లెఫ్ట్ రికార్డు బద్దలు కొట్టిన మమత: విపక్షాల గగ్గోలు

Mamata banerjee wins more than a third of seats without contest
Highlights

పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెసు అధినేత, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తిరుగు లేనట్లే కనిపిస్తోంది.

కోల్ కతా: పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెసు అధినేత, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తిరుగు లేనట్లే కనిపిస్తోంది. మే 14వ తేదీన జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ లేకుండా 34 శాతం సీట్లను తృణమూల్ కాంగ్రెసు కైవసం చేసుకుంది. 

ఆ సీట్లలో ప్రతిపక్షాలకు అభ్యర్థులే లేకుండా పోయారు. శనివారం నామినేషన్లు ముగిసే సమయానికి ప్రతిపక్షాలకు సంబంధించిన అభ్యర్థులు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు.

రాష్ట్రంలో 58 వేల 692 పంచాయతీ సీట్లు ఉండగా, తృణమూల్ కాంగ్రెసు 20 వేల సీట్లు గెలుచుకుంది. పశ్చిమ బెంగాల్ చరిత్రలో అత్యధిక సీట్లను పోటీ లేకుండా గెలుచుకున్న ఘనత కూడా తృణమూల్ కాంగ్రెసుకు దక్కింది. 

గుడ్లు పొదగకుండానే కోడిపిల్లలు పుట్టాయని బెంగాల్ కాంగ్రెసు చీఫ్ అధీర్ రంజన్ చౌధురి వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని ఇది అపహాస్యం చేయడమేనని అన్నారు. పాలక పార్టీ భయబ్రాంతులకు గురి చేస్తుండడం వల్ల, హింసకు పాల్పడుతున్నందున తమ అభ్యర్థులు నామినేషన్లు వేయలేకపోతున్నారని ప్రతిపక్షాలు ఎన్నికల తేదీలు ప్రకటించినప్పటి నుంచి గగ్గోలు పెడుతూ వస్తున్నాయి. 

నామినేషన్లు వేయడానికి తమను కేంద్రాలకు రానీయడం లేదని ఫిర్యాదు చేయడంతో ఎన్నికల సంఘం వాట్సప్ ద్వారా 9 మంది నామినేషన్లను స్వీకరించింది. నామినేషన్లు దాఖలు చేసే తేదీ ప్రారంభమైన రోజున భీర్బూమ్ లోని జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయానికి ఈ నెలారంభంలో బైకర్లు కత్తులు, కటార్లు, గొడ్డళ్లు ప్రదర్శిస్తూ వచ్చారు. వారు ఏ పార్టీకి చెందినవారనేది తెలియలేదు. 

ఆ రోజు నామినేషన్లను స్వీకరించలేదు. నామినేషన్లు దాఖలు చేయడానికి సహాయం చేసేందుకు అదనంగా ఓ రోజు ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ రోజు హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. భీర్బూమ్ లో ఓ వ్యక్తి మరణించాడు.

అప్పటికి తృణమూల్ కాంగ్రెసు 72 వేలు, బిజెపి 35 వేలు, వామపక్షాలు 22 వేలు, కాంగ్రెసు 10 వేల నామినేషన్లు దాఖలు చేశాయి. భీర్భూమ్ లో ఏకగ్రీవమైన స్థానాలు ఎక్కువగా ఉన్నాయి. 

పాలక పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలవడం ఇది మొదటిసారేం కాదు. 2013లో ఆ రకంగా తృణమూల్ కాంగ్రెసు పదిశాతం సీట్లను గెలుచుకుంది. దానికి పదేళ్ల ముందు వామపక్షాలు 11 శాతం సీట్లను ఏకగ్రీవంగా గెలుచుకున్నాయి. మమతా బెనర్జీ వామపక్షాల రికార్డును బద్దలు కొట్టారు.

క్షేత్ర స్థాయిలో ప్రతిపక్షాలకు సంబంధాలు లేవని, అందువల్ల ఆ పార్టీలకు అభ్యర్థులు లభించలేదని తృణమూల్ కాంగ్రెసు వాదిస్తోంది. ఎన్నికలు యుద్ధంలాగా మారాయని లోకసభ మాజీ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ అన్నారు. కోర్టు ఆదేశాలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఉల్లంఘించిందని విమర్శించారు. 

loader