క్రికెట్ మ్యాచ్ లో చివరి బంతి కారణంగా.. విజయాలు తారుమారు అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. చాలా మ్యాచుల్లో చివరి బాల్ కి సిక్స్ లు బాది.. గెలిచిన జట్లు కూడా ఉన్నాయి. అలాంటి సందర్భమే.. ఓ జట్టుకి ఎదురైంది. కానీ.. వారు చివరి బంతికి సిక్స్ కొట్టకుండానే.. విజయం తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ మ్యాచ్ కి సంబంధించిన వీడియో.. ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఆదర్శ్‌ క్రికెట్‌ క్లబ్‌(మహారాష్ట్ర) నిర్వహించిన క్రికెట్‌ పోటీల్లో భాగంగా స్థానిక జట్లైన దేశాయ్- జుని డోంబివ్లి జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో భాగంగా జుని జట్టుపై గెలవడానికి దేశాయ్‌కు 6 పరుగులు కావాల్సివచ్చింది. అయితే, ఒకే బంతి మిగిలి ఉండటంతో ఇటు అభిమానులకు, అటు ఆటగాళ్లకు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 

తీరా మొదటి బాల్‌ పడింది.. అది కాస్త వైడ్‌. ఇంకో బంతి పడింది అది కూడా వైడ్‌! అలా ఆరు వైడ్లు పడడంతో ఆఖరు బంతి ఆడకుండానే ఆరు పరుగులు దేశాయ్‌ జట్టు ఖాతాలో చేరాయి. మరో బంతి మిగిలి ఉండగానే జుని జట్టుపై దేశాయ్‌ జట్టు అనూహ్యంగా విజయం సాధించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మీరు కూడా ఓ లుక్కేయండి.