ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘రెనాల్ట్’ తన కస్టమర్లకు సమ్మర్ ప్రీ క్యాంప్ ప్రారంభించింది. ఇందులో భాగంగా రోడ్‌పైనే అసిస్టెన్స్ అందించేందుకు, వారంటీ పొడిగించేందుకు సిద్ధమని తెలిపింది. విడి భాగాల కొనుగోళ్లు, సర్వీసులపై 10 శాతం నుంచి 50 శాతం వరకు రాయితీ అందచేస్తున్నట్లు ప్రకటించింది. ఇన్సూరెన్స్ రెన్యూవల్ సొల్యూషన్స్ అందుబాటులోకి తెస్తామని పేర్కొంది. 

ఈ నెల 22వ తేదీ నుంచి మొదలైన సమ్మర్ క్యాంప్ 28వ తేదీ వరకు కొనసాగుతుంది. కస్టమర్లు  ఎంపిక చేసిన విడి భాగాలు, యాక్సెసరీస్‌పై 10 నుంచి 50 శాతం రాయితీ, లేబర్ చార్జీలు, ఇతర వాల్యూయాడెడ్ సర్వీసులపై బిల్లులపై 15 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ప్రకటించింది రెనాల్ట్. 

ఫ్రీ కార్ టాప్ వాష్, ఎంపిక చేసిన బ్రాండ్ టైర్ల కొనుగోలుపైన ప్రత్యేక డిస్కౌంట్లు, ఇంజిన్ ఆయిల్ రీప్లేస్మెంట్‌పై 5 శాతం రాయితీ అందచేస్తున్నది. మై యాప్ రెనాల్డ్ వాడే కస్టమర్లకు అదనంగా ఐదుశాతం రాయితీ కల్పిస్తామని తెలిపింది. దేశవ్యాప్తంగా 450కు పైగా సర్వీస్ టచ్ పాయింట్ల వద్ద కాంప్రహెన్సివ్ చెకప్‌లు ఉంటాయని రెనాల్ట్ పేర్కొంది. 

ఈ నెల 30వ తేదీ వరకు మారుతి సమ్మర్ క్యాంప్
ఈ నెల 15న మొదలైన మారుతి సుజుకి సమ్మర్ క్యాంప్ 30వ తేదీ వరకు కొనసాగుతుంది. ఫ్రీ ఇన్స్‌పెక్షన్‌తోపాటు ఎయిర్ కండిషనర్లు, ఆయిల్ అండ్ కూలెంట్, బ్యాటరీ, ఎలక్ట్రికల్ సిస్టమ్, టైర్లపై కాంప్లిమెంటరీ హెల్త్ చెకప్ ఉంటుంది. 

ప్రతి రోజూ మారుతి సుజుకి 50వేలకు పైగా కార్లకు సర్వీస్ అందిస్తోంది. తాము నిర్వహిస్తున్న హెల్త్ క్యాంప్ వల్ల కస్టమర్లందరికీ లబ్ధి చేకూరుతుందని తాము విశ్వాసంతో ఉన్నామని మారుతి సుజుకి సర్వీస్ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పార్థో బెనర్జీ తెలిపారు. దేశవ్యాప్తంగా 2200 డీలర్ వర్క్ షాప్‌ల్లో ఉచిత సర్వీస్ క్యాంప్ అందుబాటులో ఉంటుంది. సమ్మర్ ఫిట్ వెహికల్ హెల్త్ చెకప్ క్యాంప్ కింద గతేడాది 2.20 లక్షల మంది కస్టమర్లు లబ్ధి పొందారు.