Asianet News TeluguAsianet News Telugu

సిద్ది వినాయక చవితి ముందు తదియ గౌరీపూజ

ఈ పండుగ వివాహిత మహిళలు జరుపుకుంటారు.ఈ గౌరీ పండుగను భాద్రపద శుద్ద చతుర్థి ముందు రోజు తదియ రోజున జరుపుకుంటారు. సౌభాగ్యాలను ప్రసాధించే గౌరీ పండుగను వివాహిత మహిళలు జరుపుకుంటారు.

How to Do Gowri Pooja Before Lord Ganesha Pooja
Author
Hyderabad, First Published Sep 8, 2021, 2:31 PM IST

 

భాద్రపద బహుళ తదియ రోజు స్త్రీలు సద్గతులు పొందడానికి నిమిత్తం ఉండ్రాళ్ళ తదియ నోమును ప్రత్యేకంగా ఆచరించి నిర్వహించుకుంటారు... ఈ నోముకు మోదక తృతీయ అని కూడా పేరు. ఉండ్రాళ్ళ నివేదన కలిగిన నోము కావడంతో ఉండ్రాళ్ళ తదియగా పిలవబడుతుంది. శక్తికి మూలం దేవత మరియు మంగళకరం, మంగళప్రదానికి సంకేతంగా గౌరీదేవిని పూజిస్తారు. గౌరీ పండుగను భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో జరుపుకుంటారు. గౌరీ గణేష్, గౌరీ చౌతి లేదా గౌరీ పండుగ అని పిలువబడే ఈ పండుగను గణేశ చతుర్థి సందర్భంగా జరుపుకుంటారు. 

ఈ పండుగ వివాహిత మహిళలు జరుపుకుంటారు.ఈ గౌరీ పండుగను భాద్రపద శుద్ద చతుర్థి ముందు రోజు తదియ రోజున జరుపుకుంటారు. సౌభాగ్యాలను ప్రసాధించే గౌరీ పండుగను వివాహిత మహిళలు జరుపుకుంటారు. గౌరీ దేవిని ఆరాధించడం వల్ల సుఖ, సంతోషాలతో పాటు ఆనందం, సంపద మరియు సుదీర్ఘ జీవితాన్ని ఇస్తుందని మరియు తన భర్తను ఆయుష్యును పెంచి ఆశీర్వదిస్తుందని అంటారు. గౌరీ పండుగ వరమహాలక్ష్మి వ్రత మాదిరిగానే ఉంటుంది. తేడా ఏమిటంటే లక్ష్మీ స్థానంలో గౌరీ దేవిని పూజిస్తారు.

ఈ వ్రతం గురుంచి సాక్షాత్తు పరమ శివుడు పార్వతి దేవికి వివరించాడు అని పురాణాలూ చెబుతున్నాయి. వివాహము అయిన సంవత్సరము వచ్చు ఉండ్రాళ్ళ తదియ రోజున ఈ నోము పట్టుకొందురు. ముందు రోజు ఐదుగురు ముత్తైదువులకి గోరింటాకు, ముద్దపసుపు కుంకుమలు, కుంకుడు కాయలు, నువ్వులనూనె ఇచ్చి మా యింటికి తాంబూలము తీసుకోవటానికి రమ్మని ఆహ్వానించాలి. ముత్తైదువులు నోము ఆచరించే వారు గోరింటాకు పెట్టుకొనవలెను. రెండవ రోజు భాద్రపద తృతీయ నాడు ఉదయాన్నే 4 గంటలకు లేచి గోంగూర పచ్చడితో భోజనము చేయవలెను. 
 
తెల్లవారినాక అభ్యంగన స్నానమాచరించి సాయంత్రం వరకు ఎటువంటి పదార్థాలు తినకుండా ఉపవాసం చేయాలి. బియ్యపు పిండితో చేసిన ఉండ్రాళ్ళను చేసి వాటిని వండి గౌరీ దేవికి, మరో ఐదు ఉండ్రాళ్ళను ఐదుగురు ముతైదువులకు వాయనమివ్వాలి. ఇలా ఐదు సంవత్సరాల వరకు ఈ నోమును నోచుకుంటే మంచి దాంపత్య జీవితం లభిస్తుందని పెద్దలు చెబుతారు. 

సమస్త శుభాలను చేకూరాలని కోరుతూ మధ్యాహ్నం గౌరీ పూజను చేయాలి. ఐదు దారపు పోగులు పోసి, ఐదు ముడులు వేసి, ఏడు తోరాలను అమ్మవారి పక్కనే వుంచి పూజించాలి. ఒక తోరం అమ్మవారికి, ఒకటి నోముకున్నవారికి, మిగితా ఐదు, ఐదుగురు ముత్తైదువులకు కట్టాలి. బియ్యపు పిండిలో బెల్లము కలిపి, పచ్చి చలిమిడి చేసి, ఐదు ఉండ్రాలను చేసి నైవేద్యం పెట్టాలి. పూజ తరువాత చేతిలో అక్షింతలనుంచుకొని కథ చెప్పుకోవాలి. 

