Asianet News TeluguAsianet News Telugu

దోషాలను నివారించే నాగుల చవితి

పుట్టలో పాలు పోయటమనేది భారతదేశంలో అనాదిగా వస్తున్న ఆచారం. సిటీ ప్రాంతంలో నాగుల చవితికి అంత సందడిగా కనిపించదు కానీ గ్రామీనప్రాంతాలలో మాత్రం ఎంతో సందడి సందడిగా కనిపిస్తుంది. 

Nag Chavithi 2020: Date, Puja Muhurat And Significance
Author
Hyderabad, First Published Jul 24, 2020, 10:07 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Nag Chavithi 2020: Date, Puja Muhurat And Significance

ప్రకృతి మానవుని మనుగడకు జీవనాధరమైనది కనుక దానిని దైవ స్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణికోటిని దైవ స్వరూపంగా చూసుకొంటూ! పూజిస్తూవస్తున్నారు. ఇదే మనభారతీయ సంస్కృతిలోని హిందువుల పండగల విశిష్టత. నిశితంగా పరిశీలిస్తే ... అందులో భాగంగానే "నాగుపాము" ను కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు.

ఈ రోజు నాగుల చవితి. ఈ పండుగ రోజున ఊరిలో ఉన్న గుళ్ళలో ఉన్న పుట్టలలో కానీ లేదా ఊరి బయట ఉన్న పాము పుట్టలో పాలు పోస్తారు. పుట్టలో పాలు పోయటమనేది భారతదేశంలో అనాదిగా వస్తున్న ఆచారం. సిటీ ప్రాంతంలో నాగుల చవితికి అంత సందడిగా కనిపించదు కానీ గ్రామీనప్రాంతాలలో మాత్రం ఎంతో సందడి సందడిగా కనిపిస్తుంది. ఈ పండగకు పిల్లలతో కుటుంబ సభ్యలతో కలిసి చిన్నపాటి గ్లాస్ లో పాలను తీసుకొని వెళ్లి  పుట్టలో పోస్తుంటారు.

 దేవాలయాల్లో రాతి విగ్రహా జంట పాముల ప్రతిమలు, రెండు పాములు మెలికలు వేసుకొని రావి, వేప చెట్ల కింద దర్శనం ఇవ్వటం మనము ఎక్కువ గమనిస్తుంటాము. చవితి నాడు సర్పాలను పూజిస్తే సర్వరోగాలు, వైవాహిక దాంపత్య దోషాలు,  గర్భదోషాలు పోయి ఆరోగ్యవంతులవుతారని భక్తులు విశ్వాసంతో పుజిస్తారు. ఎందుకంటే కుజ దోషం, కాలసర్ప దోషానికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి. 

మన దేశంలో ఒక్కో చోట ఒక్కో విధంగా నాగులచవితిని జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాలలో కూడా నాగుల చవితి సందడి అంతా ఇంతా కాదు. తెల్లవారుజాము నుండే భక్తుల సందడి మొదలవుతుంది. కొన్ని ప్రాంతాల వారు దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ జరుపుకుంటారు. కొందరు శ్రావణ శుద్ధ చతుర్థినాడు జరుపుకుంటారు.

రైతులకు మేలు కలిగించేవి:- ఈ పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి " నీటిని" ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనంచేసే క్రిమికీటకాదులను తింటూ, పరోక్షంగా " రైతు " కు పంటనష్టం కలగకుండా చేస్తాయట!. అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి.

మన పురాణాలలో నాగుల చవితి గురుంచి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతట పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివునికి వాసుకిగా, విష్ణువుకు ఆది శేషుడుగా తోడు ఉంటాడు కాబట్టి ఈ చవితి రోజు విశ్వాసం గల భక్తుల పూజ నైవేద్యాలను సమర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం.

