంది. తాజా సర్వే నేపథ్యంలో గూగుల్ అంచనాలు అన్ని అంశాల్లో పేలవంగా ఉంటున్నాయా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

దుష్ప్రవర్తన నిరూపితమైతే వేగంగా చర్యలు ఉంటున్నాయా? అన్నదానికి 53 శాతం మంది అనుకూలంగా ఓటేశారు. దీంతో దాదాపు సగం మందిలో ఈ విషయంలో అసంతృప్తి, అభద్రతాభావం నిండిపోయిందని తేటతెల్లమవుతున్నది. వేతనాల విషయంలోనూ 44 శాతం మంది పెదవి విరుస్తున్నట్లు బహీర్గతమైంది. అయినా ఇంకా 86 శాతం మంది గూగుల్‌లో పనిచేసేందుకే ఇష్టపడుతున్నట్లు సర్వే స్పష్టం చేసింది.

తమ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను సోమవారం గూగుల్ అప్రమత్తం చేసింది. మీ విలువైన సమాచారం అపహరణకు గురికాకుండా ఆన్‌లైన్‌లో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఫోన్ స్క్రీన్‌కు యూనిక్ పాస్‌వర్డ్‌ను పెట్టుకోవాలని సూచించిన గూగుల్.. అప్లికేషన్ల విషయంలో ఏమరుపాటు తగదని హితవు పలికింది. 


సెక్యూరిటీ చెక్‌కియా అనే ప్రచారంలో భాగంగా గూగుల్ ఈ మేరకు తమ కస్టమర్లకు సలహాలిచ్చింది. మంగళవారం ఇంటర్నెట్ భద్రతా దినం సందర్భంగా గూగుల్ ఈ ప్రచారాన్ని చేపట్టింది. ఈనాడు టెక్నాలజీ మన జీవనంలో ఓ భాగమైపోయిన నేపథ్యంలో మోసగాళ్లకు బలికాకూడదనే సదుద్దేశ్యంతో ఆన్‌లైన్ జాగ్రత్తలను సూచిస్తున్నామని గూగుల్ ఇండియా ట్రస్ట్ అండ్ సేఫ్టీ విభాగం డైరెక్టర్ సునితా మహంతి అన్నారు. 

వినియోగదారుల డేటా సురక్షితంగా ఉండేలా తమ ఉత్పత్తుల్లో అన్ని రకాల రక్షణ చర్యలను తీసుకుంటామని గూగుల్ ఇండియా ట్రస్ట్ అండ్ సేఫ్టీ విభాగం డైరెక్టర్ సునితా మహంతి తెలిపారు. అయినా కస్టమర్లు అప్రమత్తంగా లేకపోతే ప్రమాదమని చెప్పారు. తెలిసో.. తెలియకో కొన్ని అప్లికేషన్లను క్లిక్ చేస్తే నష్టం వాటిల్లవచ్చని, కాబట్టి అనవసరమైన వాటి జోలికి వెళ్లకపోవడం ఉత్తమమని ఓ బ్లాగ్‌లో పిలుపునిచ్చారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios