హుజూర్ నగర్: తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి స్థానీయతపై చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. టీఆర్ఎస్ ఆంధ్ర వ్యక్తికి టికెట్ ఇచ్చిందని ఆయన అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సైదిరెడ్డి స్థానీయతను ఎందుకు తెర మీదికి తెచ్చారనే సందేహం వ్యక్తమవుతోంది.

సాధారణ ఎన్నికల్లో నిజానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానీయత టీఆర్ఎస్ కు ప్రచారాస్త్రంగా మారింది. స్థానిక నాయకుడు సైదిరెడ్డి అనే నినాదం ఎన్నికల్లో ప్రజల్లోకి చొచ్చుకుని వెళ్లింది. అది కొంత మేర ఉత్తమ్ కుమార్ రెడ్డిని చిక్కుల్లో పడేసింది కూడా. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానికుడు కాదని, ప్రజలకు అందుబాటులో ఉండరని టీఆర్ఎస్ విమర్శిస్తూ వచ్చింది. 

తన స్థానీయతను ఎన్నికల ప్రచారాస్త్రంగా టీఆర్ఎస్ మార్చిన నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి సైదిరెడ్డిని ఆంధ్ర వ్యక్తిగా చెబుతూ స్థానికతాంశాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేశారని అంటున్నారు. అయితే, అది ఉత్తమ్ కుమార్ రెడ్డికే ఎదురు తిరిగే పరిస్థితి వచ్చింది. 

హుజూర్ నగర్ కాంగ్రెసు అభ్యర్థి ఇప్పటి వరకు ఖరారు కానప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పోటీ చేస్తారనేది బలంగా వినిపిస్తున్న మాట. ఈ నేపథ్యంలో హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఉత్తమ్ కుమార్ రెడ్డికి బలమైన సవాల్ నే విసురుతోంది. దాంతో శానంపూడి సైదిరెడ్డి స్థానికతను వివాదం చేయాలని ఆయన చూశారని అంటున్నారు. 

సైదిరెడ్డి సూర్యాపేట జిల్లా గుండ్లపల్లి గ్రామానికి చెందినవారు. ఆ గ్రామం కృష్ణానది ఒడ్డున తెలంగాణ రాష్ట్రంలో ఉంది. సైదిరెడ్డి తండ్రి అంకిరెడ్డి ఆ గ్రామ సర్పంచుగా పనిచేశారు. పైగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో సైదిరెడ్డి బంధువర్గం గణనీయంగా విజయం సాధించింది. స్థానిక సంస్థల బలిమితో సైదిరెడ్డి సాధారణ ఎన్నికల్లో కన్నా ఈ ఎన్నికల్లో కాంగ్రెసుకు బలమైన పోటీ ఇచ్చే స్థాయికి చేరారు. 

అందుకే, ఉత్తమ్ కుమార్ రెడ్డి సైదిరెడ్డి స్థానీయతపై నిస్పృహతో ప్రకటన చేశారని టీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు. మంత్రి జగదీష్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కాలంలో హుజూర్ నగర్ నుంచి పోటీ చేశారు. ఆయనకు కూడా ఆ నియోజకవర్గంలో సొంత బలం ఉంది. ఈసారి ఎన్నికల్లో జగదీష్ రెడ్డి తన శక్తియుక్తులను అన్నింటినీ వినియోగించే అవకాశం ఉంది. పోటీ మాత్రం హోరాహోరీగానే ఉంటుందని భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

హుజూర్‌నగర్ బైపోల్: సీపీఐ, జనసేన మద్దతుకు ఉత్తమ్ ప్రయత్నాలు

శానంపూడి సైదిరెడ్డి ఆంధ్రవాడా: ఉత్తమ్ కుమార్ రెడ్డి భాష్యం అదే

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: జానా రెడ్డి కొడుక్కి బీజేపీ గాలం

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డే

హుజుర్ నగర్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల : అక్టోబర్ 21న పోలింగ్

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: మళ్లీ తెర మీదికి కాసోజు శంకరమ్మ

జగదీష్ రెడ్డి వ్యాఖ్య: రేవంత్ రెడ్డితో మాట్లాడించింది ఉత్తమ్ కుమార్ రెడ్డే

హుజూర్ నగర్ అభ్యర్థి: అన్న మాటను కాదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

ఈ మధ్యే వచ్చినోళ్ల సలహాలు అక్కర్లేదు: రేవంత్‌పై కోమటిరెడ్డి వ్యాఖ్యలు

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: కాంగ్రెసు అభ్యర్థి పద్మావతి, ఉత్తమ్ ప్రకటన

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: ఉత్తమ్ పద్మావతికి రేవంత్ రెడ్డి నిరసన సెగ