తియ్యగా ఉంటుందని రసగుల్ల తింటే ప్రాణం పోయింది.. శ్వాసనాళంలో ఇరుక్కుపోవడంతో
Viral News: అదృష్టం బాగాలేకపోతే అరటి పండు తిన్నా పన్ను విరుగుతందనే సామెత వినే ఉంటాం. అయితే ఇలాంటి ఓ సంఘటన నిజంగా జరిగింది. తియ్యగా ఉండే రసగుల్ల తింటూ ఓ వ్యక్తి మరణించిన సంఘటన దేశవ్యాప్తంగా వైరల్‌గా మారింది.

పెళ్లి వేడుకలో విషాదం
ఝార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో జరిగిన ఒక పెళ్లి వేడుకలో దుర్ఘటన చోటుచేసుకుంది. 41 ఏళ్ల వ్యక్తి రసగుల్లా తింటుండగా అది అకస్మాత్తుగా శ్వాసనాళంలో ఇరుక్కుపోయింది. కొన్ని సెకన్లలోనే ఆయనకు శ్వాస తీసుకోవడం కష్టమైంది. చుట్టుపక్కల ఉన్నవారు సహాయం చేయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ఆయన మరణించారు. డాక్టర్ల ప్రకారం, ఆహారం పూర్తిగా శ్వాసనాళాన్ని బ్లాక్ చేయడంతో ఆక్సిజన్ శరీరానికి చేరలేదని తెలిపారు.
ఆహారం శ్వాసనాళంలో ఎందుకు ఇరుక్కుంటుంది?
మనం తినే సమయంలో ఆహారం నోటినుంచి గొంతు ద్వారా కడుపులోకి వెళ్తుంది. ఈ ప్రక్రియలో శ్వాసనాళం కొంతసేపు మూసుకుపోతుంది, తద్వారా ఆహారం తప్పు దిశలో వెళ్లకుండా కాపాడుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఆహారం సరిగా నమలకపోతే, త్వరగా మింగడం వల్ల, మాట్లాడుకుంటూ తినడం వల్ల, ఆహారం శ్వాసనాళంలోకి వెళ్లి ఇరుక్కుపోయే ప్రమాదం ఉంటుంది.
శ్వాసనాళంలో ఇరుక్కుంటే కనిపించే లక్షణాలు
శ్వాసనాళంలో ఆహారం ఇరుక్కుపోతే కొన్ని స్పష్టమైన లక్షణాలు కనిపిస్తాయి. మాట్లాడలేకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గట్టిగా లేదా వింతగా శబ్దం చేస్తూ శ్వాస తీసుకోవడం, తీవ్రమైన దగ్గు, ముఖం ఎరుపు లేదా నీలం రంగులో మారడం, తీవ్రమైన పరిస్థితిలో స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలి.
వెంటనే అందించాల్సిన ప్రాథమిక చికిత్స
వెంటనే చేయాల్సిన ఫస్ట్ ఎయిడ్ చర్యలు. ఇలాంటి సమయంలో ఆలస్యం చేయకూడదు. వెంటనే వ్యక్తిని గట్టిగా తగ్గుమని చెప్పాలి. ఇలా చేస్తే ఆహారం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వ్యక్తిని ముందుకు వంచి, వెనుక భాగంలో గట్టిగా తట్టాలి. పరిస్థితి మారకపోతే, వ్యక్తి వెనుక నిలబడి పొట్ట పైభాగంపై ఒత్తిడి ఇవ్వాలి. దీంతో ఇరుక్కున్న ఆహారం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది.
ఇది ప్రాణాంతక పరిస్థితి
ఇలా శ్వాసనాళంలో ఆహారం ఇరుక్కోవడం అనేది ప్రాణాంతక పరిస్థితి. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. మటన్ బొక్క ఇరుక్కొని మరణించిన సందర్భాలు కూడా చూశాం. అందుకే ఈ సమస్యను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. వ్యక్తి శ్వాస తీసుకోలేకపోయినా, మాట్లాడకపోయినా తక్షణమే ఎమర్జెన్సీ సేవలకు కాల్ చేయాలి, ఆసుపత్రికి తీసుకెళ్లాలి.

