హై కోర్టులో నిన్న ఆర్టీసీపై వాదనలు హాట్ హాట్ గా నడిచాయి. ఉద్దేశ పూర్వకంగా, అస్పష్టంగా, అభూతకల్పనలతో నివేదిక ఇవ్వడం సరికాదంటూ ప్రభుత్వంపై హై కోర్ట్ మండిపడింది.  బ్యూరోక్రాట్స్ వాస్తవాలను మరుగున పెడుతున్నారంటూ ఆరోపించారు. తెలివిగా మాట్లాడి నిజాలను దాస్తున్నారంటూ విమర్శించింది హైకోర్టు.  ఆర్టీసీలో జరుగుతున్న వాస్తవాలను న్యాయస్థానం ముందు అధికారులు నిజాయితీగా అంగీకరించాలని హెచ్చరించింది.  

ఈ వాదనలను బట్టి, నిన్న ఆర్టీసీ జేఏసీ నిర్వహించిన ప్రెస్ మీట్ ఆధారంగా మనకు ఒక విషయం మాత్రం సుస్పష్టం. కోర్టు, ప్రభుత్వం చెప్పిన లెక్కలను పూర్తిగా నమ్మలేదనేది వాస్తవం. ఈ నేపథ్యంలో అసలు లెక్కలు ఏమి చెబుతున్నాయి? అసలు వాస్తవాలు ఏమిటో ఒకసారి చూద్దాం. 

Also read: rtc strike: లెక్కలన్నీ ఉత్తయే.. ప్రభుత్వానికి కోర్టు మెుట్టికాయలు: అశ్వత్థామరెడ్డి 

ఆర్టీసీ నష్టాలపై నిజా నిజాలు... 

కెసిఆర్ గారు తన ప్రెస్ మీట్ లో చెప్పిన విషయం ఏమిటంటే ఆర్టీసీ వల్ల వస్తున్న నష్టం 1200కోట్ల రూపాయలని అన్నారు. ప్రభుత్వ లెక్కలు. ప్రకటించింది స్వయానా ముఖ్యమంత్రి గారు. వీటిని తప్పుబట్టలేము అనుకుందాం. కానీ ఆర్టీసీ యాజమాన్యం అధికారిక లెక్కల ప్రకారం 928కోట్ల రూపాయల నష్టం వస్తుందనేది ప్రభుత్వ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారికి సమర్పించిన నివేదిక. దాదాపుగా 270 కోట్ల వ్యత్యాసమా? 270 కోట్లు అంటే దాదాపుగా 25శాతం ఎక్కువగా కెసిఆర్ గారు చెప్పారు. 

ఈ రెండు లెక్కల్లో ఏది నిజం? పోనీ కెసిఆర్ గారు సమ్మె వల్ల వచ్చిన నష్టం కలిపారు అని అనుకుందాం. బస్సులు తిరగడం ఆగలేదు,మూడింట రెండింతల బస్సులు రోడ్లమీద తిరుగుతున్నాయనేది ప్రభుత్వ వాదన. నిన్న కోర్టులో ప్రభుత్వ తరుపు లాయర్లు కూడా ఇదే విషయం చెప్పారు. కేవలం 25 రోజుల సమ్మెలో అది కూడా 1/3వ వంతు బస్సులు తిరగకపోతేనే ఇంత నష్టమా? ఈ అన్ని లెక్కల్లో నిజం ఏమిటి?

కెసిఆర్ గారు చెప్పిన మరో విషయం ఆర్టీసీకి కిలోమీటర్ కి 13రూపాయల నష్టం వస్తుందని అన్నారు. ఇదే ఆర్టీసీ యాజమాన్యం సమర్పించిన లెక్కల్లో 2018-19 సంవత్సరంలో కిలోమీటర్ కు 7రూపాయల 10 పైసల నష్టం వస్తున్నట్టు పేర్కొన్నారు. జులై 2019 వరకు గనుక చూసుకుంటే నష్టం మరింతగా తగ్గి కేవలం 4రూపాయల 97 పైసల నష్టం మాత్రమే వస్తుంది. ఎక్కడ 13 రూపాయలు ఎక్కడి 5 రూపాయలు. ఇంత వ్యత్యాసమా? ఏది నిజం?

