Asianet News TeluguAsianet News Telugu

T20 World Cup: పసికూనలపై పంజా విసిరిన బంగ్లాదేశ్.. సూపర్ 12కు అర్హత.. ఓటమితో పీఎన్జీ ఔట్

Bangladesh Vs papua New guinea: 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పపువా న్యూ గినియా ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగినట్టు కనిపించలేదు. భారీ స్కోరును  చూసి విలవిల్లాడిన ఆ జట్టును బంగ్లా బౌలర్లు  బెంబేలెత్తించారు. ఈ విజయంతో బంగ్లాదేశ్ సూపర్ 12 కు అర్హత సాధించింది.

ICC T20 World Cup2021: bangladesh qualify for super 12 with a thumping victory over papua new guinea
Author
Hyderabad, First Published Oct 21, 2021, 7:09 PM IST

తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ (Bangladesh) అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. టీ20 ప్రపంచకప్ లోని క్వాలిఫయింగ్ రౌండ్  గ్రూప్-బిలో సూపర్-12 బెర్తు కోసం పోటీ పడుతున్న ఆ జట్టు తొలి మ్యాచ్ లో స్కాట్లాండ్ (scotland) తో ఓడిపోయి తర్వాత మ్యాచ్ లో ఒమన్ (Oman పై గెలిచింది.  అయితే బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలంటే  బంగ్లాకు నేటి మ్యాచ్ కీలకమైంది. దీంతో బంగ్లా పులులు రెచ్చిపోయి ఆడారు. బ్యాటింగ్ లో ఆ జట్టు  బ్యాటర్లు వీరవిహారం చేయగా.. బౌలింగ్ లో వెటరన్  స్పిన్నర్ షకిబ్ అల్ హసన్ (Shakib al hasan) మరోసారి మెరిశాడు. ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన బంగ్లాదేశ్.. సూపర్-12కు అర్హత సాధించినట్టే. 

ఇక 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పపువా న్యూ గినియా (papua new guinea) ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగినట్టు కనిపించలేదు. భారీ స్కోరును  చూసి విలవిల్లాడిన ఆ జట్టును బంగ్లా బౌలర్లు  బెంబేలెత్తించారు. దీంతో 19.3 ఓవర్లలో ఆలౌటైన పీఎన్జీ 97 పరుగులు మాత్రమే చేసింది. ఫలితంగా బంగ్లాదేశ్ 84 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్,  బౌలింగ్ తో మెరిసిన షకిబ్ అల్ హసన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. 

ఇన్నింగ్స్ మూడో ఓవర్ కే పీఎన్జీ (PNG) ఓపెనర్ లెగ సియాకా (5) ను సైఫుద్దీన్ ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపి ఆ జట్టు పతనానికి తలుపులు తీశాడు. ఆ వెంటనే కెప్టెన్ అసద్ (6) కూడా నిష్ర్కమించాడు. అసద్ ఔటవ్వగానే క్రీజులోకి వచ్చిన చార్లెస్ ఎమిని (1), సిమోన్ (0), సెసె (7), నోర్మన్ (0).. అలా వచ్చి ఇలా వెళ్లారు. దీంతో 10 ఓవర్లు ముగిసేసరికి పపువా న్యూ గినియా.. 6 వికెట్లు కోల్పోయి 28 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

 

చార్లెస్, సెసె, సిమోన్ వికెట్లను షకిబే పడగొట్టడం విశేషం. ఇక 29 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన పీఎన్జీ.. 40 పరుగుల్లోపే  ఆలౌట్ అవుతుందేమో అని ఆ జట్టు ఆట చూసిన వారికెవరికైనా అనుమానం రాక మానదు.  

కానీ ఎనిమిదో నెంబర్ బ్యాట్స్మెన్ గా వచ్చిన వికెట్ కీపర్ కిప్లిన్ (36 బంతుల్లో 46 నాటౌట్) ఆ జట్టును ఆదుకున్నాడు.  పపువా న్యూ గినియా అతి తక్కువ స్కోరుకు ఆలౌట్ కాకుండా అడ్డుకున్నాడు. చివరిదాకా క్రీజులో నిలిచిన కిప్లిన్.. ఓటమి అంతరాన్ని తగ్గించడానికి బాగానే ఆడాడు.  అతడికి కొద్ది సేపు సోపర్ (11) తోడుగా నిలిచాడు.కానీ సైఫుద్దీన్ మరోసారి అతడిని ఔట్ చేసి పీఎన్జీ ఇన్నింగ్స్ కు తెరతీశాడు. 

 

బంగ్లా బౌలింగ్ విషయానికొస్తే.. ఆ జట్టు ఆల్ రౌండర్ షకిబ్ అల్ హసన్  ఈ మ్యాచ్ లో అద్భుత ప్రదర్శనతో మెరిశాడు. బ్యాటింగ్ లో 46 పరుగులు చేసిన అతడు.. బౌలింగ్ లో 4 ఓవర్లు వేసి కేవలం 9 పరుగులే ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. సైఫుద్దీన్ కూడా పొదుపుగా బంతులు వేశాడు. 4 ఓవర్లలో 21 పరుగులే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. మెహదీ హసన్, టస్కిన్ అహ్మద్ కూడా ఆకట్టుకున్నారు. బంగ్లా స్టార్ బౌలరర్ ముష్పీకర్ రెహ్మాన్ కు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. 
 
అంతకుముందు టాస్ నెగ్గి బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. కెప్టెన్ మహ్మదుల్లా, షకీబ్ ఉల్ హసన్, లిటన్ దాస్, సైఫుద్దీన్ రెచ్చిపోవడంతో 181 పరుగులు చేసింది. 72 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ బంగ్లాదేశ్ ను మహ్మదుల్లా (28 బంతుల్లో 50) ఆదుకున్నాడు.   ఆఖర్లో అఫిఫ్ హుస్సేన్ (14 బంతుల్లో 21), మహ్మద్ సైఫుద్దీన్ (6 బంతుల్లో 2 సిక్సర్లు, ఒక ఫోర్ తో 19 నాటౌట్) రెచ్చిపోయి ఆడారు.

Follow Us:
Download App:
  • android
  • ios