ఈ వ్రత కథ ఏమిటంటే పూర్వం ఓ వేశ్య తన సౌందర్యంతో ఆ దేశపు రాజు గారిని వశపరుచుకుంది. ఒక ఉండ్రాళ్ళతద్దె నాడు రాజుగారు ఆమెను నోము నోచుకోమని కోరారు. ఆమె అహంకారముతో దైవ నింద చేసి నోము నోచుకోలేదు. ఫలితంగా దొంగలు ఆమె సంపదనంతా దోచుకెళ్తారు. అంతేగాక ఆమె మహా వ్యాధి బారిన పడుతుంది. తరువాత రాజ పురోహితుడి సలహాతో ఉండ్రాల తద్దె నోము నోచుకొని, తన సంపదని తిరిగి పొంది, ఆరోగ్యస్తురాలై శేష జీవితాన్ని ఆధ్యాత్మికంగా గడిపి, మరణానంతరం గౌరీ లోకానికి వెళ్ళింది. గర్విష్టికే ఈ నోము వలన ఇంతటి సద్గతి లభించింది కదా.. సత్ప్రవర్తనతో ఉండి నోచినవారికి ఇంక ఎంత ఉన్నతమైన ఫలితముంటుందో ఊహించుకోమని ఈ కథలోని నీతి.
 
పూజ అయ్యాక  నైవేద్యము గౌరిదేవి వద్ద పెట్టిన ప్లేటులోని తోరము చేతికి కట్టుకుని 5 గురికి భోజనము వడ్డించినాక ఒక్కొక్కరికి ఒక వాయనము ఇవ్వవలెను. వాయనము ఇచ్చునప్పుడు... ఇస్తినమ్మ వాయనము పుచ్చుకొంటినమ్మ వాయనము, ఇస్తి వాయనమునమ్మ పుచ్చుకొంటినమ్మ వాయనము, ముమ్మాటికి ఇస్తినమ్మ  వాయనము ముమ్మాటికి పుచ్చుకొంటినమ్మ వాయనము.. వాయనము తీసుకున్నది ఎవరు నేనే పార్వతిని ఇలా5గురికి ఇవ్వవలెను. 
 
అందరికి తోరములు చేతికి కట్టవలెను. ముడివేయకూడదు. బియ్యం పిండి ముద్దతో కుందిలాగ చేసి దానిలో ఆవునేతితో తడిపిన కుంభవత్తి పెట్టి 5 గురి ఇస్తరాకుల ముందు వెలిగించవలెను. అవి ఆరినాక జ్యోతితో సహా చలిమిడిని తినవలెను. నోము చెల్లించుకునే ముత్తైదువు నెయ్యి వడ్డించినాక భోజనము చేయుదురు. 5 పోగులకు పసుపు రాసి 3 చోట్ల పూలు ముడివేసి 2 చోట్ల ఉత్త ముడి వేయవచ్చును. తోరము రెడీ అయినట్లు. ఈ నోము పట్టుకొనుట, పుట్టింటిలోకాని అత్తగారింటిలోకాని పట్టుకొనవచ్చును.
 
ఆయుర్వేద శాస్త్రం ప్రకారము ఉండ్రాళ్ళు ( కుడుములు) తినడం వలన కడుపులో ఉన్న నులిపురుగులను, వేడిని హరిస్తుంది. గోంగూర వేడిచేసే ద్రవ్యము, పెరుగన్నము చలవ చేసే పదార్దము. తలంటు స్నానము అనేది తలని శుభ్రం చెస్తే... గోంగూర పెరుగు అన్నము పిల్లలకు చురుకుదనాన్ని ఇస్తుంది. పూర్వం రోజుల్లో పొలాలకెళ్ళే రైతులంతా పెరుగన్నము గోంగూర లేదా ఆవకాయ నంజుకుని వెళ్ళిపోయి మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటలకి ఆకలితో నకనకలాడుతూ వస్తూండేవారు. ఆ తీరుగా చురుకుదనాన్ని పుట్టిస్తుంది ఈ భోజన మిశ్రమము. కొన్నిచోట్ల నువ్వుల పొడి కూడా ఈ మిశ్రమములో చేరుస్తారు. దీనివల్ల శ్రావణ భాద్రపద మాసాల్లో వర్షాల కారణంగా వచ్చే జలుబు, దగ్గు, ముక్కు, కళ్ళ మంటలు మొదలగునవి రావు. అందుకే పూర్వం నుండే పెద్దలు ప్రకృతికి అనుగుణంగా పండగలను ఏర్పాటు చేసారు.

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. 
        సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Follow Us:
Download App:
  • android
  • ios