Also read: RTC Strike: కేసీఆర్ కు హైకోర్టు షాక్, సభకు అనుమతి, సమ్మెపై కీలక వ్యాఖ్య 

ఆర్టీసీకి ప్రభుత్వం ఇచ్చిన నిధులు ...వాస్తవాలు

మరో విషయం ఏమిటంటే కెసిఆర్ గారు ఆర్టీసీకి 4250 కోట్లు ప్రభుత్వం తరుఫున ఇచ్చాము. మరో 330 కోట్లు జిహెచ్ఎంసీ తరుఫున గత 5ఏళ్ల కాలంలో ఇచ్చాము, కానీ ఆర్టీసీని వారు నాశనం చేసుకున్నారు అన్నారు. ఆర్టీసీ యాజమాన్యం పువ్వాడ అజయ్ కుమార్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక సెప్టెంబర్ లో సమర్పించిన రిపోర్టులోనేమో ఆర్టీసీపై వచ్చే నష్టం తగ్గింది అని అన్నారు. దీని ప్రకారం గనుక చూసుకుంటే,ఆర్టీసీ సమర్థత పెరిగింది. ఆర్టీసీ నివేదికలో కూడా ఇదే పేర్కొన్నారు. మరి ఆర్టీసీని కార్మికులు ఎట్లా నష్టపరిచారు? వారెలా తమ మాతృ సంస్థను ఆగం జేసుకున్నారు?

ఇదే నిధులకు సంబంధించి ముఖ్యమంత్రి గారు చెప్పిన మరో విషయం ఏమిటంటే, మొత్తంగా 4580కోట్లు(ప్రభుత్వం 4250 కోట్లు+జిహెచ్ఎంసీ ద్వారా 330కోట్లు) ఇచ్చాము అని అన్నారు. వీటిల్లో కెసిఆర్ గారు 'చెప్పని' లెక్కేమిటంటే రీ ఎంబర్సమెంట్ కింద ప్రభుత్వం దాదాపుగా ఆర్టీసీకి 2800 కోట్లు చెల్లించాలి. ఒకవేళ ఈ సంవత్సరం చెల్లింపులు కూడా కలుపుకుంటే అది మరింత పెరుగుతుంది. 3000కోట్లకు పైమాటే అవుతుంది. 

ఈ రాయితీలను ప్రభుత్వం ఉచితార్థంగా ఆర్టీసీకి ఇవ్వడం లేదు. ఆర్టీసీ విద్యార్థులకు ఇచ్చే బస్సు పాసులు, వృద్ధులకు వికలాంగులకు ఇచ్చే రాయితీలు,జర్నలిస్టులకు ఇచ్చే రాయితీలు ఇత్యాదులన్నిటిని కలుపుకొని రీ ఎంబర్సుమెంటులుగా పేర్కొంటాము. ఆర్టీసీ వీరికి రాయితీ ఊరికే ఇవ్వడం లేదు. ఆ రాయితీని ప్రభుత్వం భరిస్తానని హామీ ఇస్తుంది కాబట్టి ఆర్టీసీ ఇలా రాయితీలను ఇస్తుంది. ఆర్టీసీ కూడా ఒక సంస్థే కదా!

Also read: హుజూర్‌నగర్‌కు రూ.100 కోట్లు, ఆర్టీసీకి రూ. 47 కోట్లివ్వలేరా?: హైకోర్టు

బ్యాంకులు రుణాలను మాఫీ చేస్తున్నాయంటే బ్యాంకులు వాటిని వదులుకోవు. ప్రభుత్వం బ్యాంకులకు ఆ సొమ్మును చెల్లిస్తామనే హామీ మీద బ్యాంకులు ఆ రుణాలను మాఫీ చేస్తాయి. ఇలా రుణ మాఫీలు,వడ్డీ లేని రుణాలు ఇస్తే బ్యాంకులు మనలేవు కదా! ఇలా ఆర్టీసీ కి ప్రభుత్వం ఒప్పందం ప్రకారం చెల్లించాల్సినవి తీసేస్తే ప్రభుత్వం ఇచ్చింది మహా అయితే 600 నుంచి 800కోట్ల మధ్య మాత్రమే ఉంటుంది తప్ప అంతకు మించదు. మరి ఇలా కేవలం కొన్ని విషయాలను మాత్రమే బయట పెట్టడం వల్ల పూర్తి ఆర్టీసీ చిత్రం బయటకు రావడం లేదు. 

ఇదే ఆర్టీసీకి ఇచ్చిన నిధులకు సంబంధించిన మరో అంశం ఏమిటంటే, జిహెచ్ఎంసీ ద్వారా 330 కోట్లు ఇచ్చాము అని అన్నారు. ఆర్టీసీకి కేవలం సిటీ బస్సుల నిర్వహణ వల్లనే సంవత్సరానికి 400 కోట్ల నష్టం వస్తుంది. అంటే జిహెచ్ఎంసీ ద్వారా ఇచ్చిన నిధులు ఒక్క సంవత్సరానికి కూడా సరిపోవు. కేవలం ఒక్కసారి ఇచ్చి చేతులు దులుపుకుంటే మిగిలిన అన్ని సంవత్సరాలకు ఎవ్వరు ఇవ్వాలి? 

