మౌంట్‌ మాంగనీ: న్యూజిలాండ్ పై జరిగిన రెండో వన్డేలోనూ చెలరేగిన భారత బౌలర్ కుల్దీప్ జాదవ్ రికార్డు సృష్టించాడు. అరుదైన రికార్డును ఈ చైనా మన్ సొంతం చేసుకున్నారు. న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో నాలుగు వికెట్లు తీసిన జాదవ్ రెండో వన్డేలోనూ అదే జోరును ప్రదర్శించి నాలుగు వికెట్లు తీసుకున్నాడు.

తాజాగా తీసుకున్న నాలుగు వికెట్లతో జాదవ్ 77 వన్డే వికెట్లను పడగొట్టి రికార్డు సృష్టించాడు. ఇది కుల్దీప్‌కు 37వ వన్డే మ్యాచ్‌. తద్వారా 37 వన్డే మ్యాచ్‌ల తర్వాత అత్యధిక వికెట్లు సాధించిన జాబితాలో కుల్దీప్‌ రెండో స్థానంలో నిలిచాడు. తొలి 37 వన్డేల్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో రషీద్‌ ఖాన్‌(అఫ్గానిస్తాన్‌) మొదటి స్థానంలో ఉన్నాడు, 

రషీద్ ఖాన్ 37 మ్యాచుల్లో సాధించిన వికెట్లు 87.  సక్లయిన్‌ ముస్తాక్‌(పాకిస్తాన్‌), మిచెల్‌ స్టార్క్‌( ఆస్ట్రేలియా)లను కుల్దీప్‌ అధిగమించాడు. ఆ తర్వాతి స్థానాల్లో అజంతా మెండిస్‌(శ్రీలంక) 72 వికెట్లతో నాల్గో స్థానంలో ఉండగా, షేన్‌ బాండ్‌, హసన్‌ అలీలు 71 వికెట్లతో ఇద్దరు కూడా ఐదో స్థానంలో ఉన్నారు.

న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో భారత్‌ 90 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. భారత్‌ నిర్దేశించిన 325 పరుగుల లక్ష్య ఛేదనలో కివీస్‌ తడబడింది. 40.2 ఓవర్లలో 234 పరుగులకే ఆలౌట్‌ కావడంతో కివీస్‌కు మరో ఓటమి ఎదురైంది.