భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డేలో భారత ఓపెనింగ్ జోడీ పలు రికార్డులను నమోదుచేసింది. రోహిత్ శర్మ(87 పరుగులు)-శిఖర్ ధావన్(66 పరుగులు) జోడి ధాటిగా ఆడుతూ తొలి వికెట్ కు 154 పరుగుల బాగస్వామ్యం నెలకొల్పారు. ఇలా వీరిద్దరి జోడీ ఇప్పటివరకు ఇలా 14 సార్లు సెంచరీ భాగస్వామ్యాలను సాధించడం  ద్వారా భారత ఓపెనింగ్ రికార్డులనే కాదు వరల్డ్ రికార్డును నెలకొల్పింది. 

వన్డే క్రికెట్లో భారత్ తరపున ఇప్పటివరకు అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పిన రికార్డు సౌరవ్ గంగూలీ- సచిన్ టెండూల్కర్ జోడీ పేరిట వుంది. వీరిద్దరు కలిసి 26 సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పారు. వీరి తర్వాతి స్థానంలో ఇన్నాళ్లు సచిన్-సెహ్వాగ్ జోడీ నిలిచింది. అయితే ఈ జోడి  13 సెంచరీల రికార్డును తాజా భాగస్వామ్యంతో రోహిత్-ధావన్ జోడి బద్దలుగొట్టింది.

మౌంట్ మంగనూయి వన్డేలో 154 పరుగుల భాగస్వామ్యంతో వీరిద్దరి సెంచరీ భాగస్వామ్యాల సంఖ్య 14 కు చేరింది. దీంతో భారత్ తరపున అత్యధిక భాగస్వామ్యాలు నెలకొల్పిన ఓపెనింగ్ జోడీల్లో వీరు రెండో స్థానంలో నిలిచారు.

అలాగే ప్రపంచ క్రికెట్లో అత్యధికి సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పిన ఓపెనింగ్ జోడీల్లో రోహిత్-శిఖర్ లు నాలుగో స్థానంలో నిలిచారు. ప్రంపంచ క్రికెట్లోనూ సచిన్- గంగూలీ భాగస్వామ్యాలే మొదటి స్థానంలో నిలిచాయి. ఆ  తర్వాత ఆస్ట్రేలియా కు చెందిన గిల్‌క్రిస్ట్- మాథ్యూ హెడెన్ (16 శతకాలు), వెస్టిండిస్ కు చెందిన గార్డెన్- హేన్స్ (15 సెంచరీలతో) ల జోడి నిలిచింది.  14 శతక భాగస్వామ్యాలతో రోహిత్-ధావన్ జోడి వీరి తర్వాతి స్థానంలో నిలిచింది. 

మొత్తంగా ఓపెనర్లతొ పాటు బ్యాట్ మెన్స్ అందరూ చెలరేగడంతో మొదట బ్యాటింగ్ చేపట్టిన భారత్ 324 పరుగులు చేసింది. దీంతో 325 పరుగుల భారీ లక్ష్యంతో భరిలోకి దిగిన కివీస్ ఇప్పటివరకు కేవలం 100 పరుగులే చేసి కీలక నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.