భారత పారా అథ్లెట్ మరియప్పన్ తంగవేలుపై కరోనా ఎఫెక్ట్... పారాలింపిక్స్ ప్రారంభానికి ముందే...
పారాలింపిక్స్ 2020 ఆరంభవేడుకలకు హై జంపర్ మరియప్పన్ తంగవేలు దూరం... కరోనా పాజిటివ్ సోకిన వ్యక్తితో క్లోజ్ కాంట్రాక్ట్ ఉన్నట్టుగా గుర్తించిన అధికారులు...
పారాలింపిక్స్ కోసం టోక్యో చేరిన టీమిండియాకి తొలి రోజే ఊహించని షాక్ తగిలింది. పారాలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో భారత పతకాన్ని చేతబూని నడవాల్సిన భారత పారాలింపిక్ హై జంపర్ మరియప్పన్ తంగవేలుపై కరోనా ప్రభావం పడింది.
భారత్ నుంచి టోక్యోకి వెళ్లిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అతనితో క్లోజ్ కాంటాక్ట్ ఉన్న కారణంగా మరియప్పన్‌ను ఐసోలేషన్‌కి తరలించారు. అతని స్థానంలో జావెలిన్ త్రోవర్ టెక్ చంద్, పారా ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో భారత త్రివర్ణ పతకాన్ని చేతబూని నడవనున్నాడు.
2016 రియో పారాలింపిక్స్‌లో హై జంప్‌లో స్వర్ణం సాధించిన మరియప్పన్ తంగవేలుకి 2017లో ‘పద్మశ్రీ’, ‘అర్జున’ అవార్డు వరించాయి... గత ఏడాది మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్‌రత్న అవార్డు కూడా దక్కించుకున్నాడు మరియప్పన్.
2020 పారాలింపిక్స్‌లో భారత్ నుంచి రికార్డు స్థాయిలో 54 మంది పారా అథ్లెట్లు పాల్గొనబోతున్నారు. 24 ఆగస్టు నుంచి ప్రారంభమయ్యే ఈ పోటీలు, సెప్టెంబర్ 5 వరకూ జరుగుతాయి.