- Home
- Life
- Pregnancy & Parenting
- Parenting Tips:పిల్లలను తిడితే ఏమౌతుంది? తిట్టకుండానే దారిలో పెట్టేదెలా?
Parenting Tips:పిల్లలను తిడితే ఏమౌతుంది? తిట్టకుండానే దారిలో పెట్టేదెలా?
పిల్లలను క్రమశిక్షణలో పెట్టడం చాలా అవసరం. కానీ, ఆ క్రమశిక్షణలో పెట్టడానికి మనం ఏ దారి ఎంచుకుంటున్నాం అనేది మాత్రం చాలా ముఖ్యం.

పిల్లలను తిట్టకుండా పెంచేదెలా?
ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు అల్లరి చేయడం చాలా కామన్.కానీ, పిల్లలు చేసే అల్లరిని భరించడం చాలా కష్టంగా ఉంటుంది. ఇంట్లో బొమ్మలన్నీ ఎక్కడ పడితే అక్కడ పారేస్తూ ఉంటారు. ఖరీదైన బొమ్మలను విరగకొట్టేస్తూ ఉంటారు. హోం వర్క్ రాయరు. గట్టిగా అరుస్తూ ఉంటారు. ఇలాంటివి రోజూ జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ చూసినప్పుడు పేరెంట్స్ కి కోపం రావడం సహజం. ఆ కోపంతోనే కొట్టడం, తిట్టడం లాంటివి చేసేస్తూ ఉంటారు. కానీ, మనం అనే చిన్న మాట అయినా పిల్లల మనసు చాలా ఎక్కువగా గాయపరుస్తుంది.సంవత్సరం మొత్తం చదివే పాఠాలు వారికి గుర్తు లేకపోయినా.. తల్లిదండ్రులు అనే మాట మాత్రం మనసులోనే ఉండిపోతుంది. మరి, పిల్లలను తిట్టకుండా.. వారిని క్రమ శిక్షణలో పెట్టాలి అంటే ఏం చేయాలి?
క్రమశిక్షణ అవసరం...
పిల్లలను క్రమశిక్షణలో పెట్టడం చాలా అవసరం. కానీ, ఆ క్రమశిక్షణలో పెట్టడానికి మనం ఏ దారి ఎంచుకుంటున్నాం అనేది మాత్రం చాలా ముఖ్యం. పిల్లలు పేరెంట్స్ మీద కోపం, ద్వేషం లాంటివి పెంచుకోకుండా.. ప్రేమగా ఉండాలన్నా, దానికి తోడు మంచి క్రమశిక్షణతో మెలగాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
కోపంగా తిడితే..
కోపం వచ్చినప్పుడు వెంటనే మనం పిల్లలను తిట్టేస్తూ ఉంటాం. కోపంలో గొంతు చాలా గట్టిగా వచ్చేస్తుంది. అలాంటి గట్టి స్వరం విన్నప్పుడు పిల్లలు భయపడతారు. భయంతో స్పందిస్తారు. కానీ, పేరెంట్స్ చెప్పే విషయాన్ని మాత్రం అర్థం చేసుకోరు.అందుకే.. వారిపై కోపం చూపించకుండా, ఓపికగా ఉండటాన్ని అలవాటు చేసుకోవాలి.మరి, పిల్లలు చేసిన తప్పును ఎలా సర్ది చెప్పాలి అని అనుకుంటున్నారా? కొంచెం సేపటి తర్వాత మీకు కోపం తగ్గిన తర్వాత.. పిల్లలను దగ్గరకు తీసుకొని, ప్రేమతో వారు చేసిన తప్పును చూపించాలి. అలా చేయకూడదని, చేయడం వల్ల కలిగే నష్టాలు ఏంటో వివరించాలి. ఒక్కసారిగా పిల్లల్లో మార్పు రాకపోయినా.. నెమ్మదిగా అర్థం చేసుకుంటారు.
పేరెంట్స్ ని చూసి, పిల్లలు నేర్చుకునేది ఇదే..
తల్లిదండ్రులు కోపంగా అరవడం చూస్తే, పిల్లలు కూడా అదే తీరును అనుసరిస్తారు.పేరెంట్స్ ని చూసి వారు కూడా అదే అనుకరించడం మొదలుపెడతారు. అందుకే, ముందుగా మనం అరవకుండా ఉండాలి. పిల్లలకు అర్థమయ్యేలా చిన్న చిన్న కథల రూపంలో వారికి అర్థమయ్యేలా చెప్పాలి. ఏదైనా సమస్య వస్తే ఎలా పరిష్కరించాలో కూడా చెప్పాలి. కథల రూపంలో చెబితే పిల్లలు మంచి నేర్చుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.
భయం పిల్లల శ్రవణ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది
పిల్లలు భయపడినప్పుడు వారి మెదడు ఒక రకమైన మోడ్‌లోకి వెళుతుంది. అప్పుడు వారు మాట్లాడే మాటలను గ్రహించలేరు.కాబట్టి.. అలా కాకుండా వారికి సీక్రెట్ చెబుదామని దగ్గరకు పిలిచి..మీరు చెప్పాలి అనుకునే విషయం చెప్పాలి. ఇలా చేయడం వల్ల పిల్లలు వినడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.
ఆత్మవిశ్వాసం దెబ్బ తీస్తుంది..
పిల్లలు తప్పు చేసినప్పుడు మనం గట్టిగా అరవడం, తిట్టడం లాంటివి చేయడం వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం దెబ్బతీస్తుంది. కాబట్టి, అరవకుండా పిల్లలతో కలిసి కూర్చొని వారు చేసిన తప్పేంటి? ఇంకోసారి ఇలాంటి పరిస్థితి వస్తే, ఏం చేయాలి అనే విషయాలను వివరంగా చెప్పాలి. దీని వల్ల బాధ్యతగా ఉండటం అలవాటు అవుతుంది.
నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది
పేరెంట్స్ ప్రతిదానికీ తిట్టడం, శిక్షలు వేయడం మొదలుపెడితే.. పిల్లలకు నమ్మకం తగ్గుతుంది. తమ మనసులో ఉన్న విషయాన్ని కూడా పేరెంట్స్ కి చెప్పడానికి ఇష్టపడరు. వీలైంత వరకు సానుకూలంగా పిల్లల తప్పులు సరిదిద్దడానికి ప్రయత్నించాలి. దీని వల్ల పిల్లలు చేసిన తప్పును ఒప్పుకుంటారు. వారిపై నమ్మకం కూడా పెరుగుతుంది.