IND vs NZ : ఒక్క మ్యాచ్.. 3 వరల్డ్ రికార్డులు ! ప్రపంచ క్రికెట్‌లో భారత్ బాహుబలి
India vs New Zealand : టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్ నెగ్గితే మూడు అరుదైన ప్రపంచ రికార్డులను భారత జట్టు తన ఖాతాలో వేసుకోనుంది. ఆ బాహుబలి రికార్డులు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

టీ20 వరల్డ్ కప్ ఫైనల్.. కివీస్‌తో తాడోపేడో
భారత క్రికెట్ అభిమానుల కళ్లు ఇప్పుడు అహ్మదాబాద్ వైపు మళ్లాయి. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఆదివారం (మార్చి 8న) భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య టైటిల్ పోరు జరగనుంది. నరేంద్ర మోదీ స్టేడియంలో రాత్రి 7:00 గంటలకు ఈ హై వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా విజయం సాధిస్తే, క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టుకు సాధ్యం కాని మూడు భారీ ప్రపంచ రికార్డులను భారత్ సొంతం చేసుకుంటుంది.
టీ20 ప్రపంచకప్ లో భారత్ దుమ్మురేపే రికార్డులు
టీమ్ ఇండియా గతంలో రెండుసార్లు టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది. తొలిసారి 2007లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో భారత్ చరిత్ర సృష్టించింది. అప్పుడు ఉత్కంఠభరితమైన ఫైనల్‌లో పాకిస్థాన్‌ను 5 పరుగుల తేడాతో ఓడించి తొలి టీ20 ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. ఆ తర్వాత సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ 2024లో భారత్ రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌లో 7 పరుగుల తేడాతో విజయం సాధించి రెండో టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఇప్పుడు 2026లో మూడోసారి ట్రోఫీని గెలుచుకోవడం ద్వారా సరికొత్త చరిత్రను రాసేందుకు భారత్ సిద్ధమైంది.
మూడు ట్రోఫీలు గెలిచిన తొలి దేశంగా రికార్డు
ఒకవేళ భారత్ ఈ ఆదివారం న్యూజిలాండ్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలిస్తే, మూడుసార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచిన ప్రపంచంలోని మొట్టమొదటి దేశంగా అవతరిస్తుంది. ఇప్పటి వరకు టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఏ దేశం కూడా మూడుసార్లు టైటిల్ గెలవలేదు. ప్రస్తుతానికి భారత్ (2), ఇంగ్లాండ్ (2), వెస్టిండీస్ (2) జట్లు రెండేసి సార్లు టైటిల్ గెలవగా.. పాకిస్థాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా జట్లు ఒక్కోసారి మాత్రమే విజేతలుగా నిలిచాయి. 2026 టైటిల్ నెగ్గితే భారత్ ఈ జాబితాలో టాప్ లోకి చేరుకుంటుంది.
ఆతిథ్య దేశంగా మొదటి విజేత
టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఆతిథ్య దేశం టైటిల్ ను ఇప్పటివరకు గెలవలేదు. ఏ దేశం కూడా తమ సొంత గడ్డపై వరల్డ్ కప్ ట్రోఫీని అందుకోలేకపోయింది. భారత్ ప్రస్తుతం 2026 టోర్నీకి ఆతిథ్యం ఇస్తోంది. కాబట్టి, నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ గెలిస్తే, తన సొంత దేశంలో టీ20 ప్రపంచకప్ గెలిచిన తొలి జట్టుగా టీమ్ ఇండియా రికార్డు సృష్టిస్తుంది. ఇది భారత క్రికెట్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది.
వరుసగా రెండుసార్లు ఛాంపియన్‌గా చరిత్ర
టీమ్ ఇండియా ఈ మ్యాచ్ గెలిస్తే సాధించే మరో కీలక రికార్డు.. బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్. భారత్ ఇప్పటికే 2024లో టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. ఇప్పుడు 2026లో కూడా గెలిస్తే, వరుసగా రెండుసార్లు టీ20 ప్రపంచకప్ గెలిచిన తొలి దేశంగా భారత్ నిలుస్తుంది. అంతేకాకుండా, తన టైటిల్‌ను విజయవంతంగా కాపాడుకున్న మొదటి జట్టుగా కూడా భారత్ రికార్డుల్లోకెక్కుతుంది. ఇప్పటివరకు ప్రపంచంలో ఏ జట్టుకూ ఈ ఘనత సాధ్యం కాలేదు.
IND vs NZ : అహ్మదాబాద్‌లో అమీతుమీ
ఈ భారీ రికార్డుల నేపథ్యంలో అహ్మదాబాద్‌లోని ఫైనల్ పోరుపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ధోనీ హయాంలో మొదలైన ఈ విజయయాత్రను 2024లో రోహిత్ సేన కొనసాగించింది. ఇప్పుడు 2026లో మూడో టైటిల్ లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతోంది. ఒకే విజయంతో మూడు ప్రపంచ రికార్డులను తిరగరాయడానికి టీమ్ ఇండియా సిద్ధంగా ఉంది. కోట్లాది మంది భారతీయులు తమ జట్టు మరోసారి ప్రపంచ విజేతగా నిలవాలని కోరుకుంటున్నారు.

