రెండు నెలల సమ్మర్ హాలీడేస్ తర్వాత మళ్లీ స్కూల్ కి వెళ్లాలి అంటే పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు. స్కూల్ కి వెళ్లం అని మారాం చేస్తూ ఉంటారు.

స్కూల్స్ రీఓపెన్ అయ్యాక చాలా మంది పిల్లలు స్కూల్ కి వెళ్ళడానికి బద్దకం చూపిస్తారు. ముఖ్యంగా రెండు నెలల సమ్మర్ హాలీడేస్ తర్వాత మళ్లీ స్కూల్ కి వెళ్లాలి అంటే పిల్లలు ఇష్టం చూపించరు. వెళ్లమని మారాం చేస్తారు. అంతేకాదు, ఉదయాన్నే లేవడానికి బద్దకం చూపిస్తారు. మరి పిల్లల బద్దకం తగ్గించాలి అంటే పేరెంట్స్ ఏం చేయాలో.. నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..

పేరెంట్స్ ని వదిలి ఉండాలంటే భయం, మొబైల్ అడిక్షన్, జనాలతో మాట్లాడాలంటే ఇబ్బంది, ఇతరులతో ఎలా ఉండాలో తెలియకపోవడం, చదువులో ఇబ్బందులు, శ్రద్ధ లేకపోవడం, హైపర్ యాక్టివిటీ, పరిణతి లేకపోవడం వంటి ఇబ్బందుల వల్ల పిల్లలు స్కూల్ కి వెళ్ళడానికి బద్దకం భయం చూపిస్తారు. అందుకే ఈ ప్రాబ్లమ్స్ పెద్దవి అవ్వకముందే సాల్వ్ చేస్తేనే పిల్లల్లో స్కూల్ కి వెళ్ళాలనే బద్దకం తగ్గించి చదువుకోవాలనే ఆలోచన వస్తుంది. 

రెండు నెలల సెలవుల్లో ఫోన్ అడ్డూ అదుపూ లేకుండా వాడినప్పుడు, స్కూల్ కి వెళ్తే ఫోన్ వాడటానికి టైం దొరకదని పిల్లలు మారాం చేస్తారు. అందుకే ఫోన్ వాడకం కంట్రోల్ లో పెట్టండి. 

8 నుంచి 9 గంటల వరకు సరిగ్గా నిద్రపోవాలి. ప్రతి రోజూ రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకు లేదా 10 నుంచి 6 వరకు పిల్లల్ని పడుకోబెట్టండి.

పోషకాలున్న ఆహారం సరిగ్గా టైం కి పిల్లలకి పెట్టాలి. బ్రేక్ ఫాస్ట్ మానేయకూడదు. ఉదయం టిఫిన్ తిన్నాక 15 నిమిషాలైనా పిల్లలతో ఆడుకోండి.

పేరెంట్స్ ని వదిలి ఉండలేకపోతే

కొంతమంది పిల్లలు టెన్షన్ పడతారు. 'స్కూల్ కి తీసుకొచ్చారు, ఎప్పుడు తీసుకెళ్తారు?'..'నన్ను వదిలేసి వెళ్లిపోయారా?. ఇంకా రారా?. ఇలాంటి ఆలోచనల వల్ల వచ్చే ఆందోళన కారణంగా స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక కూడా ఏడుపు, తినడానికి ఇష్టం లేకపోవడం, నిద్రలో ఉలిక్కిపడి ఏడవడం, స్కూల్ కి వెళ్ళనని యూనిఫామ్ వేసుకోకపోవడం వంటివి చేస్తే అది సెపరేషన్ యాంగ్జయిటీ డిజార్డర్ లక్షణాలు. దీన్ని మార్చడానికి 8 ఏళ్ల నుంచి పిల్లల్ని వేరే పడుకోబెట్టాలి. ముందు గ్రాండ్ పేరెంట్స్ తో, తర్వాత ఒక రూమ్ లో ఒంటరిగా పడుకోబెట్టండి. 

తెలియని వాళ్ళతో మాట్లాడాలంటే భయం ఇప్పుడు చాలా మంది పిల్లల్లో ఉంది. ఈ సోషల్ ఫియర్/యాంగ్జయిటీ ని తగ్గించడానికి ఇంటికి వచ్చే వాళ్ళతో మాట్లాడేలా, కలిసి ఉండేలా చూడండి.

ఇలా జనాలతో మాట్లాడే అవకాశాలు కల్పించి పిల్లల్ని అందులో భాగం చేయండి. దీనివల్ల సోషల్ ఇంటరాక్షన్, కమ్యూనికేషన్ స్కిల్స్, లిజనింగ్ స్కిల్స్ పెరుగుతాయి. ఇలా స్కిల్స్ పెరిగితే షైనెస్ తగ్గుతుంది.

చదువులో ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఇలా జరుగుతుంది. అక్షరాలు తిప్పి రాయడం, చదవడానికి, రాయడానికి, లెక్కలు చేయడానికి ఇబ్బంది పడితే ఇవన్నీ సాల్వ్ చేస్తేనే స్కూల్ కి వెళ్ళాలనే బద్దకం పూర్తిగా తగ్గుతుంది. 

మీ పిల్లలు ఇలాంటి ప్రాబ్లమ్స్ చూపిస్తే వాళ్ళని తిట్టి స్కూల్ కి పంపించకండి. అలా చేస్తే ఫలితం ఉండదు. వాళ్ళ మాట వినండి. పిల్లల స్పెషలిస్ట్ అయిన సైకాలజిస్ట్ ని కలవండి. 

ఎందుకు స్కూల్ కి వెళ్ళడానికి ఇష్టపడటం లేదో ఏ ప్రాబ్లమ్ (సెపరేషన్ యాంగ్జయిటీ, సోషల్ ఫియర్, కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్, లెర్నింగ్ ప్రాబ్లమ్స్, ఓవర్ అటాచ్మెంట్, పరిణతి లేకపోవడం) వాళ్ళని ఇబ్బంది పెడుతుందో తెలుసుకోండి. సైకాలజిస్ట్ చెప్పినవి సరిగ్గా పాటిస్తే కొన్ని రోజుల్లోనే పిల్లల ప్రాబ్లమ్స్ సాల్వ్ అయి సంతోషంగా స్కూల్ కి వెళ్తారు.