ఇప్పుడు ఎవరినోట విన్నా హిమదాస్ పేరే వినపడుతోంది. ప్రతి ఒక్కరూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.  అంతర్జాతీయ వేదికపై భారత మహిళా అథ్లెట్ హిమదాస్ మూడు వారాల వ్యవధిలో ఐదె స్వర్ణాలు గెలిచి... భారత్ గర్వపడేలా చేసింది. కాగా... తాజాగా ఆమెపై యువ క్రికెటర్ రిషబ్ పంత్ ప్రశంసలు కురిపించారు.

ట్విట్టర్ వేదికగా.. హిమదాస్ ని పంత్ ప్రశంసించారు. ‘‘ నీవే ఒక స్ఫూర్తి. ది గోల్డెన్ గర్ల్ ఆఫ్ ఇండియా.. సలామ్ బాస్’’ అంటూ ట్వీట్ చేశారు. పంత్ తో పాటు సచిన్ టెండుల్కర్ కూడా హిమదాస్ ని కొణియాడారు. ‘‘ గత 19 రోజుల కాలంలో యూరోపియన్ సర్క్యూట్ లో నీ ప్రదర్శన చూసి గర్విస్తున్నాం. గెలవాలని నీలో ఉన్న కసి యువతకు ఒక స్ఫూర్తి. ఐదు పతకాలు గెలిచినందుకు అభినందనలు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆశిస్తున్నాను’ అంటూ సచిన్ పేర్కొన్నారు.

 

శనివారం చెక్ రిపబ్లిక్ లో జరిగిన అంతర్జాతీయ అథ్లెటిక్స్ మీట్ లో హిమదాస్ 400 మీటర్ల రేసులో తొలి స్థానంలో నిలిచి బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నారు. 200మీటర్ల రేసులో నాలుగు స్వర్ణాలు గెలిచిన హిమ... 400మీటర్ల రేసులోనూ తనకు సాటిలేరని నిరూపించుకుంది.