ఆధ్యాత్మిక యోగా పరంగా :- ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ' వెన్నుపాము' అని అంటారు. అందులో కుండలినీశక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారమువలెనే వుంటుందని "యోగశాస్త్రం" చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ! కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ మానవునిలో 'సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు ' నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది, అందరి హృదయాలలో నివసించే ' శ్రీమహావిష్ణువు" నకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే! ఈ నాగుపాము పుట్టలో పాలు పోయుటలోగల అంతర్యమని కొంత మంది పెద్దల మాటల ద్వార తెలుస్తుంది.

ముఖ్యంగా గమనించ వలసిన విషయం :- పుట్టలో వాస్తవానికి పాలు పోయకూడదు. పాముకు పాలు అరగవు. పుట్టకు పాలుపోయలనుకునే వారు పుట్ట దగ్గర ఒక మట్టి కంచుడు లేదా దోప్పను పెట్టి అందులో పాలు పోయాలి. అనవసరంగా పుట్టను తడిపి పాముకు కీడు చేసిన వారం కాకూడదు. పాము విగ్రహాలను మాత్రం పాలతో అభిషేకం చేయవచ్చును. మన పుణ్య కార్యం వలన వాటికి ఆనందం కలగాలి కానీ ఇబ్బంది కాకూడదు. మన ఇల్లు తడిగా ఉంటే మనం ఎలా ఫీల్ అవుతాం, పొడిగా ఉంటే ఎలాంటి అనుభూతి కలుగుతుందో ఉహించుకుని మన చర్య వలన ఏ ప్రాణి ఇబ్బంది కలగనప్పుడే మనకు పుణ్యఫలం దక్కుతుందని గ్రహించండి.   

ఎవరైనా పుట్టకు కోడి గుడ్డు సమర్పించాలనుకునే వారు పుట్టపై పెట్టాలి తప్ప పుట్ట రంద్రాలలో వేయకూడదు. పాము పుట్టలోకి వెళ్ళె మార్గానికి అంతరాయం కలిగించకూడదు. పుట్టపై  బియ్యం పిండిలో చక్కర కలిపి పుట్టపై చల్లాలి, దీని వలన పుట్టను అభివృద్ధి చేసే చీమలకు ఆహారం సమృద్ధిగా లభించడం వలన పుట్ట పెరుగుతుంది ఆ పుణ్య ఫలంతో సంసారం అభివృద్ధి చెందుతుంది. ఇక పూజకోరకు తీసుకువెళ్ళిన పసుపు, కుంకుమ పూలతో అలంకరణ చేసుకుని  బెల్లంతో వండిన పరమాన్నం నైవేద్యంగా పెట్టాలి. మీ కోరికలు తీరడానికి బంగరం, వెండితో చేసిన ఐదు నాగపడిగేలను పుట్టలో వేసి దూప, దీప, నైవెద్యాలు సమర్పరించిన తర్వత కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్ళను పుట్టపై చల్లాలి. 

చివరగా అక్షితలు చేతిలోపట్టుకుని మనస్సులో దాగిఉన్న కోరికలను నాగాదేవతకు విన్నవించుకుంటూ పుట్టచుట్టూ మూడు ప్రదక్షిణలు భక్తిశ్రద్ధలతో చేయాలి. హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి. ఇక్కడ మగవారు సాష్టాంగ ,ఆడవారు మోకాలి పై వంగి , గర్భిని స్థ్రీలు నిలబడి నమస్కారం చేసుకోవాలి. సంతాన సమస్యలు ఉన్న స్త్రీలు పుట్టపై ఉన్న తడి మట్టిని కొంత తన చేతితో తీసుకుని పొట్ట భాగంలో రాసుకోవాలి. ఇలా చేస్తే పిల్లలు కాని వారికి  గర్భ సంబంధమైన దోషాలకు చక్కటి తరునోపాయం. భక్తితో ఈ నాగదేవత పూజ చేస్తే సమస్త దోషాలకు చక్కటి నివారణ మార్గం అని చెప్పవచ్చు ... జై శ్రీమన్నారాయణ.


 

Follow Us:
Download App:
  • android
  • ios