Asianet News TeluguAsianet News Telugu

కొత్త సంవత్సరం - కోటి ఆశలు

పాత, రోత భావాలను దూరం చేసుకుని మన మనస్సులో దివ్యమైన నూతన భావాలను వృధ్ధిచేసుకుని నూతనంగా జీవించడమే నూతన సంవత్సరంలో  మనలో రావలసిన మార్పు.

Asduri hymavathi story on new year
Author
First Published Jan 4, 2023, 3:37 PM IST

ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా పుట్టపర్తి నుండి ఆదూరి హైమావతి రాసిన ఆధ్యాత్మిక వ్యాసం ఇక్కడ చదవండి :

నూతన సంవత్సరం అంటే ? ప్రతిక్షణం నూతనమే.  ఒక క్షణం లేక సెకండు మారి కొత్తది వస్తుంటుంది. కొన్ని సెకండ్లు కలసి ఒక నిముషం, నిముషాలు గంటలుగా, గంటలు రోజులుగా, రోజులు నెలలుగా , నెలలు సంవత్సరాలుగా మారడం సహజం.  నూతన సంవత్సరం ప్రారంభానికి   కొన్ని క్షణాలు గడవాలి. ఆ క్షణాలన్నీ పాతవై తేనే ఒక కొత్త సంవత్సరం వస్తుంది.  అంటే ప్రతిక్షణం  నూతనమే కదా! సంవత్సరాలు కొత్తవి వచ్చినా , కొత్త సంవత్సరంలో మనలో కొత్త మార్పు ఏమి వస్తున్నది , మనం కొత్తగా ఎలా మంచిగా మారుతున్నాం అని ఆలోచిం చుకోవాలి. పాత, రోత భావాలను దూరం చేసుకుని మన మనస్సులో దివ్యమైన నూతన భావాలను వృధ్ధిచేసుకుని నూతనంగా జీవించడమే నూతన సంవత్సరంలో  మనలో రావలసిన మార్పు.

అదే నూతన సవత్సరం అవుతుంది కానీ, క్యాలెండర్లూ, పంచాంగాలూ మారితే నూతనం ఎలా అవుతుంది?  అవి తయారు చేసిన వారికీ, ప్రింట్ చేసినవారికీ డబ్బు వస్తుంది తప్ప.  కొత్త సంవత్సరమని , కొత్త బట్టలూ, విందులూ వినోదాలు చేసుకోను డబ్బు వెచ్చిస్తాం. ఐతే మనలో ఏ కొత్త మంచి భావాలు వస్తున్నాయి.  మన ప్రవర్తన   ఎలా మంచిగా , సమాజానికి హితవుగా ,  మనం ముక్తి మార్గం వైపు వెళ్ళే విధంగా మారుతున్నదా! అని గమనించుకుంటూ ఉండాలి.  అదే నూతన సంవత్సరమవుతుంది.    

భగవంతుని కాల స్వరూపుడు అంటాం.  కాలాయనమః, కాలకాలాయనమః, కాలస్వరూపాయనమః అని భగవంతునికి పేర్లున్నాయి.  అంటే మారే కాలం అంతా భగవంతుని స్వరూపమేకదా!  భగవంతుడు ఒక రూపంలోనో నామంలోనో లేడు, అన్నీరూపాలూ, నామాలూ ఆయనవే. కంటికి కనిపించే జగత్తంతా ఆయన వ్యాపించి ఉన్నాడు.  మణిమాణిక్య హారాలయందూ, పూల మాలలయందూ దాగిఉన్న దారం వలె భగవంతుడు విశ్వమంతా  వ్యాపించి ఉన్నాడు.

విశ్వంలో ఉన్న ప్రతి ప్రాణిలోనూ భగవంతుడు ఉన్నాడు. అందుకే ఎవ్వరికీ  హాని చేయరాదని అన్ని మత ధర్మాలూ చెప్తున్నాయి.  నీవలె నీపొరుగువారిని ప్రేమించు, అందరినీ ఆదరించు, సేవచేయి, సహాయం చేయి  అని అవి   ప్రవచిస్తున్నాయి.    18 పురాణాలు వ్రాసిన వ్యాసభగవానుడు , అన్ని గ్రంధాల సారాన్నీ  అర్థ శ్లోకంలో ' పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం ' అని చెప్పారు.  అంటే ఇతరులకు సాయం చేయడమే పుణ్యం, ఇతరులను బాధించడమే పాపం.  ‘శరీర మాధ్యం కలు ధర్మసాధనం - శరీరం ఇచ్చినది ధర్మాన్ని అనుస రించమనే.  ఎన్నో జన్మల తర్వాత  లభించిన మానవ జన్మ పరోపకారం కోసమే. 

కొత్త సంవత్సరాలు వస్తూ పోతూ, వయసు  పెరిగిపోతూ చివరకు మృత్యువు  ఆసన్నమైనపుడు మనం ఏమీ చేయలేము. ఒక ఊరికి పోవాలంటే ముందునుంచే బట్టలు సర్దుకొని, వెళ్ళినచోట ఎక్కడ ఉండాలి? ఎల్లా వెళ్లాలి? ఎంత ఖర్చవుతుంది? ఇలాప్లాన్ వేసుకుంటాం. మరి మనం జీవితమంతా కొత్త సంవత్సరాలు వస్తూ పోతూ ఉన్నా  వయసు పెరిగిపోతూ ఉన్నా పరలోకయాత్రకు కావలసిన, చేయవలసిన ప్రయత్నాలు చేసుకోక కాలం గడిపేస్తూ వృధాచేస్తూ ఉంటే మానవ జన్మ సార్థకత ఏంటి?  అనిమనం  ఆలోచించుకోవాలి.         
   
మనం సాధారణంగా కాలం గురించీ అనేక ఆలోచనలు చేస్తాం. కాలం కల్సిరాలేదనీ, కాలం బాగాలేదనీ, లేకపోతే కాలం బాగా కాలసి వచ్చిందనీ అనుకుంటాం. ఐతే మన కష్ట సుఖాలూ, కలసిరావటాలూ, మనశాంతి సౌభాగ్యాలూ మన ప్రవర్తన మీద  ఆధారపడి ఉంటాయి తప్ప కాలం మీద కాదు. చీకట్లో వెళుతుంటే రాయి తగిలి పడి దెబ్బ తగిలితే అదికాలం వలననా ?  లేక్ మన అజాగ్రత్త వలననా!  చీకట్లో దీపం ఆసరాతో  నడవాల్సిన బాధ్యత  మనది కానీ కాలంది కాదు కదా!

కాలానికి మిత్రులు, బంధువులూ, శత్రువులూ ఉండరు.  అంతా కాలానికి లొంగవలసినదే కానీ, కాలం ఎవ్వరికీ లొంగదు.  సూర్యుడు ఎవరి ఆజ్ఞ మేరకైనా నడుస్తాడా!  ఎవరి ఆజ్ఞమేరకైనా వెలుగు, వేడి ప్రసరిస్తాడా!  కనుక కాలం దోషం ఏమీ ఉండదని తెలుస్తున్నదికదా! సాధారణంగా మనం కాలాన్ని భూత , భవిష్యత్, వర్త మానాలుగా పిలుస్తాం. భూతకాలమంటే జరిగిపోయినది. పాస్ట్ . దానిని తిరిగి తేలేము, వెనక్కు  పోలేము. పాస్ట్ ఈజ్  పాస్ట్.  మరి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు. దానినీ మనం నిర్దేశించలేము.  దాని కోసం దిగులు పడి ఉన్న కాలాన్ని కూడా వ్యర్థం చేసుకోడం అవివేకం .  కనుక జరిగే కాలాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. వర్తమానంలో  మనం వర్తంచవలసిన తీరుతెన్నులను ఆలోచించుకొని  సక్రమంగా గడుపుకోవాలి.

ప్రెజెంట్ అంటే ఆమ్నీప్రెజెంట్.  ఎందుకంటే ఫ్యూచర్ కూడా ఈ ప్రెజెంట్లోనే ఇమిడి ఉంది కదా!  మనం వంటచేసుకుంటాం.  ఈరోజు వంట ఇష్టమైన రీతిగా చేసుకుని తింటాం.  రేపు చేసుకోబోయేది కూడా నిర్ణయించుకుని దానికి కావాల్సిన ప్రయత్నాలు చేసి ఉంచుకుంటాం.  అంటే భవిష్య త్తు కూడా ఈ వర్తమానంలోనే నర్తిస్తుంటుందని గమనించాలి. కనుక వర్తమానాన్ని సక్రమంగా ఆచరించాలి. మన ప్రవర్తన , మనం చేసే  పుణ్యకార్యాలూ భవిష్యత్తుకు సోపానా లవుతాయికదా!   అంతేకాదు, మనం ప్రతి రోజూ మన జీవితంలో మానవసేవ, సమాజసేవ, ధర్మ వర్తనం, సత్యమార్గం అనుసరిస్తూ ఉన్నస్థాయి నుండి ఉన్నత స్థాయికి చేరను ప్రయత్నించాలి. ఒక ఉద్యోగి ఎలా ప్రెమోషన్ పొందను శ్రమిస్తాడో అలా మన జీవితాలను పవిత్ర మార్గంలో గడపను ప్రతిక్షణం మనం శ్రమించాలి.

ఎలా అంటే  ఉదాహరణకు ఈత కొట్టేవారు ముందుకు సాగను చేతులతో నీటిని పక్కకు నెట్టుకుంటూ  వెళ్ళినట్లుగా లౌకిక విషయాలనూ, అశాశ్వత సుఖసంతోషాలనూ పక్కకు నెట్టుకుంటూ ముందుకుసాగి ఉన్నత స్థాయిని అందుకోను ప్రయత్నించాలి.  మనం ఉన్నతంగా ఆలోచించి ఉన్నత స్థాయిలో ఉన్నతంగా సమాజసేవ  నిస్వార్ధంగా చేసి పరోపకార పుణ్యాయ అని నిరూపించుకోవాలి.  కొత్త సంవత్సరంలో కొత్త భావాలతో సద్వర్తనతో ఉన్నత స్థితికి వెళ్ళను ఉన్నత భావాలతో వర్తించను ప్రయత్నిద్దాం.  సర్వేజనాః సుఖినోభవంతు.

Follow Us:
Download App:
  • android
  • ios