Asianet News TeluguAsianet News Telugu

బక్రీద్ పండుగ విశిష్టత

హజ్ యాత్రకొరకు అరబ్ దేశమైన సౌదీ అరేబియా‌లోని మక్కా నగరానికి చేరుకుని మసీద్ లో ఉన్న కాబా చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేసి అక్కడ ప్రార్థనలు చేస్తారు. ఈ మసీద్  కాబా గృహం చుట్టూ ఉంది. ప్రపంచంలోని ముస్లింలందరూ కాబా వైపు తిరిగి నమాజ్ ( ప్రార్థనలు ) చేస్తారు. దీనినే ఖిబ్లా అని కూడా అంటారు.
 

Happy Bakrid 2020: Eid al-Adha Mubarak Wishes
Author
Hyderabad, First Published Aug 1, 2020, 9:05 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Happy Bakrid 2020: Eid al-Adha Mubarak Wishes

ముస్లింల ప్రధాన పండగలు రెండు ఒకటి రంజాన్ రెండవది బక్రీద్. ఈ పండుగకు ఈదుల్.. అజహా, ఈదుజ్జహా, లేక బక్రీద్ అని కూడా అంటారు. ఇస్లామ్ క్యాలెండర్ ప్రకారం 12వ నెల జిల్‌హేజ్‌ 10వ తేదీన బక్రీద్ పండుగను ముస్లింలు జరుపుకుంటారు. ఇస్లాం మతంలోని ఐదు ప్రధాన సూత్రాలలో ఒకటైన హజ్‌ ‌తీర్థయాత్రను ముస్లింలు చేయవలసి ఉంటుంది. ఈ మాసం ప్రారంభంలోనే ముస్లిం ప్రజలు భక్తి ప్రపత్తులతో హజ్ తీర్థయాత్రకు బయలుదేరతారు.

హజ్ యాత్రకొరకు అరబ్ దేశమైన సౌదీ అరేబియా‌లోని మక్కా నగరానికి చేరుకుని మసీద్ లో ఉన్న కాబా చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేసి అక్కడ ప్రార్థనలు చేస్తారు. ఈ మసీద్  కాబా గృహం చుట్టూ ఉంది. ప్రపంచంలోని ముస్లింలందరూ కాబా వైపు తిరిగి నమాజ్ ( ప్రార్థనలు ) చేస్తారు. దీనినే ఖిబ్లా అని కూడా అంటారు.

హజ్ తీర్థయాత్రకు వెళ్ళినవారు మక్కా నుండి మదీనా ( ముహమ్మద్ ప్రవక్త గోరీ ఉన్ననగరం )ను సందర్శిస్తారు. అల్లాహ్ ఆదేశానుసారం ఇబ్రహీం తన ఏకైక పుత్రుడైన ఇస్మాయిల్‌ను బలి ఇవ్వడానికి సిద్ధమౌతాడు. ఆ సంప్రదాయాన్ని స్మరిస్తూ ముస్లింలు ఈ బక్రీద్ పండుగను జరుపుకుంటారు.

బక్రీద్ అంటే బకర్ ఈద్ అని అర్థం. బకర్ అంటే జంతువని, ఈద్ అంటే పండుగని అర్థాలు ఉన్నాయి. జంతువును ఖుర్బాని ( దానం ) ఇచ్చే పండుగ కాబట్టి దీనిని ఈదుల్ ఖుర్బాని అని కూడా అంటారు. మహ్మదీయులు సంవత్సరాన్ని హిజ్రీ అనే పేరుతో పిలుసుకుంటారు. హిజ్రీ అంటే వలసపోవడం అని అర్థం. మహ్మద్ ప్రవక్త మక్కా నుండి మదీనాకు తరలివెళ్లడాన్ని హిజ్రీగా పేర్కొంటారు. ప్రతి ముస్లిం తన జీవిత కాలంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలన్నది ఇస్లాం మత సూత్రాలలో ఇదొకటి. త్యాగనిరతితోపాటు మనోవాంఛ, స్వార్థం, అసూయ, రాగద్వేషాలను కూడా విడిచిపెట్టి మానవతను వెదజల్లాలన్నదే బక్రీద్ పండుగలోని ప్రధాన పరమార్ధం దాగిఉంది.

