ఒలింపిక్స్ నిర్వహణకు మేం రెడీ.. బిడ్ వేస్తాం : కేంద్ర క్రీడా శాఖ మంత్రి
కేంద్ర ప్రభుత్వం ఒలింపిక్స్ నిర్వహణకు అనుకూలంగా ఉందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. జీ-20 పగ్గాలు చేపట్టిన భారత్ కు ఒలింపిక్స్ నిర్వహణ కూడా తెలుసునని తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఒలింపిక్స్ నిర్వహణకు అనుకూలంగా ఉందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. జీ-20 పగ్గాలు చేపట్టిన భారత్ కు ఒలింపిక్స్ నిర్వహణ కూడా తెలుసునని ఆయన చెప్పారు. టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనురాగ్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తయారీ, ఇతర రంగాలలో దూసుకుపోతున్న భారత్.. క్రీడలలో మాత్రం వెనుకబడి ఉండాల్సిన అవసరం లేదని ఆయన గుర్తు చేశారు.
అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ‘భారత్ కు ఇటీవలే జీ-20 సారథ్యం దక్కింది. దీనిని భారత్ విజయవంతంగా నిర్వహించగలిగినప్పుడు ఒలింపిక్స్ నిర్వహణ కూడా కష్టమేమీ కాదు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ)తో కలిసి ఆ దిశగా కృషి చేస్తాం..
2032 వరకూ ఒలింపిక్స్ వేదికలు ఖరారై ఉన్నాయన్న విషయం మాకు తెలుసు. అయితే 2036 ఒలింపిక్స్ కోసం ఇండియా కచ్చితంగా బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొంటుందని నేను అనుకుంటున్నా. అసలు ‘నో’ అని చెప్పడానికి కూడా అవకాశమే లేదు. భారత్ లో గత కొంతకాలంగా క్రీడలకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహం అందిస్తున్నది. ఒలింపిక్స్ నిర్వహణను ఘనంగా చేపడతామనే నమ్మకముంది. తయారీ, సేవలు వంటి రంగాలలో భారత్ అగ్రస్థానంలో ఉంది. ప్రతీ రంగంలోనూ భారత్ పేరు మార్మోగిపోతున్నప్పుడు క్రీడల్లో మాత్రం ఎందుకు వెనుకబడాలి..? 2036 ఒలింపిక్స్ బిడ్ కోసం ఇండియా తీవ్రంగా కృషి చేస్తోంది..’ అని తెలిపారు.
ఒలింపిక్స్ నిర్వహణకు గుజరాత్ అనుకూలమని అనురాగ్ ఠాకూర్ చెప్పారు. గుజరాత్ లో అందుకు కావల్సిన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఒలింపిక్స్ నిర్వహించడానికి ఆ రాష్ట్రం ఆసక్తిగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వ మేనిఫెస్టో లో కూడా ఈ విషయం ఉందని ఆయన అన్నారు.
భారత్ గతంలో రెండు సార్లు ఆసియా గేమ్స్ తో పాటు 2010లో కామన్వెల్త్ గేమ్స్ ను కూడా నిర్వహించింది. మరి అనురాగ్ ఠాకూర్ చెప్పినట్టు 2036లో ఒలింపిక్స్ నిర్వహణకు భారత్ బిడ్ వేస్తుందా..? అందుకు అనువైన మౌళిక సదుపాయాలను సమకూర్చుకుంటుందా..? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.