చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి

4 Killed In Road Accident In Chittoor
Highlights

మరో నలుగురి పరిస్థితి విషమం

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పీలేరు మండలంలో జరుగుతున్న నల్లగంగమ్మ జాతరలో డప్పు వాయించడానికి వచ్చిన వారిని లారీ రూపంలో మృత్యువు వెంటాడింది. సిమెంట్ లోడ్ లతో వెళుతున్న ఓ లారీ అదుపుతప్పి రోడ్డుపక్కన నడుచుకుంటూ వెళుతున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని పీలేరు మండలం తానా వడ్డిపల్లి గ్రామంలో నల్లగంగమ్మ జాతర జరుగుతోంది. ఈ జాతరలో డప్పు వాయించడానికి  నిమ్మనిపల్లి మండలం కొండసానిపల్లికి చెందిన కొందరు కళాకారులు వడ్డిపల్లికి వచ్చారు. జాతర ముగియడడంతో తిరిగివెళ్తున్న క్రమంలో వీరు ప్రమాదానికి గురయ్యారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా మితిమీరిన వేగంతో వస్తున్న ఓ లారీ అదుపుతప్పి వీరిపైకి దూసుకువచ్చింది. దీంతో నారాయణ, జయరాం, గుర్రప్ప, వెంకటరమణ అనే కళాకారులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలవగా తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ప్రమాదానికి లారీ డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగే కారణమని పోలీసుల ప్రాథమికంగా నిర్ధారించారు. బ్రేక్ ఫెయిల్ కావడమో లేదా డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.


   

loader