‘టీవీ’లకు బూస్ట్: ఓపెన్ సెల్ ప్యానెల్‌పై ఇంపోర్ట్ డ్యూటీ రద్దు

ఓపెన్ సెల్ ప్యానెళ్లపై దిగుమతి సుంకం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం ద్వారా టీవీ పరిశ్రమలో కేంద్ర ప్రభుత్వం జోష్ నింపింది. దీనివల్ల టీవీల తయారీ వ్యయం భారీగా తగ్గనున్నది. తద్వారా ఎల్ఈడీ ధరలు కూడా తగ్గుముఖం పట్టనున్నాయి. 

Govt scraps import duty on open cell TV panel to boost manufacturing

టెలివిజన్ పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం గొప్ప ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నది. దేశ ఆర్థిక వ్యవస్థను మాంద్యం చుట్టుముట్టిన నేపథ్యంలో ఉద్దీపనలకు తెరతీసిన మోదీ సర్కార్.. అమ్మకాల్లేక మందగమనంలో చిక్కుకున్న టెలివిజన్ తయారీ రంగానికి చేయూతనిచ్చింది.

ఇందులో భాగంగానే ఓపెన్ సెల్ టీవీ ప్యానెల్‌పై దిగుమతి సుంకం పూర్తిగా రద్దుచేసింది. దీంతో స్థానిక టీవీ తయారీదారులకు భారీ స్థాయిలో లబ్ది లభించనున్నది. అలాగే తగ్గుతున్న టీవీ ఉత్పాదక వ్యయం.. అటు వ్యాపారులకు, ఇటు కొనుగోలుదారులకూ పెద్ద ఎత్తున లాభించనున్నది. 

లిక్విఫైడ్ క్రిస్టల్ డిస్‌ప్లే (ఎల్‌సీడీ), లైట్ ఎమిట్టింగ్ డయోడ్ (ఎల్‌ఈడీ) టీవీ ప్యానెళ్ల తయారీలో వినియోగించే ఓపెన్ సెల్ (15.6 అంగుళాలు, అంతకంటే ఎక్కువ)పై దిగుమతి సుంకాన్ని తొలగిస్తున్నామని మంగళవారం రాత్రి పొద్దుపోయాక విడుదల చేసిన ఓ ప్రకటనలో కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.

ప్రస్తుతం ఈ ప్యానెళ్ల దిగుమతిపై 5 శాతం కస్టమ్స్ సుంకం పడుతున్నది. ఎల్‌ఈడీ టీవీల తయారీ వ్యయంలో 60 నుంచి 70 శాతానికిపైగా వాటా ఓపెన్ సెల్ ప్యానెళ్లదే.

చాలావరకు ఉత్పాదక సంస్థలు వీటిని విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయం ఈ సంస్థలన్నింటికీ కలిసి రానున్నది. దాదాపు 3 శాతం టెలివిజన్ తయారీ ఖర్చులు తగ్గనున్నాయి. 

ఓపెన్ సెల్ టీవీ ప్యానెల్స్ తయారీకి వినియోగించే ఫిల్మ్ చిప్, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు అసెంబ్లీ (పీసీబీఏ), సెల్ (గ్లాస్ బోర్డు/సబ్‌స్ట్రేట్)లపైనా కస్టమ్ డ్యూటీని కేంద్రం ఎత్తివేసింది. 2017 జూన్ 30న ఈ ప్యానెళ్లపై కేంద్రం 5 శాతం కస్టమ్స్ సుంకాన్ని విధించింది. 

దీన్ని పలు టెలివిజన్ తయారీ సంస్థలు, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లియెన్సెస్ ఉత్పాదకదారులు వ్యతిరేకించి, వెనుకకు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే ప్రస్తుత మాంద్యం నేపథ్యంలో ఈ సుంకాన్ని కేంద్రం ఉపసంహరించుకున్నది.

తాజా నిర్ణయం నేపథ్యంలో తమకు కలిగే లాభాన్ని కస్టమర్లతో పంచుకుంటామని పానసోనిక్ తెలిపింది. ‘3-4 శాతం ప్రయోజనం చేకూరుతున్నదని, దాన్ని తమ వినియోగదారులకు అందిస్తామని ఆ సంస్థ వెల్లడించింది.

ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. తయారీ ఖర్చుల విషయంలో పరిశ్రమపై ఉన్న ఒత్తిడి చాలావరకు తగ్గుతుంది. ఈ లాభాన్ని కొనుగోలుదారులకు అందిస్తే.. అమ్మకాలు మళ్లీ పుంజుకుంటాయి’ అని పానసోనిక్ ఇండియా, దక్షిణాసియా అధ్యక్షుడు, సీఈవో మనీష్ శర్మ పీటీఐతో అన్నారు. 

భారీ టెలివిజన్ సెట్లపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పెంపు, మార్కెట్‌లో పెరిగిన పోటీ, మందగమన పరిస్థితుల కారణంగా దేశంలో టీవీలకు డిమాండ్ సన్నగిల్లిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

అయితే ఓపెన్ సెల్ ప్యానెళ్లపై దిగుమతి సుంకం రద్దు వల్ల ఉత్పాదక వ్యయం చెప్పుకోదగ్గ స్థాయిలోనే దిగివస్తున్నదని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ నిర్ణయం పరిశ్రమకు ఎంతగానో లాభమని సదరు వర్గాలు పేర్కొంటున్నాయి.

వచ్చే పండుగ సీజన్‌కు ముందు మార్కెట్‌లో టెలివిజన్ అమ్మకాలకు ఊతమిచ్చే నిర్ణయం ప్రభుత్వం తీసుకుందని వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

టెలివిజన్ల తయారీ, ముఖ్యంగా ఎల్‌సీడీ, ఎల్‌ఈడీల ఉత్పత్తిలో సగానికిపైగా విలువైన ఓపెన్ సెల్ ప్యానెళ్ల దిగుమతిపై కస్టమ్స్ సుంకాన్ని ఎత్తివేయడం.. ధరలను గణనీయంగా తగ్గిస్తుందని అభిప్రాయపడుతున్నారు.

ఇదే జరిగితే టీవీల అమ్మకాలు ఈసారి విపరీతంగా జరుగడం ఖాయమని వారు అంచనా వేస్తున్నారు. పండుగ ఆఫర్లకుతోడు ఈ ధరల తగ్గింపు కస్టమర్లను కొనుగోళ్ల వైపునకు మళ్లిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. 

దేశంలో టెలివిజన్ తయారీ పరిశ్రమ బలపడుతుందని టీవీ ఉత్పాదక రంగం స్వాగతించింది. ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా, సోనీ ఇండియా, హైయర్ ఇండియా సంస్థల అధిపతులు ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు.

మేక్ ఇన్ ఇండియాకు మద్దతునిచ్చిందని అభిప్రాయపడ్డారు. ఈ సుంకం వల్లే శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ గతేడాది తమ తయారీ కేంద్రాన్ని భారత్ నుంచి వియత్నాంకు తరలించింది. 

ఈ క్రమంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం.. మళ్లీ విదేశీ టెలివిజన్ తయారీ దిగ్గజాలను భారత్‌కు రప్పించగలదన్న ఆశాభావం వ్యక్తమవుతున్నది. 32 అంగుళాలు, అంతకంటే ఎక్కువ శ్రేణి టెలివిజన్లపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తే.. పరిశ్రమకు మరింత మేలు చేసినవారవుతారని శర్మ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios