Asianet News TeluguAsianet News Telugu

ఎదురులేని మనిషి

  • రాష్ట్ర రాజకీయాల్లో ఎదురులేని నేతగా నిలిచిపోవాలని కెసిఆర్ ప్రయత్నాలు
  • కనీసం మరో రెండు దఫాలు అధాకారంలో ఉండేందుకు వ్యూహాలు
  • అధికారం, రాజకీయ రంగాలను శాసిస్తున్న ముఖ్యమంత్రి
  • ప్రతిపక్షాలను నిర్వీర్యం చేస్తున్న సిఎం
  • రాజకీయాలు, సంక్షేమ కార్యక్రమాలకే పెద్ద పీట
  • భవిష్యత్ రాజకీయాల్లో ఏ పార్టీలో కూాడా తనంతట వారు ఉండకూడదన్నదే కెసిఆర్ లక్ష్యం
     
telangana

తెలంగాణా రాజకీయాల్లో ఎదురులేని మనిషిగా నిలిచిపోయేందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పావులు కదుపుతున్నారు. సమకాలీన రాజకీయాల్లోనే కాకుండా భవిష్యత్ రాజకీయాల్లో ఏ పార్టీలో కూడా తనంతటి వారు లేకుండా ఉండేందుకు అవసరమైన అన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాబోయే పదేళ్ళు కూడా తెలంగాణా రాష్ట్ర సమితికి ఎదురన్నదే లేకుండా అవసరమైన వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే ఒకవైపు రాజకీయాలు, మరోవైపు పరిపాలనను కట్టుదిట్టంగా నడుపుతున్నారు. ప్రతిపక్షాల్లో కెసిఆర్ కు ధీటైన నేత ఎక్కడ కూడా లేకపోవటం బాగా కలిసి వస్తోంది. కారణాలేవైనా గాని ప్రతిపక్షాలను నిర్వీర్యం చేస్తే గాని తన పాచిక పారదని గ్రహించిన కెసిఆర్ అందుకు తగ్గట్లే వ్యవహరిస్తున్నారు.

   12 ఏళ్ళ సుదీర్ఘ పోరాటం తర్వాత ప్రత్యేక తెలంగాణ కల సాకారమైంది. దాంతో మొదటి ముఖ్యమంత్రిగా కెసిఆర్ బాధ్యతలు తీసుకున్నారు. అయితే, తెలంగాణా పోరాట యోధునిగా తెలంగాణా ప్రజలు కెసిఆర్ కు పూర్తిస్ధాయిలో అధికారాన్ని కట్టబెట్టలేదు. ఎన్నికలనే పరీక్షలో కెసిఆర్ కు అత్తెసరు మార్కులే వేసారు. వచ్చిన సీట్లతో పూర్తి కాలం అధికారంలో ఉండటం సాధ్యం కాదని గ్రహించారు. అందుకు ప్రతిపక్షాల్లోని ఎంఎల్ఏలను లాక్కోవటమే మార్గంగా గ్రహించారు. దాంతో ఆపరేషన్ ఆకర్ష్ కు తెర లేపారు.  

ముందుగా తెలుగుదేశం పార్టీతో తన ఆపరేషన్ మొదలుపెట్టారు. దాంతో దశల వారీగా నయానో, భయానో శాసనసభ్యులను లొంగదీసుకున్నారు. ఫలితంగా టిడిపి తరపున గెలిచిన 15 మంది శాసనసభ్యుల్లో 12 మంది టిఆర్ఎస్ లో చేరిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ వైపు తన దృష్టిని సారించారు. కాంగ్రెస్ తరపున గెలిచిన 22 మంది సభ్యుల్లో ఆరుమంది ఎంఎల్ఏలు టిఆర్ఎస్ లో చేరారు. మిగిలిన వారిలో అవకశం ఉన్న వారిని కూడా పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారు.

దానికి తోడు ఇటు టిడిపి గానీ అటు కాంగ్రెస్ తరపున గెలిచిన వారిలో కానీ కెసిఆర్ కు ధీటుగా నిలబడి వ్యూహాలు రచించే గట్టి నేతే కరువయ్యారు. దాంతో రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతానికి కెసిఆర్ ఆడిందే ఆట..పాడిందే పాటగా సాగుతోంది. ఒక విధంగా చెప్పాలంటే ప్రతిపక్షాల్లోని అనైక్యతే కెసిఆర్ కు బాగా కలసి వస్తోంది.  ముఖ్యమంత్రి అయిన కొత్తల్లో ప్రతీ దాన్ని వివాదం చేయాలని చూసారు. అయితే, న్యాయస్ధానాల చొరవతో సాధ్యం కాలేదు. అదే విధంగా ఏపి ప్రభుత్వంతో గిల్లి కజ్జాలకు దిగారు. అయితే, వివాదాల వల్ల ఎటువంటి లాభం లేదన్న తత్వం భోదపడటంతో మెల్లిగా తన పంథాను మార్చుకున్నారు.

