Asianet News TeluguAsianet News Telugu

భాద్రపద మాస విశిష్టత

భాద్రపద శుద్ద పంచమి నాడు ఋషి పంచమి జరుపుకొంటారు. ఇది కేవలం ఆడవారికి సంబంధించిన ప్రాయోశ్చితాత్మకమైన వ్రతం. 

bhadrapada masam 2020 started
Author
Hyderabad, First Published Aug 21, 2020, 8:30 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

bhadrapada masam 2020 started

చంద్రమాన రీత్యా చంద్రుడు పౌర్ణమి నాడు పూర్వాభాద్ర లేదా ఉత్తరాభాద్ర నక్షత్రం ఉండడం వలన భాద్రపద మాసం పిలవబడుతుంది.
ఈ మాసం లో ఒంటి పూట భోజనం చేస్తే ధన సమృద్ది ఆరోగ్యం ప్రాప్తిస్తాయి. ఉప్పు మరియు బెల్లం దానాలు కూడా ఈ మాసం లో విశేష ఫలితాన్నిస్తాయి. కొన్ని ప్రదేశాలలో స్త్రీలు భాద్రపద శుక్ల తదియ రోజున హరితాళిక వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించి, ఉపవాసం జాగరణ చేస్తారు. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్దలతో ఆచరిస్తే కష్టాలు తొలగి, అష్టైశ్వర్యాలతో తులతూగుతారని నమ్మకంతో పుజిస్తారు.

భాద్రపద శుద్ద చవితి నాడు ఆది దేవుడైన వినాయక ఆవిర్భావం జరిగిన రోజు, ఈ రోజున గణపతి పూజ ఉపవాసం వంటివి విశేష ఫలితాన్నిస్తాయి. 

ఈ పండుగ ఆదివారం రోజు కాని, మంగళవారం రోజు కాని రావడం మరింత విశేషాన్ని సంతరించుకొంటుంది.

భాద్రపద శుద్ద పంచమి నాడు ఋషి పంచమి జరుపుకొంటారు. ఇది కేవలం ఆడవారికి సంబంధించిన ప్రాయోశ్చితాత్మకమైన వ్రతం. 

ఈ వ్రతం చేయడం వలన స్త్రీలు ఋతుశ్రావ సమయం లో చేసిన పాపాలన్నీ తొలగి పుణ్య ఫలితం లభిస్తుంది అని భవిష్యపురాణం లో చెప్పబడింది. 

ఈ వ్రతంలో ముఖ్యంగా ఆచరించవలసినది, పేదవారికి అరటి పళ్ళు, నెయ్యి, పంచదార, శక్తి కొలది ధనం ఇవ్వాలి. ఒంటి పూట భోజనం చేయాలి.

అంతే గాక ఆ భోజనం ధాన్యం, పాలు, పెరుగు, ఉప్పు, పంచాదారలతో తయారైనదవకుండా ఉండాలి. పళ్ళని స్వీకరించడం శ్రేయస్కరం.

బౌద్ద జయంతిని కూడా ఈ రోజునే జరుపుకొంటారు. బుద్దుని భోధనలు మానవుని ధర్మబద్దమైన, పవిత్రమైన జీవనానికి వెలుగు బాట వేసాయి. 
ప్రపంచం లోని ధర్మమతస్తాపనకు బుద్దుడు అత్యున్నత స్థానం వహించాడనే విషయంలో ఏమాత్రం భేదాభిప్రాయాలు లేవు.

భాద్రపద శుద్ద షష్ఠి /సూర్య షష్ఠి , సప్తమి కలసిన షష్ఠి సూర్యునికి ప్రీతికరం, ఈ రోజున సూర్యుడిని ఆవుపాలు, పెరుగు, నెయ్యి, గోమయం, గోమూత్రం తో ప్రాశనం చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలం కంటే ఎక్కువ ఫలం కలుగుతుందని పెద్దలు చెబుతారు. 

షష్ఠితో కూడిన సప్తమి కనుక ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ఎటువంటి పాతకాలైన నశిస్తాయి.

భాద్రపద శుద్ద అష్టమి నాడు కేదారవ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని సంప్రదాయ సిద్దంగా ఆచరిస్తుంటారు

భాద్రపద శుద్ద దశమి నాడు దశావతార వ్రతం ఆచరించడం దేవ, ఋషి , పితరులకు తర్పణాలు చేయడం ముఖ్యమైన విధులు.

భాద్రపద శుద్ద ఏకాదశి, దీనినే పద్మ పరివర్తన ఏకాదశి అని కూడా అంటారు. తోలి ఏకాదశి రోజున పాల సముద్రంలో శేషతల్పంపై శయనించిన శ్రీమహావిష్ణువు, ఈ ఏకాదశి రోజున ప్రక్కకు పొర్లి పరివర్తనం చెందుతాడు, అందుకే దీన్ని పరివర్తన ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే కరువు కాటకాలు తొలగి పోతాయి, ముఖ్యంగా సంధ్యా సమయంలో శ్రీ మహావిష్ణువుని పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి.

భాద్రపద శుద్ద ద్వాదశి వామన జయంతి గా చెప్పబడింది, ఈ రోజున వామనున్ని ఆరాదిస్తే అన్ని విషయాలలోనూ విజయం లభిస్తుంది. 
ముఖ్యంగా ఈ రోజున అనాధలకు, నిరుపేదలకు పెరుగును దానం చేస్తే మంచి ఫలితాలని పొందవచ్చు.

భాద్రపద మాసంలో శుద్ద చతుర్దశి నాడు అనంత పద్మనాభ చతుర్దశి అంటారు. శేషతల్పసాయిగా నాభి కమలంతో శ్రీమహాలక్ష్మి సమేతుడైన శ్రీమహావిష్ణువుని పూజించి, వ్రతమాచరిస్తే దారిద్ర్యం తొలగి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది.

భాద్రపద పూర్ణిమ రోజు ఉమామహేశ్వర వ్రతం జరుపుకొంటారు, భక్తి శ్రద్దలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే సుఖశాంతులతో పాటు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి.

భాద్రపద పూర్ణిమతో మహాలయపక్షం ఆరంభం అవుతుంది, అమావాస్య వరకు గల ఈ కాలాన్ని పితృ పక్షం అని కూడా అంటారు. మృతులైన పితరులకు, పూర్వీకులకు తప్పనిసరిగా తర్పణలివ్వాలి. శ్రాద్దాన్ని యధాశక్తిగా ఈ దినాలలో చేయాలి.


భాద్రపద బహుళ తదియని ఉండ్రాళ్ళ తద్దేగా చెప్పబడింది. ఇది స్త్రీలు చేసుకొనే పండుగ, ముఖ్యంగా కన్నె పిల్లలు గౌరీ దేవిని పూజించి, 
ఉండ్రాళ్ళను నివేదిస్తే మంచి భర్త వస్తాడని చెప్పబడింది. స్త్రీలకు అయిదవతనం వృద్ది చెందుతుంది.

భాద్రపద కృష్ణ ఏకాదశి / అజ ఏకాదశి దీన్ని ధర్మప్రభ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు ఏకాదశి వ్రతమాచరించి నూనె గింజలను దానం చేస్తే విశేష ఫలితాన్ని పొందవచ్చు.

భాద్రపద కృష్ణఅమావాస్య / పొలాల అమావాస్య / మహాలయమావాస్య, ఈ రోజున పితృ తర్పణాలు, దానధర్మాలు చేయడం ఆచారం.

Follow Us:
Download App:
  • android
  • ios