ఇదేం ట్విస్ట్ రా సామీ.. ఆర్సీబీ దెబ్బకు కంగుతున్న ముంబై, లక్నో
IPL 2025 Auction RCB : ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు భువనేశ్వర్ కుమార్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ విడుదల చేసింది. ఇప్పుడు ఐపీఎల్ 2025 వేలంలో భువనేశ్వర్ కుమార్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు రూ. 10.75 కోట్లకు దక్కించుకుంది.
IPL 2025 Auction : ఐపీఎల్ 2025 మెగా వేలంలో పలువురు భారత ప్లేయర్లు సత్తా చాటారు. అదిరిపోయే ధర పలికి రికార్డుల మోత మోగించారు. ఐపీఎల్ మెగా వేలం 2025 తొలిరోజు భారత ప్లేయర్లు రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ సహా కొందరు ఆటగాళ్లపై ఐపీఎల్ ఫ్రాంఛైజీలు కాసుల వర్షం కురిపించాయి. వారిని దక్కించుకోవడానికి బిగ్ ఫైట్ చేశాయి.
ఇదే క్రమంలో రెండు రోజుకూడా పలువురు ప్లేయర్ల కోసం ఐపీఎల్ ఫ్రాంఛైజీలు రచ్చ చేశాయి. ట్విస్టుల మీద ట్విస్టులు కనిపించాయి. మరీ ముఖ్యంగా స్వింగ్ మాస్టర్ భువనేశ్వర్ కుమార్ కోసం జట్లు పోటీ పడ్డాయి. రెండు జట్లైతే అతని కోసం నువ్వా నేనా అనే విధంగా వేలం కొనసాగించాయి. అయితే, అనూహ్యంగా వీరిద్దరి మధ్యలో వచ్చిన మూడో టీమ్ భూవీని ఎగరేసుకుపోయింది.
భువనేశ్వర్ కుమార్ కోసం పోటీపడుతున్న రెండు జట్ల మధ్యలోకి మూడో జట్టు వచ్చి వారి ఆశలపై నీళ్లు చల్లింది. అదే ఆర్సీబీ టీమ్. భువనేశ్వర్ కుమార్ కోసం వేలంలో మొదటి నుంచి కనిపించిన ముంబై ఇండియన్స్ (ఎంఐ), లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) అతన్ని దక్కించుకోవడానికి పోటీ పడుతూ బిడ్లు వేశాయి. కానీ, ఈ రెండు టీమ్ లకు షాకిస్తూ విరాట్ కోహ్లీ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎంట్రీతో షాక్ అయ్యాయి. ఈ రెండు టీమ్స్ ఆర్సీబీ ఎత్తుగడను చూసి ఆశ్చర్యపోయాయి.
భువనేశ్వర్ కుమార్ కోసం ఆర్సీబీ సర్ ప్రైజ్ ఎంట్రీ..
భువనేశ్వర్ కుమార్ పేరు వేలంలోకి రావడంతో ముంబై, లక్నో యజమానులు అతన్ని దక్కించుకోవడానికి పోటీ పడ్డారు. వీరిద్దరి మధ్య వేలం పెరుగుతూనే ఉంది. రెండు జట్లు వెనక్కి తగ్గడానికి సిద్ధంగా కనిపించలేదు. ఒకానొక దశలో వేలం రూ.10 కోట్లు దాటగా, ముంబై జట్టు భువీకి రూ.10.5 కోట్లు పెట్టింది. దీంతో లక్నో టీమ్ వైపు అందరి చూపులు మళ్లాయి. కానీ, ఆ టీమ్ చేతులెత్తేసింది. ఇదే క్రమంలో సర్ ప్రైజ్ ఎంట్రీ ఇచ్చింది ఆర్సీబీ. భువనేశ్వర్‌ను 10.75కి వేలం వేసి రెండు జట్లకు షాకిచ్చింది. ఇద్దర మధ్య ఫైట్ లో మూడో టీమ్ భువనేశ్వర్ కుమార్ ను ఎగురేసుకుపోయింది.
Bhuvneshwar Kumar
ఆర్‌సీబీ దగ్గర ఎక్కువ డబ్బు
ఐపీఎల్ 2025 మెగా వేలం తొలిరోజు ఆర్సీబీ ఆటగాళ్లను పెద్దగా కొనుగోళ్లు చేయలేదు. దీంతో ఆర్సీబీ రెండో రోజు భారీ మొత్తానికి దిగింది. ఈ జట్టుకు దాదాపు రూ. 30 కోట్లు మిగిలి ఉన్నాయి, దీని కారణంగా ముంబై, లక్నో జట్లు ఈ జట్టును ఎదుర్కోవడం కష్టమైంది. దీంతో భువనేశ్వర్ కుమార్ ను ఆర్సీబీ దక్కించుకుంది. రాబోయే సీజన్ లో భూవీ ఆర్సీబీ జెర్సీలో ఆడుతూ కనిపించనున్నాడు.
Bhuvneshwar Kumar
ఆర్సీబీకి లాభం కలుగుతుందా?
ఆర్సీబీ బ్యాటింగ్ విషయంలో ఎప్పుడూ బలంగానే కనిపిస్తుంది. కానీ, బౌలింగ్ విషయంలో వీక్ గా ఉంటోంది. దీని కారణంగానే ఆ టీమ్ కీలక సమయంలో ఓడిపోవాల్సి వచ్చింది. అయితే ఈసారి భువనేశ్వర్ కుమార్ అనుభవజ్ఞుడైన బౌలింగ్‌తో జట్టుకు లాభం చేకూరనుంది. ఆర్సీబీ తొలి రోజు వేలంలో మిచెల్ స్టార్క్ కోసం పోరాడింది, కానీ అతనిని జట్టులోకి తీసుకోవడంలో విజయం సాధించలేదు. కానీ, భారత స్టార్ ను తీసుకుని జట్టు బౌలింగ్ విభాగాన్ని పటిష్టంగా మార్చుకుంది.