తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు సంబంధించి హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది చేసిన వాదనపై కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి కౌంటర్లు వేశారు. ప్రభుత్వ న్యాయవాది వాదన చూస్తుంటే.. రాబోయే కాలంలో సీఎం కేసీఆర్ ఇచ్చే ఏ హామీ కూడా అమలు కాదని స్పష్టంగా అర్థం అవుతోందని ఆమె అన్నారు.

దీనికి కారణం, తెలంగాణ ప్రభుత్వం వద్ద కనీసం 47 కోట్ల రూపాయల నిధులు కూడా లేవని ప్రభుత్వ తరఫు న్యాయవాది చెప్పడమేనని రాములమ్మ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. వారికి కనీసం జీతాలు కూడా చెల్లించలేదు. దానికి తగిన నిధులు లేవంటూ ప్రభుత్వం పేర్కొనడం గమనార్హం.

దీనిపై... హైకోర్టు కూడా మండిపడింది. ఆర్టీసీ కార్మికుల సమస్యలు తీర్చడానికి 47 కోట్ల రూపాయలు లేనప్పుడు హుజూర్‌నగర్‌లో 100 కోట్ల రూపాయల ఖర్చుతో అభివృద్ధి పథకాలు అమలుచేస్తానని కేసీఆర్ ఎలా ప్రకటించారని కోర్టు నిలదీసిన సంగతిని విజయశాంతి గుర్తు చేశారు. 

కోర్టు వేసిన ప్రశ్నతో కేసీఆర్ అడ్డంగా దొరికిపోయారంటూ... కోర్టు వేసిన ప్రశ్నకు సమాధానంగా హుజూర్‌నగర్‌లో వంద కోట్ల రూపాయల అభివృద్ధి పథకాలు అమలు చేయడానికి ప్రభుత్వం వద్ద తగిన నిధులు ఉన్నాయని అంగీకరించడం లేదా కేవలం ఉత్తుత్తి హామీలు ఇచ్చానని చేతులెత్తేయడం ఈ రెండిటిలో ఏదో ఒకటి చేయడమే మిగిలిందన్నారు.

AlsoRead హుజూర్‌నగర్‌కు రూ.100 కోట్లు, ఆర్టీసీకి రూ. 47 కోట్లివ్వలేరా?: హైకోర్టు...
 
ఒకవేళ హుజూర్‌నగర్ అభివృద్ధికి వంద కోట్ల రూపాయలు కేటాయిస్తే అప్పుడు ఆర్టీసీ కార్మికులకు కూడా 47 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వస్తుందని విజయశాంతి స్పష్టం చేశారు. 

ఈ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి, తన పంతాన్ని నెగ్గించుకునేందుకు కేసీఆర్ ఆ వంద కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు ఇవ్వకుండా హుజూర్‌నగర్ ఓటర్లకు మొండిచేయి చూపిస్తారని అర్థమవుతోందన్నారు. ఇప్పటి వరకు తాను అపర చాణుక్యుడినని భావిస్తూ వచ్చిన కేసీఆర్.. ఇప్పుడు కోర్టు వేసిన గూగ్లితో ఆయన బండారం బయటపడిందన్నారు.