  ఎప్పుడైతే పంథాను మార్చుకున్నారో పాలనపై దృష్టి పెట్టారు. పరిపాలనలో ఆవేశం పనికిరాదని గ్రహించిన కెసిఆర్ మెల్లిగా పరిపాలనపై పట్టు సాధించారు. ప్రజలకు కావాల్సిందేమిటి ప్రభుత్వం చేయాల్సిందేమిటి అనే విషయాల్లో స్పష్టతను చూపగలిగారు. అందుకనే కాస్త ఆలస్యంగానైనా నిరంతర విద్యుత్, త్రాగు, సాగునీరు, మౌళిక సదుపాయాల కల్పన తదితరాలకు ప్రాధాన్యతను ఇవ్వటం మొదలుపెట్టారు.

అందులో నుండి వచ్చినవే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, పొరుగు రాష్ట్రాలతో విద్యతు ఒప్పందాలు, అందుబాటులో ఉన్న విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తిని పెంచటం, ఐటి పరిశ్రమకు ఊతమివ్వటం, స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహం అందించటం లాంటి వాటితో పాటు పారిశ్రామిక విధానాలు, యూత్, పర్యాటక రంగాలను ప్రోత్సహించటం లాంటివి చేపడుతున్నారు. దాంతో అభివృద్ధిలో తెలాంగాణా ముందుకు పోతోంది. దానికితోడు చెరువుల పునరుద్ధరణ, రహదారుల విస్తరణ, రాజధానికి త్రాగు నీటి సరఫరా కోసం మంజీరా నీటిని తీసుకుని రావటంపై కసరత్తు త్వరలోనే పూర్తిస్ధాయి ఫలితాలు ఇవ్వబోతున్నాయి.

తన పంథాను మార్చుకున్న ఫలితంగానే గడచిన రెండేళ్ళలో జరిగిన ప్రతీ ఎన్నికలోనూ దాదాపు అధికార తెలంగాణా రాష్ట్ర సమితి అభ్యర్ధులనే గెలిపించుగోలిగారు. భవిష్యత్తులో కూడా ఏ ఎన్నిక జరిగినా ప్రత్యర్ధి పార్టీ నుండి గెలుపు గుర్రాలే లేకుండా చేయాలని కెసిఆర్ కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగానే ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసేస్తున్నారు. పోయిన ఎన్నికలైన దగ్గర నుండి కెసిఆర్ ఒక్క భారతీయ జనతా పార్టీ జోలికి మాత్రమే వెళ్ళ లేదంటే అతిశయోక్తి కాదేమో. బహుశా, కేంద్రంలో భాజపా సంపూర్ణ బలంతో అధికారంలో ఉండటమే కారణమేమో.

తన పరిపాలనలో ఎక్కడైనా వైఫల్యాలు ఉన్నా ప్రశ్నించే వీలు లేకుండా మీడియాపై ఉక్కుపాదం మోపటానికి కూడా కెసిఆర్ వెనకాడటం లేదు. ప్రస్తుతం రాష్ట్రం మొత్తం మీద కెసిఆర్ పాలనలోని వైఫల్యాలను ప్రశ్నించే, ఎత్తి చూపే మీడియానే లేదంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. ప్రతిపక్షాల్లోని టిడిపి, భాజపాకు మీడియా మద్దతు ఉండి, కాంగ్రెస్ కు సొంత మీడియా లేక పోవటం పెద్ద ఇబ్బందే.

అదే సమయంలో టిఆర్ఎస్ కు సొంత మీడియాతో పాటు ఇతర మీడియా మద్దతు కూడా సంపూర్ణంగా ఉండటం కెసిఆర్ కు కలసి వస్తోంది. మొత్తం మీద కెసిఆర్ ఆలోచనా విధానాలు ఎలాగున్నాయంటే రేపటి ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో గెలుపుగుర్రాలేవన్నా ఉన్నాయంటే అవన్నీ కూడా టిఆర్ఎస్ తరపున పోటీ చేసేవే  అయివుండాలన్నంత  కసితో వ్యూహాలు రచిస్తున్నారు.  

 

 

Follow Us:
Download App:
  • android
  • ios