పిల్లాడి గుండె ఆపరేషన్ కోసం ఒలింపిక్ మెడల్‌ను వేలానికి పెట్టింది... ఆ తర్వాత....
8 నెలల పిల్లాడి గుండె సర్జరీకి సాయం చేయాలనే ఆలోచనతో... ఒలింపిక్ మెడల్‌కే వేలానికి పెట్టిన పోలాండ్ జావెలిన్ త్రో అథ్లెట్...
పోలాండ్‌కి చెందిన జావెలిన్ త్రో మహిళా అథ్లెట్ మరియా ఆండ్రేజెక్, టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించింది. అయితే ఈ విజయం సాధించి, నెల రోజులు కూడా నిండకముందే తన ఒలింపిక్ మెడల్‌ను వేలానికి పెట్టింది మరియా. ఈ నిర్ణయానికి వచ్చింది తన కోసం కాదు, ఓ 8 నెలల పిల్లాడి గుండె సర్జరీకి సాయం చేయాలనే ఆలోచనతోనే...
‘నాకు ఆలోచించడానికి ఎక్కువ సమయం లేదు. నేను మొదటిసారిగా ఫండ్ రైజ్ చేయాలనుకుంటున్నా. ఇదే సరైనది...’ అంటూ సోషల్ మీడియా ద్వారా తెలిపింది మరియా. 8 నెలల మిలోస్‌జెక్ అనే పిల్లాడు, ఓ గుండె వ్యాధితో బాధపడుతున్నాడు. అతనికి వెంటనే సర్జరీ చేయాలి. అయితే అతని తల్లిదండ్రుల దగ్గర అంత ఆర్థిక స్తోమత లేదు. దీంతో సోషల్ మీడియా ద్వారా సాయం కోరారు. దీనికి స్పందించిన మరియా... తన ఒలింపిక్ మెడల్‌ని వేలం వేయడానికి ముందుకొచ్చింది...
మరియా ఆండ్రేజెక్ తీసుకున్న ఈ గొప్ప నిర్ణయాన్ని స్వాగతించిన పోలిష్ స్టోర్ ఛైయిన్ జబ్కా పోల్స్‌కా... ఈ వేలంలో లక్షా 25 వేల డాలర్లు (దాదాపు 93 లక్షల రూపాయలు) చెల్లించి, ఈ ఒలింపిక్ మెడల్‌ను కొనుగోలు చేసింది. అయితే మరియా దయార్థ హృదయానికి కానుకగా తిరిగి ఆమెకే ఆ మెడల్‌ను బహుకరించింది జబ్కా...
ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో మహిళల ఈవెంట్‌లో 64.61 మీటర్ల దూరం విసిరి, రజతం గెలిచిన మరియా... ‘మెడల్ అనేది ఓ వస్తువు. దానికి నిజమైన విలువ, ఎవరికైనా ఉపయోగపడినప్పుడే వస్తుంది. అందుకే దీన్ని వేలం వేయాలని భావించా. ఇప్పుడు ఈ మెడల్ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతుంది’ అంటూ తెలిపింది.