ఐపీఎల్ సీజన్ ముగిసింది. ఇక అందరూ ఆత్రంగా ఎదురు చూస్తున్నది వరల్డ్ కప్ కోసమే. ఈ వరల్డ్ కప్ పై ఇండియన్ క్రికెటర్ గంగూలీ తాజాగా స్పందించాడు. ఇంగ్లండ్‌ వేదికగా జరగనున్న ప్రపంచకప్‌-2019ను పాకిస్తాన్‌ హాట్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోందని  సౌరవ్‌ గంగూలీ పేర్నొన్నాడు. 

పాక్‌కు ఇంగ్లీష్‌ గడ్డపై ఘనమైన రికార్డు ఉందన్నాడు. ఇంగ్లండ్‌లోనే పాక్‌ రెండు ఐసీసీ(చాంపియన్స్‌ ట్రోఫీ, వరల్ట్‌ టీ20) కప్‌లను సాధించిందని గుర్తు చేశాడు. ప్రస్తుత సీజన్‌లోనూ ఇంగ్లీష్‌ పిచ్‌లపై ఆ జట్టు అదరగొడుతోందని తెలిపాడు. ఈ వేధిక పాక్ కి బాగా కలిసొచ్చే అవకాశం ఉందని గంగూలీ అభిప్రాయపడ్డారు.

ఇక ఆతిథ్య ఇంగ్లండ్‌, డిపెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా జట్లు సెమీఫైనల్‌ వరకే పరిమితమవుతాయని జోస్యం చెప్పాడు. దీంతో టీమిండియాకు పోటీగా పాక్‌ నిలిచే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. ప్రపంచకప్‌లో టీమిండియాకు బ్యాటింగ్‌ ప్రధాన బలం కానుందన్నాడు. టాపార్డర్‌లో కోహ్లి, ధావన్‌, రోహిత్‌లలో ఏ ఒక్కరు నిలుచున్నా ప్రత్యర్థిజట్టుకు చుక్కులేనని అన్నాడు. 

నాలుగో ప్రపంచకప్‌ ఆడుతున్న ధోని అనుభవం టీమిండియాకు ఉపయోగపడుతుందున్నాడు. ఐపీఎల్‌లో బెంగళూరు కెప్టెన్‌గా విరాట్ వైఫల్యం వన్డే వరల్డ్‌కప్ సారథ్యంపై ఎలాంటి ప్రభావం చూపదని టీమ్‌ఇండియా గంగూలీ పేర్కొన్నాడు.