ప్రెగ్నెన్సీ టైంలో డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి పోషకాలతో నిండి ఉంటాయి కాబట్టి.. శిశువు మెదడు అభివృద్ధికి అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి. మరి డ్రై ఫ్రూట్స్ ని ఎలా తీసుకుంటే మంచిదో ఇక్కడ చూద్దాం.

ప్రెగ్నెన్సీ చాలా ప్రత్యేకమైంది. ఈ టైంలో ప్రతి తల్లి పుట్టబోయే బిడ్డ కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. మరీ ముఖ్యంగా ఆహారం విషయంలో. ఏది తింటే బిడ్డకు, తనకు మేలు జరుగుతుందని తెలుసుకొని మరీ తింటుంది. నిజం చెప్పాలంటే.. ప్రెగ్నెన్సీ సమయంలో పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది తల్లికీ, బిడ్డకీ మేలు చేస్తుంది. సమతుల్య ఆహారం.. గర్భధారణలో మధుమేహం, ప్రీక్లాంప్సియా, తక్కువ బరువుతో పుట్టడం వంటి సమస్యలను తగ్గిస్తుంది. చాలామందికి ప్రెగ్నెన్సీ టైంలో డ్రై ఫ్రూట్స్ తినచ్చా లేదా అనే సందేహం ఉంటుంది. దానిగురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం.

ప్రెగ్నెన్సీ టైంలో డ్రై ఫ్రూట్స్ తింటే ఏమవుతుంది?

గర్భధారణలో డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల చాలా లాభాలున్నాయి. ఇవి పోషకాలతో నిండి ఉంటాయి కాబట్టి.. శిశువు మెదడు అభివృద్ధికి ముఖ్యమైన ఒమేగా-3, ఒమేగా-6 వంటి ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి.

డ్రై ఫ్రూట్స్ లో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, మెగ్నీషియం, ఫోలేట్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. గర్భధారణలో వచ్చే మలబద్ధకాన్ని నివారిస్తుంది.

గర్భిణులు డ్రై ఫ్రూట్స్ తినడానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం. 

మొదటి త్రైమాసికంలో లేదా గర్భధారణలో ఎప్పుడైనా డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల రక్తస్రావం లేదా గర్భస్రావం జరగదని నిపుణులు చెబుతున్నారు. డ్రై ఫ్రూట్స్ గర్భధారణలో సురక్షితం, ప్రయోజనకరం అని సూచిస్తున్నారు.

బాదం వంటి నట్స్ ని నానబెట్టకుండా తింటే జీర్ణం కావడం కష్టం కాబట్టి రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే తినడం మంచిది.

ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ డ్రై ఫ్రూట్స్ తింటే గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు రావచ్చు. దీనివల్ల కొంచెం అసౌకర్యంగా అనిపించినప్పటికీ.. బిడ్డకు మాత్రం హానికరం కాదని నిపుణులు చెబుతున్నారు. అలాంటి సమస్యలు రాకుండా తక్కువ మోతాదులో తినాలని సూచిస్తున్నారు. ఎండిన పండ్లలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రోజుకి పిడికెడు కంటే తక్కువే తీసుకోవడం మంచిదట. ఉప్పు, చక్కెర కలిపిన వాటికి దూరంగా ఉండటం మరీ మంచిదని నిపుణులు చెబుతున్నారు.