ఖురాన్ ప్రకారం.. భూమిపైకి అల్లాహ్ పంపిన ప్రవక్తల్లో ఇబ్రహీం ఒకరు. ఆయన మక్కా పట్టణాన్ని నిర్మించి నివాస యోగ్యంగా మార్చారు. అల్లా ఆరాధన కోసం కాబా అనే ప్రార్థనా మందిరాన్ని కూడా నిర్మించి దైవ ప్రవక్తగా ఆయన పేరుపొందాడు. ఇబ్రహీం తనకు లేకలేక పుట్టిన బిడ్డకు ఇస్మాయిల్‌ అని పేరు పెట్టాడు. ఓ రోజు ఇస్మాయిల్ మెడపై కత్తిపెట్టి కోస్తున్నట్టు ఇబ్రహీం కలగన్నాడు. అల్లాహ్ ఖుర్భాని కోరుతున్నాడమోనని ఓ ఒంటెను బలిస్తాడు. అయినా, మళ్లీ అదే కల రావడంతో తన కుమారుడినే బలిదానం కోరుకుంటున్నారని భావించిన ఇస్మాయిల్‌ సిద్ధపడ్డాడు. ఇస్మాయిల్ మెడపై కత్తి పెట్టి జుబాహ్‌కు ఇబ్రహీం ఉద్యుక్తుడవుతుండగా అతని త్యాగానికి మెచ్చిన అల్లాహ్ దీనికి బదులుగా ఓ జీవాన్ని బలివ్వాలని జిబ్రాయిల్ అనే దూత ద్వారా కోరతాడు. అప్పటి నుంచే బక్రీద్ రోజున ఖుర్బాని ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందని ముస్లిం భావిస్తున్నారు.

ఖుర్బాని అంటే పేదలకు మాంసాన్ని దానం ఇవ్వడం, త్యాగం అనే అర్థాలు ఉన్నాయి. ఖుర్బాని అంటే సాన్నిధ్యం, సామీప్యం, సమర్పణ, త్యాగం అని కూడా అర్థం. అంటే దైవ సాన్నిధ్యాన్ని పొందడం. దైవానికి సమర్పించడం. దైవం కోసం త్యాగం చేయడం అని భావం. అయితే, ఖుర్బాని ద్వారా రక్త మాంసాలు సమర్పించడం కాదని, రక్తం, ఇవి అల్లాకు చేరవని, భక్తి, పారాయణత హృదయంలో జనించే త్యాగభావం, భయభక్తులు మాత్రమే ఆయనకు చేరుతాయని ముస్లింల భావన. అంతే కాదు.. ప్రాణత్యాగానికైనా వెనుకాడడని ఇదే ఖుర్బాని పరమార్థమని ముస్లిం పెద్దలు కొందరు అంటారు. మాంసాన్ని మూడు భాగాలుగా చేసి ఒక భాగం పేదల ప్రజలకు, రెండో భాగం తమ బంధువులకు, మరో భాగం తన కుటుంబం కోసం వినియోగిస్తారు. 

ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు బక్రీద్ రోజున ఖుర్బాని ఇస్తారు. జిల్ హజ్ నెల 11, 12 రోజుల్లో కూడా కొన్ని చోట్ల ఖుర్భాని ఇస్తూనే ఉంటారని తెలుస్తుంది. ఖుర్భానిగా సమర్పించే జంతువులకు అవయవలోపంలేని, ఆరోగ్యకరమైనవిగా ఉండాలి. ఒంటె, మేక లేదా గొర్రెను దైవమార్గంలో సమర్పించాలి. స్థోమత కలిగిన ప్రతి ముస్లిం దీనిని విధిగా ఆచరించాలి. అల్లా నియమ నిబంధనల ప్రకారం ఖుర్బానిగా కోడిపుంజును ఇవ్వరాదు. ఐదేళ్ల వయసు పై బడిన ఒంటె, రెండేళ్ల పై బడిన ఎద్దు, కనీసం ఏడాది వయసున్న మేక, గొర్రెలను బలి ఇవ్వాలి. ఖుర్భాని చేసే వ్యక్తీ వడ్డీతో కూడిన అప్పులు ఇవ్వడం, తీసుకోవడం చేయరాదు. ఈ నియమాలను తప్పక పాటిస్తారు.

బక్రీద్ పండుగ సందర్భంగా మటన్ బిర్యానీ, మటన్ కుర్మా, మటన్ కీమా, షీర్ కుర్మా, కీర్ లాంటి వంటకాలను తయారు చేస్తారు.ఇతరత్రా వంటకాలు చేస్తారు. మృతి చెందిన వారి సమాధులను దర్శిస్తారు. సమాధులను అందంగా అలంకరిస్తారు. వారికిష్టమైన దుస్తులు, భోజనం అక్కడ ఉంచుతారు. స్వర్గంలో ఉన్న వారు వాటిని స్వీకరిస్తారని నమ్మకం. అన్ని గుణాల్లోనూ దానగుణమే ఉత్తమోత్తమమైనది. ఆకలి అనేది అందరి సమానమైనది కాబట్టి ఈ పండగకు నిరుపేద కుటుంబాలకు శక్త్యనుసారంగా దానధర్మాలు చేస్తూ కొంత కొంత మందికైన ఆకలి తీర్చగాలిగాం అని సంతృప్తి చెందుతారు. ధర్మం అంటే దానగుణం ముడిపడి ఉన్నదే మానవ ధర్మం. మతం ఏదైనా మానవత్వం గొప్పది.


 

Follow Us:
Download App:
  • android
  • ios