డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

విష్ణువు యొక్క తాబేలు రూప అవతారము. హిందూమత పురాణాల లో శ్రీమహావిష్ణువు యొక్క దశావతారాల లో రెండవ అవతారం కూర్మావతారము. కూర్మము అనగా తాబేలు. దేవదానవులు అమృతము కోసము పాలసముద్రాన్ని మథించడానికి మందర పర్వతాన్ని కవ్వంగా నిర్ణయించి, పాలసముద్రంలో వేస్తే అది కాస్తా ఆ బరువుకి పాలసముద్రంలో మునిగిపోతుంటే, విష్ణుమూర్తి కూర్మావతారములో దానిని భరిస్తాడు. ఇది కృతయుగం లో సంభవించిన అవతారం.

అవతార గాథ:- ఒకమారు దేవేంద్రుని ప్రవర్తనకు కోపించిన దూర్వాస మహర్షి “దేవతలు శక్తిహీనులగుదురు” అని శపించాడు. అందువలన దానవులచేతిలో దేవతలు పరాజయం పొందసాగారు. వారు విష్ణువుతో మొరపెట్టుకోగా “సకల ఔషధులకు నిలయమైన పాలకడలిని చిలికి అమృతాన్ని సాధించండి” అని విష్ణువు ఉపాయాన్ని ఉపదేశించాడు.

దేవతలు ఆ బృహత్కార్యం కోసం అందుకు తమకంటె శక్తివంతులుగా ఉన్న దానవులతో సంధి కుదుర్చుకొన్నారు. మందర పర్వతం కవ్వంగా, వాసుకి త్రాడుగా క్షీరసముద్ర మథనం మొదలయ్యింది. కాని మందరగిరి బరువుకి మునిగిపోసాగింది. కార్యం నిష్ఫలమయ్యే పరిస్థితి ఉత్పన్నమైంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు కూర్మావతారమును ధరించి ఆ కొండను భరించెను.

అలా దేవదేవుని అండతో సముద్రమథన కార్యం కొనసాగింది. ముందుగా జగములను నాశనము చేయగల హాలాహలము ఉద్భవించినది. దేవతల మొర విని, కరుణించి, పరమశివుడు హాలాహలాన్ని భక్షించి, తన కంఠంలోనే నిలిపాడు. అందుచేత ఆయనను గరళకంఠుడు అనీ, నీలకంఠుడు అనీ అంటారు. తరువాత సుర (మధువు), ఆపై అప్సరసలు, కౌస్తుభము, ఉచ్ఛైశ్రవము, కల్పవృక్షము, కామధేనువు, ఐరావతము వచ్చాయి. 

ఆ తరువాత త్రిజన్మోహినియైన శ్రీలక్ష్మీదేవి ఉద్భవించింది. సకలదేవతలు ఆమెను అర్చించి, కీర్తించి, కానుకలు సమర్పించుకొన్నారు. ఆమె శ్రీమహావిష్ణువును వరించింది. చివరకు ధన్వంతరి అమృత కలశాన్ని చేతబట్టుకొని బయటకు వచ్చాడు. తరువాత విష్ణువే మోహినిగా ఆ అమృతం దేవతలకు దక్కేలా చేశాడు.

దేవాలయములు:శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం పట్ణానికి 15 కి.మీ. దూరంలో శ్రీకూర్మం అనే పుణ్య క్షేత్రం ఉంది. శ్రీమహావిష్ణువు కూర్మావతారం రూపంలో ఇక్కడ పూజింపబడుతాడు. కూర్మావతారం మందిరం దేశంలో ఇదొక్కటే.

 శ్రీ మహావిష్ణువు కూర్మావతారమును ధరించి ఆ కొండను భరించిన విషయాన్ని, ఆ అవతారాన్ని పోతన తన భాగవతం అష్టమ స్కందంలో  కూర్మావతారము గురించి ఇలా వర్ణించాడు.

సీ . సవరనై లక్ష యోజనముల వెడల్పై కడుc గఠోరంబైన కర్పరమున
      నదనైన బ్రహ్మాండమైన నాహారించు ఘన తరంబగు ముఖగహ్వరంబు
      సకల చరాచర జంతురాసుల నెల్ల మ్రింగి లోcగొనునట్టి మేటి కడుపు
      విశ్వంబుపై వేఱు విశ్వంబు పైcబడ్డ నాcగినc గదలని యట్టి కాళ్ళు

తే.  వెలికి లోనికిc జనుదెంచు విపుల తుండ
     మంబుజంబులc బోలెడు నక్షియుగము
     సుందరంబుగ విష్ణుండు సురలతోడి
     కూర్మి చెలువొంద నొక మహా కూర్మమయ్యె.

భావము:- లక్ష ఆమడల వెడల్పుతో చక్కని గట్టి వీపుడిప్ప కలదై, ఆకలి గోన్నప్పుడు బ్రహ్మాండాన్ని సైతం కబళించే పెద్దనోరు ఉన్నదై, లోకంలోని ప్రాణులన్నింటినీ మ్రింగి ఇముడ్చుకొనేంత పెద్ద కడుపు ఉన్నదై, ప్రపంచంపై ఇంకొక ప్రపంచం పడి అడ్డగించినా వెనుదీయకుండా ఉండే కాళ్ళుకలదై, లోపలికి బయటకీ కదలాడే పెద్దమూతి, కమలాల వంటి కన్నుల జంట ఉన్నట్టిదైన గొప్ప కమఠ రూపు పొంది విష్ణు దేవుడు దేవతలపై  తన ప్రేమను వెల్లడిస్తూ మహాకుర్మంగా మారిపోయాడు. అలా అవతరించిన కూర్మావతారము పొందిన విష్ణుమూర్తి కుర్మారూపానికి ఈ రోజు మనం పూజించుకునే సాంప్రదాయం మన పూర్వీకుల నుండి వస్తుంది.