Asianet News TeluguAsianet News Telugu

రంగుల హంగులు పొంగించిన చిత్రకారుడు.. డాక్టర్ కొండపల్లి శేషగిరిరావు

భారతీయ చిత్ర కళకు ఊపిరినిచ్చిన ప్రఖ్యాత చిత్రకారులు  డాక్టర్ కొండపల్లి శేషగిరిరావు జయంతిని పురస్కరించుకొని వారిని స్మరిస్తూ డాక్టర్ కొండపల్లి నీహారిణి రాసిన వ్యాసం ఇక్కడ చదవండి :

Famous Painters Dr. Kondapalli Seshagiri Rao Jayanthi Obituary - bsb
Author
First Published Jan 27, 2023, 2:20 PM IST

కళ్ళూ, మనస్సూ ఒక్క చోట లగ్నం అయ్యాయంటే ఖచ్చితంగా అక్కడ అందమైన వర్ణ చిత్రం ఉండి ఉంటుంది అనుకోవచ్చు. మనసును కట్టిపడేసే మాట ఏదైనా వినిపించిందంటే అక్కడ సంగీతం ప్రవహిస్తుందనుకోవచ్చు.  కఠిన శిలలను కళ్ళార్పకుండా చూస్తున్నాం అంటే అక్కడ శిల్పం ఏదో వెలసి ఉండవచ్చు. గుండెల్లోని బడబాగ్ని అక్షరాల్లో చూసాము అంటే అక్కడ సాహిత్యం ప్రజ్వరిల్లిందనుకోవచ్చు.  ఆనందంతో ఉప్పొంగి అవయవాలు కదులుతున్నాయి అంటే నాట్యం తాండవిస్తుంది అనుకోవచ్చు. ఈ లలిత కళలను మనం ఎలా ఆస్వాదిస్తున్నామో ఎలా నలుగురికి పంచుతున్నామో అలాగే నిక్షిప్తం చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనకే ఉంటుంది.  

కళలలో అంతర్లీనంగా దాగి ఉండేదంతా ఆయా దేశాల సంస్కృతి సంప్రదాయ విలువలు, చరిత్రలే !  కాలం శరవేగంగా కదులుతూ ఉంటుంది.  దశాబ్దాలను, శతాబ్దాలను తనలో సంలీనం చేసుకుంటూ ఉంటుంది.  ఈ శతాబ్దంలో చిత్రకళా రంగంలో తనదైన  మంచి పేరును సాధించుకున్న చిత్రకారుల్లో డాక్టర్ కొండపల్లి శేషగిరి రావు  ప్రథములు.   వీరి చిత్రకళా జీవన ప్రస్థానాన్ని రేఖామాత్రంగా స్పృశించుకోవడం మన బాధ్యత. 1924 జనవరి 27న కొండపల్లి శేషగిరి రావు ఉమ్మడి వరంగల్ జిల్లా మానుకోట దగ్గర ఉన్న పెనుగొండ గ్రామంలో జన్మించారు.  చిన్ననాటి నుంచి ప్రకృతి దృశ్యాలను చూస్తే రంగులలో బంధించేవారు అని వీరి జీవిత చరిత్రను చూస్తే తెలుస్తుంది.  

Famous Painters Dr. Kondapalli Seshagiri Rao Jayanthi Obituary - bsb 
విద్యార్థి దశలో మానుకోట, నూనూగు మీసాల నూతన యవ్వనపు తొలి అడుగులలో హనుమకొండ గడ్డ మీద కాలు పెట్టారు ఈ వరంగల్  ముద్దుబిడ్డ.  పాకాల అడవి దృశ్యాలు, వేయి స్తంభాల గుడి శిల్ప సంపద శేషగిరిరావును కట్టిపడేసింది, నలుపు తెలుపు వర్ణాల నుండి సప్తవర్ణ సోయగాల వరకు ఆయనను చిత్రకారునిగా లోకానికి పరిచయం చేసినవి ఆయన దించిన బొమ్మలు. ఈ అడుగులు ఇంకా మెరుగు పరుచుకోవడానికని హైదరాబాద్ కు పనమయ్యాయి. ఇక ఆయన వెనుతిరిగిందే లేదు. మునుముందుకే అంతా! సత్ సంకల్పానికి , దృఢ నిశ్చయానికి,  శ్రమ తత్వానికి సభ్య సమాజం ఎప్పుడూ తోడుగా ఉంటుంది అనడానికి శేషగిరిరావు  జీవితమే నిదర్శనం. 

వట్టికోట ఆళ్వారు స్వామి,  పెండ్యాల రాఘవరావు, మందుముల నరసింగరావు వంటి పెద్దల ప్రోద్బలం, మెహదీ నవాజ్ జంగ్ సహాయ సహకారాలు హైదరాబాద్ ఆర్ట్స్ కళాశాల విద్యార్థిగా ఎదిగేందుకు తోడయ్యాయి.  ఐదేళ్ల శిక్షణ అనంతరం పట్టాపుచ్చుకున్న ఈ చిత్రకారుణ్ణి  ప్రశంసా పత్రాలు, అవార్డులు వరించాయి. శేషగిరిరావు చిత్రకళా నైపుణ్యానికి, శ్రద్ధాసక్తులకు, కృషితత్వానికి ముగ్ధులైన సౌజన్య శీలి మెహదీ నవాజ్ జంగ్  వీరిని కలకత్తాలోని విశ్వభారతి శాంతినికేతన్ కు పంపించారు.  ఈ అవకాశం తన రంగంలో ఉన్నత శిఖరాలకు చేరేందుకు  మార్గాలయ్యాయి.  శాంతినికేతన్ లో నందాలాల్ బోసు  శిక్షణలో తమ కళకు మెరుగులు దిద్దుకున్నారు. 

అక్కడి దేశ విదేశీ చిత్రకారుల పరిచయాలు శేషగిరి రావులో ఉన్న భారతీయ చిత్రకారునికి ప్రపంచాన్ని చూపించాయి.  ప్రముఖంగా తమ మాతృభాష తెలుగు, చదువుకున్న ఉర్దూ , నేర్చుకున్న సంస్కృతం, హిందీ భాషలతో పాటు ఇంగ్లీష్ భాష  కూడా వీరిలో దాగి ఉన్న కవి, రచయితకు ఆలంబనలయ్యాయి.  విస్తృతమైన పుస్తక పఠనం అలవడింది.  ఇండియన్ ఆర్ట్, చైనీస్ ఆర్ట్, జపనీస్ ఆర్ట్ లో నైపుణ్యాన్ని సాధించుకున్నారు.  మద్రాస్, భువనేశ్వర్ వంటి ప్రదేశాలకు వెళ్లి అక్కడ చిత్ర శిల్ప కళా రంగాలపై పరిశోధన చేసి పరిపూర్ణత సాధించుకొని హైదరాబాద్ కు తిరిగి వచ్చారు.

Famous Painters Dr. Kondapalli Seshagiri Rao Jayanthi Obituary - bsb

తాము చదువుకున్న కళాశాలలోనే చిత్రకళా అధ్యాపకునిగా చేరి, అంచలంచెలుగా ఎదిగారు. వందలాది విద్యార్థుల అభిమానంతో పాటు, తోటి చిత్రకళా ఉపాధ్యాయులతో స్నేహాన్ని సాధించుకున్నారు. చిత్రకళా రంగంలో ఉన్న వివిధ పద్ధతుల్లోని మెళకువలు తాము నిరంతరం అభ్యాసం చేయడంతోపాటు ఎంతో శ్రద్ధ గా  విద్యార్థులకు నేర్పించేవారని శేషగిరిరావు  విద్యార్థులు, ప్రస్తుత ప్రముఖ చిత్రకారుల అభిప్రాయాలను  యూట్యూబ్ లో ఉన్న డాక్యుమెంటరీలో చూడవచ్చు. ప్రముఖ చిత్రకారులైన కాపు రాజయ్య , జగదీష్ మిట్టల్, పి. ఆర్ .రాజు  వంటి సమకాలీన చిత్రకారులూ, వీరి మిత్రులు మాట్లాడినవన్నీ ఈ డాక్యుమెంట్ లో ఉన్నాయి.  

