RTC Strike: కేసీఆర్ కు హైకోర్టు షాక్, సభకు అనుమతి, సమ్మెపై కీలక వ్యాఖ్య
ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మంగళవారం నాడు షాకిచ్చింది. ఆర్టీసీ సమ్మెను విరమించాలని తాము ఆదేశించలేమని ప్రభుత్వం తేల్చి చెప్పింది. మంగళవారం నాడు ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ హైకోర్టులో విచారణ నిర్వహించారు.
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు వెంటనే సమ్మెను విరమించాలని తాము ఆదేశించలేమని తెలంగాణ హైకోర్టు మంగళవారం నాడు స్పష్టం చేసింది ఆర్టీసీ సమ్మెపై విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకొంది.
మంగళవారం నాడు ఆర్టీసీ కార్మికుల సమ్మెపై తెలంగాణ హైకోర్టు విచారించింది. ఈ విచారణ సందర్భంగా ఆర్టీసీకి రూ. 1099 కోట్లు బకాయి ఉన్న విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకొంది. ఈ మేరకు హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ ను సమర్పించింది. రాష్ట్ర విభజన సమయంలో ఆస్తులు, అప్పుల పంపకాలు ఇంకా జరగలేదని హైకోర్టు దృష్టికి ప్రభుత్వ తరపు న్యాయవాది దృష్టికి తెచ్చారు.
Also Read:RTC strike: విలీనం పక్కనబెట్టి.. మిగిలిన డిమాండ్లు చూడాలన్న హైకోర్టు
ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల్లో 42 శాతం తెలంగాణ, 58 శాతం ఏపీ చెల్లించాలని ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. అధికారులు సరైన సమాచారం ఇవ్వడం లేదంటూ హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది.
రూ. 47 కోట్లను చెల్లిస్తే ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించేందుకు సిద్దంగా ఉన్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది.ఈ విషయమై ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై హైకోర్టు ప్రశ్నలు కురిపించింది. ఆస్తుల పంపకం ఎందుకు పూర్తి కాలేదని హైకోర్టు ప్రశ్నించింది.
Also read:RTC Strike:విషాదం...మహిళా ఆర్టీసి కండక్టర్ ఆత్మహత్య
బ్యాంకు గ్యారంటీ రూ.850 కోట్లు కడతామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు పైసా ఎందుకు కట్టలేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టీసీలో జరుగుతున్న వాస్తవాలను న్యాయస్థానం ముందు అధికారులు నిజాయితీగా అంగీకరించాలని హెచ్చరించింది.
ఉద్దేశ పూర్వకంగా, అస్పష్టంగా, అభూతకల్పనలతో నివేదిక ఇవ్వడం సరికాదంటూ ప్రభుత్వంపై మండిపడింది.రూ.4,253 అంటూ తప్పుదోవ పట్టిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.850 కోట్లు కేవలం బ్యాంకు గ్యారంటీగా మాత్రమే ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఆర్టీసీకి ప్రభుత్వం 47 కోట్ల రూపాయలు ఇవ్వలేరా అంటూ మరోసారి ప్రశ్నించింది ధర్మాసనం.
ఆస్తులు, అప్పుల పంపకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇంకా పూర్తి చేయలేదని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు వివరించారు. సమ్మె చట్ట విరుద్దమని చెప్పాలని ప్రభుత్వం తరపు న్యాయవాది కోరారు. అయితే తాము అందరి సమస్యలను వినేందుకు ఇక్కడ ఉన్నామని హైకోర్టు స్పష్టం చేసింది. సమ్మె చట్టవిరుద్దమని తాము చెప్పలేమని హైకోర్టు తేల్చి చెప్పింది.
ఆర్టీసీ బకాయిలపై ఎల్లుండి లోపుగా నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆర్టీసీ ఇంచార్జీ ఎండీని ఆదేశించింది. మరో వైపు ఆర్టీసీ కార్మికులు సకల జనుల సమర భేరీ సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేశారు.
ఈ పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు మంగళవారం నాడు సాయంత్రం నాలుగు గంటలకు ఈ విషయమై విచారించింది. ఈ సభకు అనుమతిని ఇస్తూ హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది.