ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్... ఇంటర్నేషనల్ క్రికెట్ కి సోమవారం వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. కాగా... అతని వీడ్కోలుపై టీం ఇండియా మాజీ క్రికెటర్, ప్రస్తుత బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ స్పందించారు. యూవీపై ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ ట్వీట్ చేశారు.

‘‘అద్భుతమైన కెరీర్‌కు శుభాకాంక్షలు ప్రిన్స్. భారత వన్డే క్రికెట్‌లో నువ్వు అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌వి. యూవీ సేవలకుగానూ జెర్సీ నెంబర్ 12కి కూడా బీసీసీఐ రిటైర్మెంట్ ప్రకటించాలి. నీలా బ్యాటింగ్ చేయాలని ఉండేది ఛాంపియన్’’ అంటూ ట్వీట్ చేశారు. 

యువీ 2000 సంవత్సరం అక్టోబర్‌లో కెన్యాపై అరంగేట్రం చేసి 304 వన్డేలు ఆడాడు.  ఈ ఫార్మాట్‌లో 14 శతకాలతోపాటు 42 అర్ధశతకాలు సాధించాడు. వన్డేల్లో 8701 పరుగులు పూర్తిచేయగా.. 111 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక 2017లో కటక్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువీ తన కెరీర్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (150) చేశాడు.  

2003 అక్టోబర్‌లో సొంత మైదానం మొహాలీలో న్యూజిలాండ్‌పై టెస్టు అరంగేట్రం చేసిన అతడు.. మొత్తం 40 టెస్టులు ఆడి మూడు శతకాలు, 11 అర్ధశతకాలు సాధించాడు. ఈ ఫార్మాట్‌లో 1900 పరుగులు పూర్తి చేశాడు. అలాగే  టీ20ల్లో 58 మ్యాచ్‌లు ఆడి 1177పరుగులు చేయగా 9 వికెట్లు పడగొట్టాడు. 2012లో చివరిసారి టెస్టు మ్యాచ్‌  ఆడిన యువీ.. 2017లో ఆఖరి వన్డే, టీ20 ఆడాడు.