బి. నరసింగరావు , వాణి దేవి, లక్ష్మా గౌడ్, సుభాష్ బాబు, దాతార్, కవితా దేవస్కర్ వంటి గొప్ప చిత్రకారులందరూ శేషగిరి రావు  విద్యార్థులుగా తమ వినమ్రతను ప్రకటించుకున్న భావాలన్నీ ఈ డాక్యుమెంటులో  ఉన్నాయి.  ప్రఖ్యాత కవులైన  బిరుదురాజు రామరాజు , డా. సి. నారాయణ రెడ్డి , రాళ్ళబండి  కవితా ప్రసాద్ , పెండ్యాల వరవరరావు ,  నెల్లుట్ల  వేణుగోపాల్ ,  శివాజీ వంటివారు ఈ చిత్రకళ తపస్విని గురించి వ్యక్తపరిచిన అభిప్రాయాలు తెలుసుకోవచ్చు.  దెందుకూరు సోమేశ్వరరావు, బూర్గుల నరసింగరావు వంటి చరిత్రకారులు శేషగిరిరావు  ఉన్నతమైన పరిశీలన తత్వాన్ని విశ్లేషించింది వినవచ్చు.   

ఫైనాన్స్ కాలేజీలో తమ కొలీగ్ గా కొండపల్లి శేష రావు  గురించి ఆప్యాయంగా మాట్లాడిన రిటైర్ ప్రొఫెసర్ పీ.ఏ .కట్టి, ఆర్టిస్ట్ మోహన్ విశ్లేషణ చూడొచ్చు.  ఈ డాక్యుమెంట్ శేషగిరిరావు చిత్రాలనూ చూపించడంతో పాటు వారి వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తుంది. చక్కని స్క్రిప్ట్ తో వినసొంపైన గళంలో ఉన్న ఈ ఫిల్మ్ ను టీవికి కనెక్ట్ చేసి నిశ్శబ్ద , ప్రశాంత వాతావరణంలో పెద్ద స్క్రీన్ మీద చూస్తే ఆ ఆనందమే వేరు! రేఖాచిత్రాలు, వర్ణ చిత్రాలు రెండూ శేషగిరి రావు  సవ్యసాచిత్వానికి అద్దం పడుతున్నాయి. రామాయణ భారత భాగవత పురాణేతిహాసాల చిత్రాలతోనూ, చారిత్రక సాంస్కృతిక చిత్రాలతోనూ మన భారతదేశం అంటే ఇదీ  అని మనకు చిరస్థాయిని కల్పించారు శేషగిరిరావు.  

శకుంతల, వరూధిని, దమయంతి చిత్రాలు ఒక ఎత్తయితే, అశోక వనంలో సీత, పూమాలాలంకృతై బావి నీటిలో తన రూపును  తిలకిస్తున్న గోదా దేవి ఇలా ఏ చిత్రమైనా దేనికదే సాటి. రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి రాణుల చిత్రాలైనా కలవకొలను లచ్చి , జానపద స్త్రీ, గిరిజన స్త్రీ చిత్రాలనైనా అద్భుతంగా చిత్రించిన శేషగిరిరావు  శైలి చూపరులను ఆకర్షిస్తుంది.  కవుల, చరిత్ర పురుషుల చిత్రాలైనా , కోయదొర గుహుడైనా, కోతులను ఆడించే మదారి చిత్రమైనా చూపు తిప్పనీయవు.   స్వాతంత్ర్య పోరాటాల చిత్రాలు చరిత్ర ఉన్నంతకాలం నిలిచిపోతాయి.

Famous Painters Dr. Kondapalli Seshagiri Rao Jayanthi Obituary - bsb

జంతువులు, పక్షులు, రాళ్లు, సకల ప్రకృతి సంపదలు అన్నీ శేషగిరిరావు   చిత్రాలలో మనసుకు ఆహ్లాదాన్ని పంచుతాయి.  ప్రపంచీకరణ భూతం కబళించక ముందటి ఒకప్పటి మన హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే  కొండలు , గుట్టలు ఇప్పుడు మనకు లభించేది కేవలం శేషగిరిరావు  వేసిన  చిత్రాలలోనే అనడం అతిశయోక్తి కాదేమో!

