క్రికెట్ వరల్డ్‌కప్‌ టోర్నీలో వేసిన మొదటి బంతికే వికెట్ తీసిన అరుదైన రికార్డు సొంతం చేసుకున్న భారత క్రికెటర్ విజయ్ శంకర్. భారత ఓపెనర్ శిఖర్ ధావన్‌ గాయం కారణంగా వన్డే వరల్డ్‌కప్ 2019 నుంచి తప్పుకోవడంతో జట్టులోకి వచ్చిన ఆ ఆల్‌రౌండర్, పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. భారత స్టార్ పేసర్ భువనేశ్వర్ నాలుగు బంతులు వేసిన తర్వాత వెన్నునొప్పి కారణంగా తప్పుకోవడంతో అతని స్థానంలో బంతి అందుకున్న విజయ్ శంకర్, మొదటి బంతికే ఇమామ్ ఉల్ హక్‌ను అవుట్ చేశాడు.

ఆ మ్యాచ్ తర్వాత నెట్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో బుమ్రా వేసిన బంతి, విజయ్ శంకర్ కాలికి తగలడంతో టోర్నీ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నాడు. అలాంటి విజయ్ శంకర్‌‌ను ఆఫ్ స్పిన్నర్‌గా పేర్కొంది ఐపీఎల్ అధికారిక వెబ్‌సైట్.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరుపున ఆడుతున్న విజయ్ శంకర్ వివరాల్లో కుడి చేతి వాటం బ్యాట్స్‌మెన్‌గా పేర్కొన్న ఐపీఎల్ వెబ్‌సైట్‌లో బౌలింగ్ స్టైల్ దగ్గర మాత్రం రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ (ఆఫ్ స్పిన్నర్) అంటూ తప్పుగా నమోదుచేశారు.

2014 నుంచి ఐపీఎల్ ఆడుతున్న విజయ్ శంకర్ గురించి కూడా స్పష్టంగా తెలియకుండా, ఇలా ఆటగాడి ప్రాథమిక వివరాల్లో తప్పులు రాయడంతో సైట్‌పై సెటైర్లు వినిపిస్తున్నాయి. అంబటి రాయుడు ట్వీట్ చేసినట్టుగా త్రీడీ గ్లాసులు వేసుకుని క్రికెట్ చూసిన వ్యక్తి, ఇలా మీడియం పేసర్‌ను స్పిన్నర్‌గా అర్థం చేసుకుని ఇలా నమోదుచేశాడా అంటూ కామెంట్లు వినబడుతున్నాయి.