హైదరాబాద్: ఆర్టీసీ బకాయిలపై ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెప్తోందని ఈ విషయాన్ని హైకోర్టు గుర్తించి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి. 

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 25వ రోజు దిగ్విజయంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. 2009 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆర్టీసీకి రూ.1099 కోట్లు ప్రభుత్వం బకాయిలు ఉన్నాయని వాటిని ఇప్పటి వరకు ప్రభుత్వం చెల్లించలేదని స్పష్టం చేశారు. 

ఇకపోతే నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుంచి 2019 వరకు రూ.1375 కోట్లు బకాయిలు ఉన్నాయని అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. బస్సుపాసు సబ్సిడీ రావాల్సి ఉందన్నారు. వాటిని ఇప్పటి వరకు ఆర్టీసీకి అందజేయలేదని చెప్పుకొచ్చారు. 

నూతన మున్సిపాలిటీ చట్టం ద్వారా ప్రభుత్వం నుంచి రూ.1490 కోట్లు రావాల్సి ఉందని చెప్పుకొచ్చారు. దాన్ని వసూలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో  ఉన్నటువంటి బకాయిలపై 42శాతం తెలంగాణ, 58శాతం ఆంధ్రప్రదేశ్ అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా అంటూ మండిపడ్డారు. 

ఇకపోతే ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆర్టీసీకి రూ.49 కోట్లు కూడా ఇవ్వలేరా అని హైకోర్టు ప్రశ్నించిందని తెలిపారు. అసలు ప్రభుత్వానికి ఆర్టీసీపై ఎలాంటి ఒపీనియన్ ఉందో స్పష్టం చేయాలని హైకోర్టు ఆదేశించిందని అశ్వత్థామరెడ్డి తెలిపారు. 

ఆర్టీసీ నుంచి ఎంత సొమ్ము తీసుకున్నారో ఎల్లుండిలోగా నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించినట్లు అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. అనంతరం కోర్టు శుక్రవారానికి విచారణను వాయిదా వేసిననట్లు తెలిపారు అశ్వత్థామరెడ్డి.  

ఇకపోతే సరూర్ నగర్ స్టేడియంలో బుధవారం సకల జనుల సమరభేరి బహిరంగ సభకు హైకోర్టు షరతలుతో కూడిన అనుమతి ఇచ్చిందని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. సభ  మధ్యాహ్నాం 3గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు జరుగుతుందన్నారు. 

ఈ సభకు అన్ని రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నేతలు హాజరై తమను బలపరచాలని కోరారు. ఇకపోతే ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఉద్యోగులు ఎవరూ అధైర్యపడొద్దని అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

RTC Strike: కేసీఆర్ కు హైకోర్టు షాక్, సభకు అనుమతి, సమ్మెపై కీలక వ్యాఖ్య

ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం: ఆర్టీసీ బకాయిల నివేదికపై కీలక వ్యాఖ్యలు