" సేవ్ రాక్స్" అనే టైటిల్ తో శేషగిరి రావు  వేసిన వందల రాళ్ల చిత్రాలు మనకు ఇప్పుడు చిత్రనిధులు. అంతరించిపోతున్న అద్భుత జానపద కళ 'కాకి పడగలు' పట చిత్రాలను వెలుగులోకి తెచ్చి , తెలుగు విశ్వవిద్యాలయంలో పత్ర సమర్పణ చేసి, పెద్దలందరికీ పరిచయం చేసి, లోకానికి చాటి,అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకువచ్చిన కొండపల్లి శేషగిరి రావును జాతి ఎన్నటికీ మరవకూడదు. తెలంగాణలోని పల్లెటూర్లన్నీ ఊరూరా తిరిగి శేషగిరిరావు  ఎన్నో ముగ్గులను సేకరించారు. 'ముగ్గులు 'కళా జగత్తులో వెలసిన ఆశ్చర్యాలు!!  స్త్రీల మునివేళ్ళ కళాత్మక చిహ్నాలుగా ముగ్గులు ప్రపంచ ఖ్యాతి ని ఆర్జించాయి. ముగ్గుల చరిత్రను, ముగ్గులలోని విశేషాలను శాస్త్రీయంగా  రచించారు శేషగిరి రావు.  అముద్రితమైన  ఈ గ్రంథం ముద్రణలోకి రావాల్సి ఉంది.

మనం నంది విగ్రహాలు చూస్తాం.  వీరు నంది శిల్పం పై చెక్కిన నగల తీరుతెన్నులు చూస్తారు, శిల్పి నిపుణత్వాన్ని వివరిస్తారు. గుళ్ళు, తాళ్ళ ముళ్ళు , మృణ్మయ పాత్రలూ మానవ జీవితంలో అల్లుకుపోయిన విధి విధానాలలోని కళాత్మక చైతన్యాన్ని చూస్తారు, రాస్తారు. ఆశ్చర్యం కలిగిస్తుంది శేషగిరిరావు  రచనా శైలి! భాషపై పట్టు, సంస్కృతి పై మక్కువ జాతికి ఏదైనా మేలు చేయాలనే తపన కలగలిసిన వ్యాసాల గుచ్ఛమే వీరి ' చిత్ర శిల్పకళా రామణీయకం' పుస్తకం.  ఈ గ్రంథంలో కళా విషయైక వ్యాసాలతోపాటు సమకాలీన చిత్రకారుల, రాజకీయ నాయకుల వ్యక్తిత్వాలను పరిచయం చేసే వ్యాసాలూ పాఠకులకు విశేష జ్ఞానాన్ని ఇస్తాయి.

" కళలు వెర్రి తలలు వేయవద్దు" అని చెప్పిన వీరి నిజాయితీనీ, చిత్రకళ పట్ల వీరి కున్న మక్కువను, వీరు చేసిన సేవను , కుటుంబ వ్యవస్థ పైన వీరికున్న గౌరవమూ, సమాజం పట్ల వీరు నిర్వర్తించిన బాధ్యతనూ,  వీరి నిలువెత్తు జీవితాన్ని ' చిత్రకళా తపస్వి డాక్టర్ కొండపల్లి శేషగిరిరావు గారి జీవిత చరిత్ర ' లో చదవవచ్చు.  చిత్ర కళ లో శేషగిరిరావు  ప్రతిభకు డాక్టరేట్ ఇచ్చినట్టే, ఈ జీవిత చరిత్రకు  కూడా  తెలుగు విశ్వవిద్యాలయం జీవిత చరిత్ర విభాగంలో కీర్తి పురస్కారం ఇచ్చి గౌరవించింది.

శేషగిరిరావు  2012 జులై 26 న ఈ లోకాన్ని వదిలి వెళ్ళిన సందర్భంలో అన్ని తెలుగు , ఇంగ్లీష్ దిన పత్రిక లు వీరికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ప్రత్యేకంగా సంపాదకీయాలు వ్రాసాయి.  ఈ చిత్రకళా యశస్వి కళా నైపుణ్యం అంతా వర్ణ చిత్రాలుగా, రేఖా చిత్రాలుగా  వీరి కుమారుడైన కొండపల్లి వేణుగోపాల్ రావు స్వగృహంలో  ( హైదరాబాద్ ) ' కొండపల్లి శేషగిరిరావు ఆర్ట్ గ్యాలరీ '   లో సందర్శనకు వీలుగా ఉన్నాయి.    శేషగిరి రావు  ప్రొఫెసర్ గా పనిచేసిన కాలేజ్ ఆఫ్ ఫైనార్ట్స్ , జె.ఎన్ .టి.యు కళాశాలలో చిత్రకళా విభాగంలో అకెడమిక్ లో ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్న విద్యార్థికి  ' స్టుడెంట్ ఎక్స్ లెన్సీ అవార్డ్ ' ను  కొండపల్లి శేషగిరి రావు  పేరు మీద వీరి కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం నగదు బహుమతిగా అందజేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios