మౌంట్‌ మాంగనీ: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని ఆల్ రౌండర్ కేదార్ జాదవ్ ప్రశంసలతో ముంచెత్తాడు. తాను ఈ స్థితిలో ఉండడానికి ధోనీయే కారణమని చెప్పాడు. ధోనీ అందించిన సహకారం వల్లనే తాను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నానని చెప్పాడు.

శనివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జాదవ్ 22 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ధోనీతో కలిసి 53 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి న్యూజిలాండ్ ముందు 325 లక్ష్యాన్ని నిర్దేశించడంలో కీలక పాత్ర పోషించాడు. జాదవ్ బౌలింగ్‌లో ప్రత్యర్థి క్రికెటర్‌ రాస్‌ టేలర్‌ పెవిలియన్ కు చేరుకున్న విషయం తెలిసిందే. వికెట్ కీపర్‌గా ఉన్న ధోని చురుగ్గా వ్యవహరించి, టేలర్‌ను స్టంప్‌ ఔట్ చేశాడు. 

తన ప్రదర్శనకు ధోనీనే కారణమని, ఆయన ఎప్పుడూ తనను ప్రోత్సహిస్తూనే ఉంటాడని జాదవ్ చెప్పాడు. జింబాబ్వే, న్యూజిలాండ్ సిరీస్‌లో ధోనీ తన ఆటను మొదట గుర్తించాడని, రెండు ఓవర్లకు బంతి అందించగా అదృష్టం కొద్ది, రెండో ఓవర్‌లో రెండు వికెట్లు తీయగలిగానని అన్నాడు. 

అప్పటి నుంచి సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తనను ప్రోత్సహిస్తూనే ఉన్నారని, దాంతో తనలో ఆత్మవిశ్వాసం ఇనుమడించిందని, పార్ట్ టైమ్ బౌలర్‌గా ఎప్పుడు ఒత్తిడికి గురికాలేదని అన్నాడు. తాను ఎప్పుడు బౌలింగ్ చేయాలనుకుంటానో అప్పుడే విరాట్, ధోనీ తనకు  బాల్ అందించేవారని ఆయన చెప్పాడు. 

ధోనీ చెప్పిన చోటే, కళ్లు మూసుకొని బౌలింగ్ చేస్తానని, అప్పుడు కచ్చితంగా వికెట్లు పడతాయని,  తాను మెయిన్ స్పిన్నర్ కావాలని ఎప్పుడూ ప్రయత్నించలేదని కోహ్లీ అన్నాడు. ఎక్కువ పరుగులు ఇవ్వని పార్ట్ టైమ్ బౌలర్‌గా ఉండటానికే కృషి చేస్తానని అన్నాడు. 


కెప్టెన్‌ కూడా బంతి ఇచ్చేటప్పుడు అదే చెప్తాడని, వికెట్ పడితే అది బోనస్‌ అని, కొన్నిసార్లు పార్ట్ టైమ్ బౌలర్లను బ్యాట్స్‌మెన్‌ తక్కువ అంచనా వేస్తారని, అదే తనకు కలిసి వస్తుందని అన్నాడు. 

సంబంధిత వార్తలు

ధోనీ మరో స్టన్నింగ్ స్టంపింగ్: ఫ్యాన్స్ ఫిదా

రెండో వన్డే: కుల్దీప్ జోరు, కివీస్ పై భారత్ ఘన విజయం

కుల్దీప్ జాదవ్ జోరు: రెండో బౌలర్ గా ఘనత

ఓపెనింగ్ రికార్డులను బద్దలుగొట్టిన రోహిత్-శిఖర్ జోడీ...

మరో రికార్డ్.. రెండో క్రికెటర్ కోహ్లీ