అమెరికా ఉపరాష్ట్రపతి జేడీ వాన్స్ తన భార్య ఉషా, ముగ్గురు పిల్లలతో సోమవారం ఉదయం ఢిల్లీలో అడుగుపెట్టారు. ఇది అధికారిక పర్యటన అయినా, వ్యక్తిగతంగా కూడా ఎంతో ప్రత్యేకం. ఉషా వాన్స్ భారత సంతతి వ్యక్తి, అందులోని తెలుగు మ‌హిళ కావ‌డం ఈ ప‌ర్య‌ట‌న ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ఇంత‌కీ జేడీ వాన్స్ భార‌త్ ఎందుకు వ‌స్తున్నారు.? దీంతో మ‌న‌కు జ‌రిగే ప్ర‌యోజ‌నం ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం..  

ఈ పర్యటనలో భాగంగా వాన్స్ ప్రధాని మోదీతో సోమవారం సాయంత్రం 6:30కి భేటీ అవుతారు. విందుకు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు కూడా హాజరవుతారు. ఇండియా-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాన్ని జూలై లోపు ఖరారు చేయాలన్న లక్ష్యంతో చర్చలు జరుగుతున్నాయి. ట్రంప్ ప్రభుత్వం భారత దిగుమతులపై పన్నులు పెంచే ప్రమాదం ఉన్న నేపథ్యంలో, ఈ ఒప్పందం అత్యవసరమైంది.

2024లో ఇండియా-అమెరికా వాణిజ్యం $129 బిలియన్‌కు చేరింది. ఇందులో భారత్‌కు $45.7 బిలియన్ లాభం ఉంది. భారత్, అమెరికా దిగుమతుల్లో సగానికి పైగా టారిఫ్ తగ్గించేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. రక్షణ ఒప్పందాలపై క‌స‌రత్తు జ‌రుగుతోంది. జావెలిన్ క్షిపణులు, స్ట్రైకర్ యుద్ధ వాహనాల కొనుగోలు, ఉత్పత్తి చర్చలు కొనసాగుతున్నాయి. రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ వచ్చే నెలల్లో భారత్ రానున్నారు.

Scroll to load tweet…

వాన్స్ కుటుంబంతో పాటు పర్యటన కొనసాగుతోంది. ఢిల్లీలో సమావేశాల తర్వాత కుటుంబం జైపూర్, ఆగ్రా, తాజ్ మహల్, శిల్పగ్రామం వంటి ప్రాంతాలను సందర్శించనుంది. ఇది ఒక విధంగా 'కుటుంబంతో ముడిపడిన సాంస్కృతిక దౌత్యంగా చెప్పొచ్చు. ట్రంప్-మోదీ మధ్య ఏర్పడిన వ్యక్తిగత సంబంధాలు, ఇప్పుడు వాన్స్ ద్వారా కొనసాగుతున్నాయి. రాజకీయ పరిణామాల మధ్య ఇలా వ్యక్తిగత అనుబంధాలు దేశాల మధ్య గాఢమైన సంబంధాలకు బలాన్నిస్తాయి. మ‌రి వీరిద్ద‌రి భేటీ త‌ర్వాత ఎలాంటి ప్ర‌క‌ట‌న‌లు వ‌స్తాయో చూడాలి.