Asianet News TeluguAsianet News Telugu

హుజూర్‌నగర్‌కు రూ.100 కోట్లు, ఆర్టీసీకి రూ. 47 కోట్లివ్వలేరా?: హైకోర్టు

ఆర్టీసీ సమ్మె విషయమై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును హైకోర్టు తప్పు బట్టింది. ఆర్టీసీకి రూ. 47 కోట్లు కేటాయించలేరా అని ప్రశ్నించింది.

HC calls Telangana response on RTC financial jugglery
Author
Hyderabad, First Published Oct 30, 2019, 7:56 AM IST

హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు మంగళవారం నాడు కేసీఆర్ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేసింది. సంక్షేమ కార్యక్రమాలకు, ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో వంద కోట్లు నిధులు ఖర్చు చేయడాన్ని ప్రస్తావించింది. వందల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమ్మె పరిష్కారం కోసం రూ. 47 కోట్లు ఇవ్వలేమని చెప్పడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ హైకోర్టులో మంగళవారం నాడు మధ్యాహ్నం విచారణ జరిపింది.ఈ సందర్భంగా హైకోర్టు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిపాలనాపరమైన అంశాల్లో మేం జోక్యం చేసుకోలేం. 

కానీ, ఉప ఎన్నికలు ఉన్న ఒక ప్రాంతంలోనో.. మరోచోటో సంక్షేమ కార్యక్రమాలకు వందల కోట్ల రూపాయల కేటాయింపులకు ఆర్థిక శాఖ నిధులను మంజూరు చేస్తోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె పరిష్కారం కోసం రూ. 47 కోట్లు ఇవ్వలేమని చెప్పడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ నెల 26వ తేదీన హుజూర్ నగర్ లో నిర్వహించిన టీఆర్ఎస్ విజయోత్సవ సభలో కేసీఆర్ రూ. 100 కోట్ల విలువైన హామీలిచ్చిన విషయం తెలిసిందే.

ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వం తీరుతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సమ్మెను కార్మికుల కోణంలో కాకుండా రాష్ట్ర ప్రజల కోణంలో చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు సూచించింది. 

 రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్ పై కూడ హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.తాము కోరిన అంశాలు అఫిడవిట్ లో లేవని హైకోర్టు అభిప్రాయపడింది. వాస్తవాలతో కూడిన నివేదికను రెండు రోజుల్లో సమర్పించాలని హైకోర్టు ఆర్టీసీ ఇంఛార్జీ ఎండీని ఆదేశించింది.


ఆర్టీసీకి జీహెచ్‌ఎంసీ నుంచి రావాల్సిన బకాయిలు రూ.1492.70 కోట్లు, బస్‌పాస్ ల రాయితీ రూ.784.40 కోట్లు, ఉమ్మడి రాష్ట్రంలో రావాల్సిన రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.1099 కోట్లు.. మొత్తంగా రూ.3,966 కోట్లు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని కార్మిక సంఘాల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆయన చెప్పిన గణాంకాలను సరిపోల్చుకుని నివేదిక ఇవ్వాలని ఆర్టీసీ ఎండీని హైకోర్టు ఆదేశించింది.

ఆర్టీసీ కార్మికుల నాలుగు ప్రధాన డిమాండ్ల పరిష్కారానికి రూ.47 కోట్లపైనా ప్రశ్నించాం. కానీ, ఈ రెండు అంశాల్లో వేటిపైనా సూటిగా స్పందించలేదు. కౌంటర్‌ వేయడంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి తెలివితేటలు ప్రదర్శించారని హైకోర్టు ఆక్షేపించింది.

Also Read:RTC Strike: కేసీఆర్ కు హైకోర్టు షాక్, సభకు అనుమతి, సమ్మెపై కీలక వ్యాఖ్య

ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు ఎన్ని!? అప్పులు ఎన్ని? జీహెచ్‌ఎంసీ నుంచి రావాల్సిన బకాయిల్లో రూ.335 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. వాస్తవంగా ఏ మేరకు రావాలి!? సమ్మె కాలంలో అక్టోబరు 5 నుంచి 30 వరకు ఆర్టీసీకి సమకూరిన ఆదాయం ఎంత? తదితర వివరాలను ఈనెల 31వ తేదీలోగా కోర్టు ముందు ఉంచాలని హైకోర్టు ఆదేవాలు జారీ చేసింది.

Also Read:ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం: ఆర్టీసీ బకాయిల నివేదికపై కీలక వ్యాఖ్యలు

తదుపరి విచారణకు ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ, ఆర్థిక లావాదేవీలు నిర్వహించే మరో అధికారి కోర్టు ముందు హాజరు కావాలని నిర్దేశించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ ఎ.అభినంద్‌ కుమార్‌ షావిలితో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios