అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 13లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇంకా బోణీ కొట్టలేదు.నిన్న(శనివారం) కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో అయినా ఆ జట్టు విజయాన్ని అందుకుంటుదన్న అభిమానులు మళ్లీ నిరాశే ఎదురయ్యింది. ఇలా ఈ సీజన్ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచుల్లోనూ హైదరాబాద్ జట్టుకు ఓటమి తప్పలేదు. అయితే ఈ ఓటమికి తానెవ్వరినీ నిందించబోనని... పూర్తి బాధ్యత తనదేనని కెప్టెన్ డెవిడ్ వార్నర్ పేర్కొన్నారు. 

మ్యాచ్ అనంతరం వార్నర్ జట్టు ఓటమికి గల కారణాల గురించి మాట్లాడుతూ... దుబాయ్‌ మైదానాల్లో బౌండరీలు కొట్టడం చాలా కష్టంగా ఉందన్నారు. ఇండియాలోని మైదానాలతో పోలిస్తే ఇక్కడి మైదానాల్లో బౌండరీలు చాలా దూరంలో ఉండటమే ఇందుకు కారణమన్నారు. అందువల్లే భారీ హిట్టింగ్ సాధ్యం కావడం లేదని వార్నింగ్ పేర్కొన్నారు.

video  కేకేఆర్ వర్సెస్ సన్ రైజర్స్ మ్యాచ్: శుభ్ మన్ గిల్ అద్భుత ఇన్నింగ్స్, భవిష్యత్తు కోహ్లీ..?

ఇక కెకెఆర్ తో జరిగిన మ్యాచ్  ఆరంభంలో మంచి రన్ రేట్ లభించినా దాన్ని చివరి వరకు కొనసాగించలేమని అన్నారు. తమ జట్టులో ఎక్కువగా హిట్టర్లు లేకపోవడం కూడా ఓటమికి మరో కారణమన్నారు. అయితే జట్టు ఓటమి విషయంలో మాత్రం ఎవ్వరినీ నిందించాల్సిన అవసరం లేదని... తప్పంతా తనదేనని వార్నర్ అన్నారు. తదుపరి మ్యాచుల్లో తన మైండ్ సెట్ ను మార్చుకుని బరిలోకి దిగుతానని అన్నారు. 

16వ ఓవర్ తర్వాత బ్యాటింగ్‌లో వేగం పెంచి బౌలర్లపై ఒత్తిడి తెచ్చి ఉంటే మంచి స్కోరు సాధించేవాళ్లమని... కానీ తమ జట్టులో సరైన హిట్టర్లు లేకపోవడం దురదృష్టకరమన్నారు. బౌండరీలు బాదే విషయంలో జట్టు సభ్యులకు మరింత ప్రాక్టీస్‌ కావాల్సి ఉందని వార్నర్ పేర్కొన్నారు.