ముంబై: అమెరికాతో పోలిస్తే కెనడా, బ్రిటన్‌లపై భారత్‌ సహా ప్రపంచ దేశాల ఉద్యోగార్థులు ఆసక్తి కనబరుస్తున్నారని అంతర్జాతీయ ఉద్యోగ వెబ్‌సైట్‌ ఇండీడ్‌ తన నివేదికలో పేర్కొంది. వలసలపై అమెరికా విధిస్తున్న కఠిన నియంత్రణల వల్ల ఉద్యోగాల కోసం వెతికే విషయంలో అమెరికాపై ఆసక్తి తగ్గిందని సంస్థ పేర్కొంది.

కెనడాలో వలస (ఇమిగ్రేషన్‌) విధానాలు ఆహ్వానించదగ్గ రీతిలో ఉండటం; బ్రిటన్‌ ఇమిగ్రేషన్‌ విధానాల్లోనూ ఇటీవలి సానుకూల పరిణామాలు.. ప్రపంచ దేశాల ఉద్యోగార్థులను అటు వైపునకు అడుగు వేసేలా చేస్తున్నాయి. కెనడా అనుసరిస్తున్న స్వేచ్ఛా వలసల విధానం వల్ల భారతీయులు, లాటిన్‌ దేశాల నుంచి వచ్చే ఉద్యోగార్థులకు మంచి ప్రత్యామ్నాయంగా మారిందని ఆ నివేదిక తెలిపింది.

సాంకేతికత, పరిశోధన, ఫైనాన్స్‌ వంటి అధిక వేతన విభాగాలపై ఉద్యోగార్థులు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారని ఇండీడ్ పేర్కొంది. అమెరికాకు వెళ్లాలని అత్యంత నైపుణ్యం గల భారతీయులు కలలు కంటుంటారని, ఇప్పటి కఠిన వలసల విధానాల ప్రభావంతో కెనడా, బ్రిటన్‌లవైపు మొగ్గు చూపుతున్నారని తెలిపింది.

ఈ ధోరణి 2017 మధ్యలోనే ప్రారంభమైనా ఆ ఏడాది చివర్లో ఉన్నట్లుండి బాగా పెరిగింది. హెచ్‌1-బీ కొత్త నిబంధనలు వెలుగులోకి వచ్చింది ఆ సమయంలోనే. దీంతో వీసా దరఖాస్తులు, ప్రక్రియ ఆలస్యం అవుతుండడంతో తమ ఉద్యోగ జీవితాలను ప్రారంభించడానికి భారతీయ నిపుణులు ప్రత్యామ్నాయ దేశాల వైపు వారు చూడడం ప్రారంభించారని ఇండీడ్ తెలిపింది. .

రెండేళ్ల క్రితంతో పోలిస్తే ఇపుడు కెనడాకు రెట్టింపు సంఖ్యలో భారతీయ ఉద్యోగార్థులు ఆసక్తి చూపారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2016 ఆగస్టు -2018జూలై మధ్య భారత్‌ నుంచి అమెరికాకు వెళ్లిన ఉద్యోగార్థుల వాటా 60 శాతం నుంచి 50 శాతానికి పడిపోయింది. మరోవైపు కెనడాలో ఇది ఆరు శాతం నుంచి 13 శాతానికి పెరిగింది.

కెనడాలో సైన్స్‌, సాంకేతికత, ఇంజినీరింగ్‌, గణిత రంగాల ఉద్యోగాలకు మంచి గిరాకీ ఉంది.  వలసల విధానం వల్లే కాక, కెనడాలో సాంకేతిక పరిజ్ఞాన పరిశ్రమకున్న వృద్ధి అంచనాల వల్ల కూడా విదేశీ ఉద్యోగార్థుల దరఖాస్తుల సంఖ్య పెరుగుతోంది. ఇక బ్రిటన్‌లో సాంకేతికత, ఫైనాన్స్‌, భాషా నైపుణ్యం వంటివాటిపై విదేశీ యువత ఆసక్తి చూపుతున్నారు.