ప్రియుడిని కలిసేందుకు బయటికొచ్చినందుకు యువతిని దారుణంగా కొట్టిన అమానుష ఘటన ఒడిశాలో ఆలస్యంగా వెలుగుచూసింది. రెండునెలల కిందట జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెడితే.. 

ఒడిశా నవరంగ్‌పూర్ జిల్లాలోని రాయ్‌గఢ్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో .. పెద్దమనుషుల పంచాయతీ పెట్టి ఫైన్ ఆ యువతి ప్రియుడికి ఫైన్ కూడా వేశారు. 
గ్రామానికి చెందిన యువతి, సమీపంలోని పూజారిపరకి చెందిన జగదీష్ కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. గత జూలై నెలలో యువతి ప్రియుడిని కలిసేందుకు వెళ్తున్న విషయం ఆమెకు సోదరుడి వరసయ్యే శిశుపాల్‌కి తెలిసింది. 

దీంతో తన స్నేహితులతో కలసి చెల్లెలిని వెంబడించిన శిశుపాల్.. ఆమెను అడ్డకున్నాడు. స్నేహితులతో కలసి కర్రలతో తీవ్రంగా కొట్టారు. తప్పించుకునేందుకు ఆమె పరిగెడుతున్నా వెంటాడి అమానుషంగా దాడి చేశారు. అంతేకాదు చెల్లెలిని తీసుకెళ్లి రచ్చబండ వద్ద పెద్ద మనుషుల పంచాయితీ పెట్టారు. 

అక్కడికి ఆమె ప్రియుడు జగదీష్‌ని కూడా పిలిపించిన గ్రామ పెద్దలు ఇద్దరివీ వేర్వేరు కులాలని.. నష్టపరిహారం కింద రూ.60 వేలు కట్టాలని ఆదేశించారు. భయపడిపోయిన యువకుడి కుటుంబం అందుకు అంగీకరించింది. అప్పటికప్పుడు తమ వద్ద ఉన్న రూ.20 వేలు చెల్లించి మిగిలిన సొమ్ము తర్వాత చెల్లిస్తానని చెప్పి జగదీష్ కుటుంబం వెళ్లిపోయింది. అనంతరం జగదీష్ పనుల కోసం వేరే రాష్ట్రానికి వెళ్లిపోయాడు.

యువతిని కొడుతున్న సమయంలో యువకులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది కాస్తా వైరల్‌‌గా మారడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శిశుపాల్ తో సహా అతని స్నేహితులు దినేష్, నరసింగను అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు.