జాతీయ రవాణా రంగంలో ట్రక్కుల విభాగం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్నది. ట్రక్ డ్రైవర్లుగా పని చేయడం కంటే ట్యాక్సీ డ్రైవర్లుగా పని చేయడం మేలన్న అభిప్రాయంతో డ్రైవర్లు ఉన్నారు.

ట్రక్కు డ్రైవర్లు లేక తలెత్తే వేల కోట్లలో నష్టాన్ని తగ్గించుకోవడానికి, ట్రక్ నడిపే డ్రైవర్లను ఆకర్షించేందుకు లాజిస్టిక్ కంపెనీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన రవాణా రంగాన్ని ఇప్పుడు డ్రైవర్ల కొరత వేధిస్తోంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 85 లక్షల వరకు ట్రక్కులున్నట్టు అంచనా. డ్రైవర్ల కొరత కారణంగా వీటిలో 30 శాతం ట్రక్కులు రోడ్డెక్కడం లేదట. ఇది వాహన యజమానులను ఆందోళనకు గురి చేస్తోంది.

డ్రైవర్ల కొరత కారణంగా ఏటా రూ.4.2 లక్షల కోట్ల నష్టం వస్తున్నట్టు ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఇప్పటికే డ్రైవర్ల కొరత తీవ్రంగా ఉందని, రానున్నకాలంలో ఇది మరింతగా పెరిగే ప్రమాదం ఉందని పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో టాటా మోటార్స్‌ ఇటీవలే ట్రక్‌ డ్రైవర్ల కోసం సరికొత్త కార్యక్రమం చేపట్టింది. డ్రైవర్ల ఆరోగ్యం-సంక్షేమం, బీమా, విద్య, ఆర్థిక ప్రణాళికలపై దృష్టి సారించింది. డ్రైవర్ల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో ఇలాంటి కార్యక్రమాలు ప్రారంభించాల్సిన అవసరం ఏర్పడుతోంది.  

రవాణా రంగంలో డ్రైవర్ల కొరతకు పలు కారణాలు ఉన్నాయి. విధులకు నిర్దేశిత సమయం ఉండకపోగా, సరైన సమయంలో ఆహారం, విశ్రాంతి లేకపోవడం ప్రధాన కారణాల్లో ఒకటి. ఇంటికీ, కుటుంబానికి సుదీర్ఘకాలం దూరంగా ఉండాల్సిన పరిస్థితులు నెలకొనడంతోపాటు ట్రక్కు డ్రైవర్లంటే సమాజంలో తగిన గౌరవం లభించకపోవడం ఇబ్బందికరంగా మారింది. 

ట్రక్‌ డ్రైవర్లకు నెలలో సుమారు రూ.21,000-28,000 వరకు జీతం అందుతుంటే టాక్సీ డ్రైవర్లకు రూ.50,000 వరకూ ఆదాయం లభిస్తోంది. ట్రక్ డ్రైవర్లతో పోలిస్తే ట్యాక్సీ డ్రైవర్లపై ఒత్తిడి కూడా తక్కువే. పారిశ్రామిక, సర్వీసుల రంగాల్లోనూ అంత నైపుణ్యం లేని వారికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. డ్రైవింగ్‌కన్నా ఈ రంగాల్లో పని చేయడం బాగుంటోందని చాలా మంది భావిస్తుండటం మరో కారణం. ట్రక్కు డ్రైవర్లుగా పని చేయడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం చాలా ఎక్కువ. 

కొన్నేళ్ల క్రితం వరకు డ్రైవింగ్‌ వృత్తిని ఎంచుకోవాలనుకునే వారు ముందు క్లీనర్లు, హెల్పర్లుగా చేరి వాహనాల నిర్వహణ పనులు చూసుకునే వారు. రెండుమూడేళ్ల తర్వాత సమకూరే అనుభవంతో డ్రైవర్లుగా మారేవారు.

ఇప్పుడు ఇలాంటి వారి సంఖ్య తగ్గిపోతోంది. యువత విద్యను అభ్యసిస్తూ మెరుగైన ఉపాధి మార్గాలపై దృష్టిసారిస్తుండటంతో డ్రైవింగ్‌ విభాగంలోకి వచ్చే వారి సంఖ్య తగ్గిపోతోంది.

ఒక వైపు వాహనాల సంఖ్య పెరుగుతుంటే.. మరోవైపు అందుకు అనుగుణంగా డ్రైవర్లు లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భారీ ట్రక్కులు, అధిక లోడ్‌ను మోసుకెళ్లే ట్రక్కులను నడిపేందుకు అనుభవం కలిగిన డ్రైవర్లు దొరకడం కష్టంగా మారుతోంది.
 
డ్రైవర్లు తగినంత టైం విశ్రాంతి పొందడంతోపాటు టైమ్‌కు సరైన భోజనం తినాల్సిన అవసరం ఉంటుంది. విశ్రాంతి లేకుండా వాహనాలు నడిపితే ప్రమాదాలు జరిగేందుకు ఎక్కువగా అవకాశాలుంటాయి. దీన్ని గుర్తించిన రవాణా కంపెనీలు తమ డ్రైవర్ల కోసం తగిన వసతులను కల్పిస్తున్నాయి. విశ్రాంతి గదులను ఏర్పాటు చేయడం, మంచి రెస్టారెంట్లలో భోజన సదుపాయం కల్పించడం వంటివి చేస్తున్నాయి.
 
ఇప్పటికిప్పుడు ట్రక్‌ డ్రైవర్ల సమస్యలను పరిష్కరించే అవకాశం లేకున్నా లాజిస్టిక్స్‌, రవాణా కంపెనీలు చేపడుతున్న కొన్ని చర్యలు, మౌలిక వసతులతో పరిస్థితుల్లో మార్పులు తేవొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. రోడ్లు, హైవేలు మరింత మెరుగ్గా మారుతున్నాయి. రహదారుల వెంట వసతులు మెరుగుపడుతున్నాయి. 

టోల్‌ ప్లాజాల వద్ద స్మార్ట్‌ టాగ్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇవి డ్రైవర్లపై ఒత్తిడిని తగ్గించవచ్చు. వాహనాలు స్మార్ట్‌గా మారిపోతున్నాయి. పవర్‌ స్టీరింగ్‌, డ్రైవర్‌ కేబిన్‌లో ఎయిర్‌కండీషనింగ్‌ వసతి, వాహనాల్లో మెరుగైన వీల్‌ యాక్సిల్‌, మంచి బ్రేకింగ్‌ వ్యవస్థ, యాంటీ స్కిడ్‌ టెక్నాలజీ వంటివి డ్రైవర్లపై ఒత్తిడిని తగ్గిస్తున్నాయి.

ట్రక్కుల యజమాన్యాలు డ్రైవర్లకు మెరుగైన వైద్య వసతులు కల్పిస్తున్నాయి. బీమా కవరేజీని ఇస్తున్నాయి. పనివేళలు తక్కువగా ఉండేలా చూస్తున్నాయి. ఇలాంటి చర్యల వల్ల మున్ముందు కొంత మేరకు డ్రైవర్ల కొరత తీరవచ్చని భావిస్తున్నారు.