అద్దె బస్సులు... వాటిలోని మర్మం 

అద్దె బస్సుల గురించి కెసిఆర్ గారు అన్న మాటలు చూసుకుంటే, అద్దెబస్సుల వల్ల కిలోమీటర్ కు 75పైసల లాభం వస్తుంది అని అన్నారు. కార్మికులేమో అద్దె బస్సుల వల్ల 149కోట్ల నష్టం జరిగింది అని అంటున్నారు. ఇక్కడ జాగ్రత్తగా గమనించవలిసిన అంశం ఏమిటంటే, అద్దె బస్సులకు సంబంధించిన ఇన్సూరెన్స్ ఆర్టీసీ భరిస్తుంది,డ్రైవర్లకు ఇచ్చే పిఎఫ్ ఆర్టీసీ భరిస్తుంది, అద్దె బస్సులకు కట్టే పన్నులు ఆర్టీసీ భరిస్తుంది ఈ విషయాలను గనుక పరిగణలోకి తీసుకుంటే, అద్దె బస్సులు లాభం తెచ్చిపెట్టలేవు. 

Also read: కేసీఆర్ అడ్డంగా దొరికిపోయారు... విజయశాంతి కౌంటర్లు

ఒక వేళ ఆర్టీసీ అద్దె బస్సులు లాభం తెచ్చిపెడుతుంటే సాధారణ బస్సులు ఎందుకు తెచ్చిపెట్టలేవు? అద్దె బస్సు రూట్లకు సంబంధించి అగ్రిమెంట్ చేసుకుంటారు. అలాంటి లాభాలొచ్చే రూటలేంటనేది ప్రైవేట్ వ్యక్తులకే తెలిసినప్పుడు ఆర్టీసీ యాజమాన్యానికి తెలియదా? తెలిస్తే వారెందుకు నడపడం లేదు? 

ఆర్టీసీ కార్మికులు పోరాటం చేస్తుంది ఇదే విషయమై కదా! వారు ప్రభుత్వానికి మొరపెట్టుకుంటుందే ఆర్టీసీ బస్సులను పెంచుకుందామని కదా!. మాకు మరో 3000 బస్సులు కావాలి అని అడుగుతున్నారు. ఆర్టీసీలో చాలా బస్సులు 10లక్షల కిలోమీటర్లు ధాటి తిరుగుతున్నాయి. అది ఎంతో ప్రమాదం. మొన్న జరిగిన కొండగట్టు ప్రమాదానికి ఇలా లైఫ్ అయిపోయిన బస్సును తిప్పడమే కదా ప్రధాన కారణం! కెసిఆర్ గారేమో బస్సులను పెంచకుండా ప్రైవేట్ బస్సులను పెంచుతానని అంటున్నారు. ఆర్టీసీ సంస్థను కాపాడాలంటే కావాల్సింది అద్దె బస్సులు కాదు, సుఖవంతమైన,సురక్షితమైన ప్రయాణం అందించే సొంత బస్సులు. 

ప్రభుత్వ సామాజిక బాధ్యత... ఆర్టీసీ నష్టాల భారం 

కెసిఆర్ గారు తన ప్రెస్ మీట్ లో ఎంతసేపటికి కూడా ప్రభుత్వం ఆర్టీసీకి చేసిన చెల్లింపుల గురించే మాట్లాడుతున్నారు కానీ, ఆర్టీసీ ప్రభుత్వానికి చెల్లించే పన్నుల గురించి చెప్పడం లేదు. ఆర్టీసీ డీజిల్ పైన వ్యాట్ కడుతుంది,టైర్లు ఇతర ముడిభాగాలపైన పన్నులు కడుతుంది,రోడ్ టాక్స్ కడుతుంది. ఇవన్నీ రాష్ట్రప్రభుత్వానికి. ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వానికి కూడా పన్నులు కడుతుంది. మొత్తంగా గనుక చూసుకుంటే ఆర్టీసీ 21శాతం పన్నులు కడుతుంది. అంటే ఆర్టీసీ సంపాదించే ప్రతి రూపాయిలో 21పైసలు ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లిస్తుంది.

అవును ఈ చెల్లింపులు ఎవరైనా చేయవలిసిందే. కానీ ప్రభుత్వం తమ సామాజిక బాధ్యతగా బస్సులను నష్టం వచ్చే గ్రామీణ ప్రాంతాల్లో తిప్పమని ఆర్టీసీని ఆదేశిస్తుంది. ఒక అంచనా ప్రకారం ఆర్టీసీ బస్సులు 70శాతం కన్నా ఎక్కువగా నష్టాలొచ్చే రూట్లలోనే తిరుగుతున్నాయి. అక్కడ ప్రైవేట్ బస్సులు తిరగవు. కారణం లాభం రాదు కాబట్టి. 

ఒక సగటు విద్యార్ధి పక్కనున్న పెద్ద ఊరికి వెళ్లి చదువుకోవాలన్నా, ఒక సన్నకారు రైతు తాను పండించిన కూరగాయలను పట్టణంలో అమ్ముకోవాలన్నా ఈ ఆర్టీసీ ప్రగతి రథ చక్రాలే వారికి దిక్కు. ఆర్టీసీకి నడపడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. వారు కోరుతుందేంటంటే కనీసం ఈ నష్టాలొచ్చే రూట్లలోనన్నా పన్నులు రద్దు చేయండి అని అడుగుతున్నారు. ఇదేమన్నా తప్పుడు డిమాండా? ఆర్టీసీ బ్రతికి బట్టకట్ట కూడదా?

Also read: ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం: ఆర్టీసీ బకాయిల నివేదికపై కీలక వ్యాఖ్యలు

ఆర్టీసీ వర్సెస్ ప్రైవేట్ ట్రావెల్స్ 

అన్నిటికంటే ముఖ్యమైన అంశం ప్రైవేట్ ట్రావెల్స్ లాభాలు ఆర్జిస్తుండగా ఆర్టీసీ లాభాలను ఎందుకు ఆర్జించలేకపోతుందనే కెసిఆర్ వాదన. ఇక్కడ చూడాల్సిన అంశం ఏమిటంటే, ప్రైవేట్ ట్రావెల్స్ కేవలం ముఖ్యమైన రూట్లలో మాత్రమే తిరుగుతున్నాయి. ఉదాహరణకు హైదరాబాద్-బెంగళూరు,హైదరాబాద్-విజయవాడ ఇలాంటి రూట్లలో తిరుగుతాయి. అంతే తప్ప ఏదో ఉట్నూరు-ఆదిలాబాద్, భద్రాచలం-ఇల్లందు ఇలాంటి రూట్లలో నడవవు కదా!

ప్రజలు కూడా తమ ప్రయాణాన్ని సురక్షితంగా సాగించాలని కోరుకుంటారు. అలాంటప్పుడు సగటు వ్యక్తి మొదటగా ఆలోచించేది ఆర్టీసీ బస్సు గురించే. అవి లేనప్పుడే ప్రైవేట్ ట్రావెల్స్ వైపు మళ్లుతాడు. ఆర్టీసీ బస్సుల ప్రమాద సంఖ్య ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులతో పోలిస్తే అత్యల్పం. ఇలాంటప్పుడు సగటు ప్రయాణికుడు ఎందుకు రిస్క్ చేసి ప్రైవేట్ బస్సులో ప్రయాణిస్తాడు చెప్పండి? 

దీన్నిబట్టి అర్ధమయ్యే విషయం ఏమిటంటే ఆర్టీసీ బస్సులు ముఖ్యమైన రూట్లలో లాభాలను ఖచ్చితంగా ఆర్జిస్తున్నాయి. మరి నష్టాలూ ఎక్కడొస్తున్నాయంటే గ్రామీణ రూట్లలో, సిటీ బస్సుల నిర్వహణ వల్ల. ఇందాకనుకున్నట్టు ఆర్టీసీ బస్సులు 70శాతానికన్నా ఎక్కువగా నష్టాలొచ్చే రూట్లలోనే తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సామాజిక బాధ్యత కింద బస్సులను తిప్పే ఆర్టీసీని, కేవలం లాభాపేక్షతో కొన్ని ముఖ్య రూట్లలో మాత్రమే బస్సులను తిప్పే ప్రైవేట్ ట్రావెల్స్ ని పోల్చడం మరీ విడ్డూరం. 

మొత్తానికి ప్రభుత్వం నిజాలను కోర్టు ముందు ఒప్పుకోవాల్సిందేనని కోర్ట్ ప్రభుత్వానికి ఖరాఖండీగా తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఎల్లుండి శుక్రవారం రోజున ప్రభుత్వం ఎలాంటి వాదనలు వినిపిస్తుందో వేచి చూద్దాం.